Palakollu Assembly constituency
-
పెద్దారెడ్డి టాక్స్: ‘తగ్గడంలో ఉంది మజా..!’
అదేందబ్బయ్యా అదీ.. అత్తను పుట్టింటికి తోడుకోని పోడానికొచ్చి, డైవరు యేసం గట్టి ఒక సినిమా జేసినావే.. ఆ సిన్మాలో నువ్వేదో అత్త ఎదురుగా మోకాళ్ల మీద కూలబడంగానే.. నీ తెలివితేటల గురించి ఆ ఎమ్మెస్సు ఏదో అంటాడే ఏందబ్బయ్యా అది?. ‘ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు’ అనే గదా..! అవునబ్బయ్యా.. సరైన మాటే అన్నాడు. ఆడు సినిమాలో జెప్పిన డైలాగుదేముండాది గానీ.. నువు నిజంగానే శానా శానా గొప్పోడివబ్బయ్యా.. ‘తగ్గడం’లో మజా తెలిసిన నీబోటి పొలిటీషియన్ ఇయ్యాల రేపట్లో బూపెపంచికంలోనే లేడంటే లేడు గదా!.. నిరుడు ఎలచ్చన్లు జరిగే యేళకి ఎన్ని మాటలు జెప్పినావబ్బయ్యా! ఎగిరెగిరి మాట్లాడినావు గదా.. జుట్టు ఎగదోసుకుంటా సెంద్రబాబుని తూర్పారబట్టినావు గదా! ఈ స్టేటుని నాశినం బట్టించినాడని మెడ రుద్దుకుంటా డైలాగులేసినావు గదా..! మరేటయ్యిందీ.. ఈసారి ఎలచ్చనొచ్చేపాటికి ఆయనేమో నీకు ఉన్నపళంగా దేవుడైపొయినాడా? ఆయన పల్లకీ మొయ్యాల్సిందే అని కుశాలపడతన్నావు గదా! యింతకంటె తగ్గడంలోని మజా యింకోటి యేముండబోతాది అబ్బయ్యా! పాపం.. కాపు కులపోళ్లంతా నిన్ను నమ్ముకోని రాజకీయంగా తమ కులానికేదో వైబోగం పట్టబోతాదని యిన్నాళ్లుగా కళ్లలో వత్తులేసుకోని యెదురుజూస్తాంటే.. వోళ్లందరికీ షాకు మీద షాకిచ్చినావు గదా! యే వూరికైనా పో.. నిన్ను నమ్ముకున్న కులం మనుషుల్లో ఎవురినైనా పలకరించు.. గుండెలమీద సెయ్యేసుకోని నికార్సుగా నిజం జెప్పమని అడుగు! గుండె నిబ్బరం జేసుకోని యిను. అప్పుడు జెప్తారబ్బయ్యా.. కులాన్నంతా కట్టగట్టుకోని తీసకపొయ్యి సెంద్రబాబు కాళ్లకాడ పడేస్తాండావని. ఒక్కొక్కడూ యెంతెంత కుమిలిపోతా వుండారో..? ‘సెంద్రబాబు గోరి ఎక్స్పీరియెన్సు ఈ స్టేటుకి శానా శానా గావాల.. కాబట్టి మన పార్టీ వోళ్లందరూ.. పచ్చజెండాలు ఎత్తాల.. పంచెలెగ్గట్టుకోని ఆయన పల్లకీ మొయ్యాల.. అని నంగి మాటలు జెప్పబోక! యీసారి ఎలచ్చన్లలో ఒక్క సీటైనా గెలస్తామో లేదో అనే నీ బయ్యంలో పార్టీని మటుకే కాదు అబ్బయ్యో.. కులానికి మొత్తం కడుపుమంట బెడితివే. తగ్గడం అంటే అదేననుకోవాలా యెట్టా? ఇప్పుడు లేటెస్టుగా నువ్వు తగ్గిన తమాసా వుండాదే.. అది యింకా యిచిత్రం! మొన్న మొన్నటిదాకా ఆ ముద్రగడ పెద్దాయిన నీ పరువు తీసినాడు! ‘వురేయ్ నాయినా.. ఆ సెంద్రబాబు మన కాపుల్ని బీసీ కులాల్లో పెట్టిస్తానన్జెప్పి నట్టేట ముంచినాడురా! ఆయన పంచన జేరి, ఆయన మోచేతి నీళ్లు తాగతా బతకతాండావేందిరా..’ అనేసి నిన్ను నానా మాటలూ అనేసినాడు. ఆ మాటకొస్తే సెంద్రబాబు నాయుడు ఎంత మోసకారి మడిసో, నువ్వెంత సేతగాని నాయకుడివో ఆయనంత బాగా యిడమరిసి సెప్పిన పెద్దమడిసి యింకోడు లేడంటే నమ్ము. నీ బాగోతాన్ని పేజీలు పేజీలుగా లెటర్లురాసి నడిబజార్లో బండారం బయటపెట్టేసినాడు గదా. తగుదునమ్మా అంటా యిప్పుడు బొయ్యి.. అదే పెద్ద మడిసిని వాటేసుకోబోతండావా అబ్బయ్యా! ఆ సినిమా డైలాగులో మాదిరిగా.. ‘తగ్గడం’ అంటే యేంటో, యెక్కడెక్కడ తగ్గాల్నో నిన్ను జూసే యీ పెపంచికం మొత్తం నేర్చుకోవాల గాబోలు. అదేదో సినిమాలో మన నెల్లూరు రవణా రెడ్డి పాడింది నీకు గెమనముండాదా అబ్బయ్యా..? ‘జుట్టు పట్టుకుని బయటకీడ్సినా.. సూరు పట్టుకుని యేళ్లాడీ.. దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవోడికి బలే చాన్సులే..’ అంటా రాగాలుదీసి మరీ పాడినాడు గదా! అప్పుడెప్పుడో నేను సిన్నప్పుడు సినిమానే గానీ.. అచ్చంగా యిప్పుడు నువ్వుండే సీనుకు తగ్గట్టుగానే పాడినట్టు అనిపిస్తా వుండాదబ్బయ్యా..!. అంతగా నీ సేతగానితనాన్ని అగ్నానాన్ని తిట్టిపోస్తే.. అయ్యన్నీ ఆశీస్సులే అని మురిసిపోతున్నట్టుగా.. రేపోమాపో ఆ ముద్రగడ పెద్దాయన యింటికి బొయ్యి వాటేసుకోబోతండావే.. నా పార్టీలోకి రమ్మని ఎర్రతివాచీ పరచబోతావుండావే.. తగ్గడంలో మజా తెలిసిన మగానుబావుడివి అబ్బయ్యా! స్టేజీ ఎక్కినావంటే సాలు.. సేతికి మైకు దొరికిందంటే సాలు.. దాన్సిగదరగా.. స్టేట్‌లో వుండే కులాల పేర్లన్నీ యేకరవు పెట్టేస్తావు. ఆల్లందరికీ రాజ్జాధికారం దక్కడం లేదంటా పెద్దపెద్ద డైలాగులు యేసేస్తావు. ఆల్లందరికీ అధికారం యిచ్చేస్తా.. అనేసి డైలాగులు కొడతావు. అక్కడికేదో సీఎం సీటు పప్పులు బెల్లాలు పంచినట్టుగా అన్ని కులాలోల్లకి పంచేస్తా అన్నట్టుగా వుంటాది నీ తమాసా! అయినా అబ్బయ్యా.. నువ్వు మోసే పల్లకీ మీద ఆ కులాల వోళ్లంతా యెక్కబోతండారా? యేందీ? సెంద్రబాబు వొక్కడే గదా? ఆ మాత్రం యింగితం నీకు లేకపోతే యెట్టా? మైకు దొరికితే వంద కులాల పేర్లు సదవతావు గానీ.. పార్టీ కాడికి, ఎలచ్చను కాడికి వొచ్చేసరికి నీకులమొక్కటే నీకు కావాల. నీ కులం ఓటు రవ్వంత కూడా సీలి పక్కకిపోకూడదనే యావ! నీ కులం ఓటు సీలిందా.. నీ రాజకీయ బతుకు సీటీ సిరిగినట్టే అని నీకు బయ్యం! అందుకే గదా.. నిన్నటిదాకా తిట్టిపోసిన పెద్దాయనకి యేం బిస్కెటు యేసినావో యేమో.. యియ్యాల పొయ్యి వాటేసుకోబోతండావు! అబ్బయ్యా.. నువ్వో సంగతి గేపకం పెట్టుకోవాల. జనం నీ మాటలు యిని యిజిళ్లు గొడతావుండారని మురిసిపోతండావో యేందో..? లోపల్లోపల కులం కార్డు యేస్తే జనం డంగైపోతారని ఆశపడతండావో యేందో? ఆ పప్పులేం వుడికేది లే! జనం యిదివరకటిలాగా యెర్రిబాగులోళ్లు కారు అబ్బయ్యా..! శానా తెలివి మీరిపోయుండారు? కులాన్ని బట్టి గాదు.. మంచి జేసే మడిసిని బట్టి ఓట్లేస్తారు! నీకేం దిగులక్కర్లేదులే అబ్బయ్యా.. ఎలచ్చను తర్వాత గ్యాప్ లు లేకుండా షూటింగులకు కాల్షీట్లు యిచ్చేసుకో.. అప్పుటికి పూర్తిగా కాళీ అయిపోతావు గదా! -నెల్లూరు పెద్దారెడ్డి. -
పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి డాక్టర్ బాబ్జీ ప్రచారం
-
బంగారు విజేత..మన ఉషమ్మ
సాక్షి, పాలకొల్లు : పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల అభ్యర్థులు సత్తాచాటారు. 2009లో శాసనసభ ఎన్నికల్లో బంగారు ఉషారాణి అద్భుత విజయాన్ని నమోదు చేసి నియోజకవర్గం నుంచి చట్టసభల్లోకి కాలుమోపిన ఏకైక మహిళగా రికార్డులకెక్కారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఇక్కడి నుంచి పోటీ చేశారు. సినీనటుడు కావడంతో ప్రజారాజ్యం పార్టీకి మంచి గాలి ఉంటుందని అందరూ భావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ చాతుర్యం ప్రదర్శించి మైనార్టీ ఓట్లు కలిగిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన బంగారు ఉషారాణిని మెగాస్టార్ చిరంజీవిపై పోటీకి నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవిని ఓడించి ఉషారాణి అనూహ్య విజయం సాధించారు. దీంతో అందరూ ఆమెను జెయింట్ కిల్లర్‌గా అభివర్ణించారు. -
చైతన్య సిరి..క్షీరపురి
సాక్షి, పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. బ్రిటిష్ కాలంలోనే వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందింది. పారిశ్రామికంగానూ ప్రగతి సాధించింది. రైస్‌మిల్లులకు ప్రసిద్ధి. కొబ్బరి, నిమ్మ, తమలపాకు ఉత్పత్తులు నిత్యం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. భౌగోళిక స్వరూపం పాలకొల్లు నియోజకవర్గం 180చదరపుకిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పున వశిష్టగోదావరి, పడమరన భీమవరం, ఉత్తరాన ఆచంట, దక్షిణాన నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొల్లు మున్సిపాలిటీలో 31వార్డులు, యలమంచిలి మండలంలో 32 గ్రామాలు, పాలకొల్లు మండలంలో 27 గ్రామాలు, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 67 గ్రామాలతో నియోజకవర్గం విస్తరించింది. దిగ్గజ కళాకారుల జన్మస్థానం ఈ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఆ నాటి అత్యం సూర్యం, పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి పద్మశ్రీ అల్లు రామలింగయ్య, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎస్ఎస్ రవిచంద్ర, బందెల భాస్కరరావుతోపాటు అనేక మందిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత పాలకొల్లుకు దక్కింది. సినీ రంగంలోని అన్ని విభాగాల్లోనూ పాలకొల్లు మార్కు ఉంటుంది. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వరస్వామి ఇక్కడ కొలువు కావడంతో ఆ నటరాజస్వామి ఆశీస్సులతో ఇంతమంది కళాకారులు ఉద్భవించారని ప్రతీతి. చారిత్రక ప్రాముఖ్యం పాలకొల్లు పట్టణం 11 శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఉండేది. ఈ సమయంలోనే క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం, గాలిగోపురం నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. పంచారామక్షేత్రాల్లో క్షీరారామం శిరోభాగంగా విరాజిల్లుతోంది. అలాగే శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం, నరసాపురం రోడ్డులోని శ్రీ షిర్డి సాయి మందిరంతోపాటు, వాయుత్రిలింగ క్షేత్రాలుగా శివదేవునిచిక్కాల, దిగమర్రులోని శివాలయాలు ప్రసిద్ధిచెందాయి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. వ్యవసాయమే జీవనాధారం నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణవాతావరణం. ప్రజల జీవనాధారం వ్యవసాయం. ముఖ్యంగా వరి, కొబ్బరి, నిమ్మ, తమలపాకు, అరటి పంటలు సాగవుతాయి. 15ఏళ్లుగా ఆక్వా సాగు విస్తరించింది. వరిచేలు చెరువులుగా మారాయి. ఈ ప్రాంతం నుంచి రోజూ వంద లారీల రొయ్యలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రాజకీయ నేపథ్యం పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. 2004వరకు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల మధ్యే ప్రధాన పోరు జరిగింది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గెలుపొందారు. 1955లో అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, దాసరి పెరుమాళ్లు (ఎస్సీ రిజర్వుడు) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1962లో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 1967లో పోలిశెట్టి శేషావతారం సీపీఎం అభ్యర్థిగా గెలిచారు. 1972లో చేగొండి వెంకట హరరామజోగయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి వర్థినీడి సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావంతో అల్లు వెంకట సత్యనారాయణ 1983,1985,1994,1999 లోనూ విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి వెంకట హరరామజోగయ్య గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి గెలిచారు. 2009లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిపై అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2014ఎన్నికల్లో రామానాయుడు గెలిచారు. నియోజకవర్గంలో మండలాలు : పాలకొల్లు, యలమంచిలి, పోడూరు జనాభా : 2,49,569 పురుషులు : 1,25,973 స్త్రీలు : 1,23,447 ఓటర్లు : 1,80,965 పురుషులు : 89,491 స్త్రీలు : 91,435 ఇతరులు : 39 ముఖ్య సమస్యలివీ.. పాలకొల్లు పట్టణ నడిబొడ్డున డంపింగ్‌యార్డుల వల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. పట్టణంలో దమ్మయ్యపత్తి డ్రెయిన్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా సుమారు రూ.8కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య డ్రెయినేజీ సమస్యలు సతమతం చేస్తున్నాయి. -
వైఎస్సార్సీపీలో చేరిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ
-
వైఎస్సార్సీపీలోకి పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు తరలివస్తున్నారు. పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాబ్జీ భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరిన ఆయనను వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం బాబ్జీ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఒక యజ్ఞమని కొనియాడారు. రాష్ట్ర అవసరాలు దగ్గరి నుంచి గమనించి.. వాటినుంచి వైఎస్ జగన్ ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలతో రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశముందన్నారు. యంగ్ జనరేషన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అవకాశమిస్తే తప్పకుండా పాలకొల్లు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. -
ఇద్దరు డాక్టర్లను డిశ్చార్జ్ చేసిన బాబు
పాలకొల్లు: టీడీపీ అధినేత చంద్రబాబు డెల్టాలోని ఇద్దరు ప్రముఖ వైద్యులను డిశ్చార్జ్ చేశారు. ఇదేంటీ పేషెంట్లు కదా డిశ్చార్జ్ అయ్యేది అనుకుంటున్నారా.. వైద్యులను డిశ్చార్జ్ చేసింది ఆసుపత్రి నుంచి కాదండీ.. ఎన్నికల బరిలో నుంచి. బాబు దెబ్బకు వారు బలయ్యారు మరి. హస్తవాసి మంచిదని పేరుపొందిన ప్రముఖ వైద్యులు పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జి), నరసాపురం పట్టణానికి చెందిన డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావులను గతంలో చంద్రబాబు బలవంతంగా టీడీపీలోకి తీసుకువచ్చారు. రాజకీయాలంటే వారికి ఇష్టం లేకున్నా ‘మీరు వస్తేనే టీడీపీకి మీ నియోజకవర్గాల్లో ఉనికి ఉండేది.. మీరు లేకపోతే నా పార్టీ లేదాయే. మీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే కాకుండా మిగిలిన విషయాలను నేను చూసుకుంటా’ అంటూ 2004లో డాక్టర్ బాబ్జీని, 2012లో నరసాపురం ఉప ఎన్నికలో చినిమిల్లి సత్యనారాయణరావును టీడీపీలోకి లాక్కొచ్చారు. డాక్టర్ బాబ్జీ 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాలకొల్లు నుంచి గెలుపొంది నీతి, నిజాయితీలతో పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. పీఆర్పీ అధినేత చిరంజీవి 2009లో పాలకొల్లు నుంచి బరిలో దిగినా ైధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆదుకుంటానన్న బాబు చేయివ్వడంతో ఆర్థికంగానూ ఎంతో నష్టపోయారు. అయినా ఇప్పటి వరకూ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారడంతో చుక్కాని లేని నావగా మారిన టీడీపీని బతికించేందుకు డాక్టర్ చినిమిల్లిని బాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఉపఎన్నికలో ఓటమి పాలైనా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేశారు. ఈ ఇద్దరికీ ప్రజల్లో మంచి పేరూ, పలుకుబడి ఉన్నా ఈ ఎన్నికల్లో చంద్రబాబు వారికి టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపించారు. వీరు వైద్యులుగా ఉన్నప్పుడు ఎంతోమందికి ఆపరేషన్లు, చికిత్స చేసి వైద్యం నయం కాగానే పేషెంట్లను డిశ్చార్జ్ చేసేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వీరిని వాడుకున్నంత వాడుకుని పార్టీ నుంచి డిశ్చార్జ్ చేశారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆచంట, పాలకొల్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులు..
సాక్షి, హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, పాలకొల్లు అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆచంట నుంచి ముదునూరు ప్రసాదరాజు, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మేకా శేషుబాబు పేర్లను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఖరారు చేసినట్టు పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ మొత్తంగా 172 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది.