మంత్రి తండ్రిని కలవడానికి వచ్చా: అద్దాల విష్ణువతి
ఏలూరు: ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని పీతల సుజాత తండ్రి బాబ్జీ నివాసం వద్ద దొరికిన డబ్బుల సంచీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళ వదిలి వెళ్లిన నగదు బ్యాగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర స్త్రీ శిశు, గనుల శాఖామంత్రి పీతల సుజాత తెలిపారు. తన తండ్రి ఇంటికి వచ్చిన మహిళకు మతి స్ధిమితం లేనట్టుందని.. పది లక్షలు రూపాయిలు ఎందుకు తీసుకొచ్చిందో తనకు తెలియదని ఆమె అన్నారు. ఆ మహిళ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేనన్నారు.
మరోవైపు మంత్రి తండ్రిని కలవడానికి వచ్చినట్లు రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ అద్దాల విష్ణువతి చెప్పటం విశేషం. తన తమ్ముడి కుమార్తె పెళ్లి కోసం డబ్బులను పాలకొల్లు ఎస్బీఐలో డ్రా చేసినట్లు ఆమె చెప్పారు. అయితే ఆ డబ్బుల బ్యాగ్ను మర్చిపోయి వెళ్లినట్లు అద్దాల విష్ణువతి తెలిపింది.
అయితే విష్టువతి కుమార్తె మాత్రం భూమి కొనుగోలు కోసం పాలకొల్లు ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ. 10 లక్షలు డ్రా చేసినట్టు చెప్తుతోంది. ఆ నగదును చర్చిలో ప్రార్థన కోసం విష్టువతి తీసుకెళ్లినట్టు శ్రీలక్ష్మీ తెలిపింది. మంత్రిని కలవడానికి వెళ్లిన తన తల్లి డబ్బు సంచిని మర్చిపోయిందని ఆమె చెప్పింది. టీవీలో వచ్చిన వార్తలను చూసి డబ్బు సంచిని వదిలిలేసినట్టు గుర్తుకు వచ్చిందని శ్రీలక్ష్మీ తెలిపింది.