మృణాళిని పేరుతో నామినేషన్ వేయించిన కళా
భార్యను కాకుండా కుమార్తెను తెరపైకి తెచ్చిన బాబ్జీ
జెడ్పీ పీఠంపై పట్టు వీడని ఇరువర్గాలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై కింజరాపు, కళా వర్గాల మధ్య సాగుతున్న పోరు ఊహించని మలుపులతో మరింత రాజుకుంటోంది.కింజరాపు వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుటుంబ సభ్యులకు జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు మాజీ మంత్రి కళావెంకటరావు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా.. తామేం తక్కువ తినలేదన్నట్లు ఆయనకు దీటుగా కింజరాపు శిబిరం ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే ముందుగా అనుకున్నట్లు బాబ్జీ భార్యతోపాటు కాకుండా ఆయన కుమార్తె చైతన్యతో గురువారం ఎచ్చెర్ల జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించారు.
మరోవైపు తన మరదలు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ కిమిడి మృణాళిని పేరుతో తన అనుచరుల చేత కళా వెంకట రావు జి.సిగడాం జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయించారు. మృణాళినికి అవకాశమిచ్చే విషయంలో పార్టీ అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవచ్చన్న అనుమానంతో ముందుగానే తమ సామాజికవర్గానికే చెందిన సామంతుల దామోదర్‌తో పాలకొండ నుంచి నామినేషన్ వేయిం చిన ఆయన.. గురువారం మధ్యాహ్నం అనూహ్యంగా మృణాళిని పేరుతో నామినేషన్ వేయించారు.
దీంతో కళా వర్గానికి చెందిన ఇద్దరు జెడ్పీ పీఠం బరిలో నిలిచారు. ముందు బాబ్జీ కుటుంబానికి పీఠం దక్కకుండా చేస్తే.. తర్వాత తన వర్గీయులిద్దరిలో ఒకరికి ఖరారు చేసుకోవచ్చన్నది కళా వ్యూహం. బాబ్జీ కుమార్తె నామినేషన్ వేసినప్పటికీ బి-ఫారం మాత్రం కళానే ఇవ్వాల్సి ఉంది. ఇక్కడకూడా కళా తన ప్రతాపం చూపించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రసపట్టులో టీడీపీ వర్గపోరు
Published Fri, Mar 21 2014 3:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement