గన్నవరం రూరల్: ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ (దవడ ఎముకల శస్త్ర చికిత్స)లో అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు రక్షించాలని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో శుక్రవారం 15వ వార్షిక రాష్ట్రస్థాయి అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల రక్షణకు ట్రామా కేర్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటిలో సైతం ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్‌ను నియమించాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం గర్వించాల్సిన విషయమన్నారు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అధ్యక్షుడు డాక్టర్ గుణశీలన్ రాజన్ మాట్లాడుతూ.. అతి చిన్న దేశమైన కొరియా ఇంప్లాంటేషన్స్ ఉత్పత్తిలో ముందుందని తెలిపారు.
వారియర్స్ ఆఫ్‌ది ఫేస్ అనే థీమ్‌తో ఈ కాన్ఫరెన్స్‌లో ముఖానికి సంబంధించిన ఆధునాతన శస్త్ర చికిత్సలపై, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చిన నూతన సర్జరీ పద్ధతులపై, ప్రమాదాల్లో ముఖాలకు గాయాలు, నోటి క్యాన్సర్ వంటి వాటికి శస్త్ర చికిత్స, అనాదిగా ఉన్న గ్రహణం మొర్రిని పూర్తిగా నిర్మూలించడంపై నిపుణులు రెండు రోజుల పాటు చర్చిస్తారు.
ఏవోఎంఎస్‌ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.మణికందన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ కె.వై.గిరి, ఏవోఎంఎస్‌ఐ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్, ఏవోఎంఎస్‌ఐ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, రాష్ట్ర మాజీ చైర్మన్ శివనాగేందర్‌రెడ్డి, డాక్టర్ సుధానాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.రామోజీరావు, ఏవో వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment