
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని (ఎఫ్‌పీసీ) మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, బలమైన పర్యవేక్షణకు వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేస్తోంది. తద్వారా ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు భాగస్వాములవుతారు. కార్యక్రమం అమలు సంతృప్తస్థాయిలో జరుగుతోందా లేదా ఏమైనా మార్పులు చేయాలా అన్న విషయాలతోపాటు వివిధ అరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
ఇంతే కాకుండా ప్రజారోగ్య సమస్యలపై వైద్యులు, సిబ్బందికి కళాశాలల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ బాధ్యతలను వైద్య కళాశాలల్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాలకు అప్పగించారు. ఈ విభాగం వైద్యులను నోడల్ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించి భవిష్యత్ కార్యాచరణపై త్వరలో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు.
లక్ష్యం మేరకు ఎఫ్‌పీసీ అమలవుతోందా, ఇతర అంశాలను అంచనా వేయడానికి చెక్ లిస్ట్‌ను కూడా రూపొందించారు. దీని ఆధారంగా ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి మూడు నెలలకు ఒకసారి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యక్రమంలో అవసరమైన మార్పులు చేస్తారు.
ప్రజల్లో చైతన్యం కల్పించేలా
ఎఫ్‌పీసీలో భాగంగా వైద్య విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. ప్రస్తుతం గ్రామాల్లోనూ మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి నాన్ కమ్యూనికబుల్(ఎన్‌సీడీ) వ్యాధుల బాధితులు పెరుగుతున్నారు. వీటితోపాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం, ఆ సమస్యలతో బాధపడుతున్న వారు మందులు సరిగా వాడకపోవడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఎఫ్‌పీసీలో నమోదయ్యే వివరాల ఆధారంగా ప్రజారోగ్య సమస్యలపై వైద్య విద్యార్థుల ద్వారా అధ్యయనాలు చేపడతారు.
88 లక్షల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం
గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలవుతోంది. ఇప్పటివరకు 88.4 లక్షల మంది సొంత ఊళ్లలోనే వైద్య సేవలు పొందారు. వీరిలో 31.40 లక్షల మంది జనరల్ ఓపీ సేవలు అందుకున్నారు. మిగిలిన వారిలో 5.64 లక్షల మంది గర్భిణులు, 2.62 లక్షల మంది బాలింతలు, 25.41 లక్షల మంది రక్తపోటు, 18.18 లక్షల మంది మధుమేహం, 40 వేల మంది రక్తపోటు, మధుమేహం బాధితులు, 38 వేల మంది రక్తహీనత బాధితులు, ఇతరు అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులు ఉన్నారు.
మూడు ప్రధాన ఉద్దేశాలు
ఎఫ్‌పీసీలో వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయడం వెనుక మూడు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. కార్యక్రమాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం మొదటిది. కార్యక్రమం అమలును మూల్యాంకనం చేయడం రెండోది. వివిధ ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం మూడోది. ఈ అంశాల ఎజెండాగానే కమ్యూనిటీ మెడిసిన్ పనితీరు ఉంటుంది. ఇందుకోసం ప్రజారోగ్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగాలతో సమన్వయం చేసుకుంటాం.
– డాక్టర్ నీలిమ, కోఆర్డినేటర్, ఫ్యామిలీ డాక్టర్ విధానం