
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు తరలివస్తున్నారు. పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో బాబ్జీ భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరిన ఆయనను వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన అనంతరం బాబ్జీ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఒక యజ్ఞమని కొనియాడారు. రాష్ట్ర అవసరాలు దగ్గరి నుంచి గమనించి.. వాటినుంచి వైఎస్ జగన్ ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలతో రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశముందన్నారు. యంగ్ జనరేషన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అవకాశమిస్తే తప్పకుండా పాలకొల్లు నుంచి పోటీ చేస్తానని చెప్పారు.