అవును ఆ పార్టీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఒకరితో ఒకరికి పొసగడంలేదు. వారి మధ్య సమన్వయం ఉండట్లేదు. ఒకరు సమావేశం పెడితే మరొకరు తప్పుకుంటారు. ఒకరు ప్రతిపాదిస్తే మరొకరు అడ్డుకుంటారు. ఒకరిని పదవికోసం సిఫారసు చేస్తే మరొకరు రద్దు చేయమంటారు. రాష్ట్రస్థాయిలో పంచాయితీలు జరిగినా పరిష్కరించుకోలేకపోతున్నారు. అధినేత వచ్చినపుడూ... తరచూ ఈ పరిస్థితులు ప్రత్యక్షమవుతున్నా... ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆయనది. ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు చేసుకుంటున్నా... వాస్తవాలు తెలుసుకునేందుకూ తీరికలేని పరిస్థితి ఆయనది. అందుకే ఇక్కడ విభేదాలు మూడు మీటింగులు... ఆరు ఫిర్యాదులుగా వర్థిల్లుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో టీడీపీ నేతలు జనం ఇబ్బందులు, వారి కష్టాలను గాలికొదిలేశారు. పోనీ స్వపార్టీ వారితోనైనా సఖ్యంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. మంత్రుల దగ్గర్నుంచి, ద్వితీయ శ్రేణి నేతల వరకూ ఎవరికి వారు సొంత గ్రూఫులు కట్టుకుని తమలో తామే తెగ పోట్లాడుకుంటున్నారు. ఇది ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు. అన్ని చోట్లా ఇదే పరి స్థితి కొనసాగుతోంది. బొబ్బిలి నియోజకవర్గంలో పాత టీడీపీ కొత్త టీడీపీ అనే రెండు వర్గాలు తయారయ్యాయి. ఇక కొత్త వర్గంలో మంత్రి సుజయ కృష్ణరంగారావు ఇచ్చిన ఆదేశాలను కొన్ని సార్లు అతని సోదరుడు బేబీ నాయన కూడా పాటించనీయడం లేదు. ఒకరు ఆదేశాలు పట్టుకుని వస్తే మరొకరు రద్దు చేయమని సిఫారసు చేస్తున్నా రు. ఈ విధానం ప్రభుత్వాధికారులను సైతం విస్తుపోయేలా చేస్తోంది. పార్టీ పదవులను, స్థానిక సంస్థల పదవులను భర్తీ చేయడంలో తాత్సారం చేయడంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య వైరం నెలకొంది.
విభేదాల పురం
పార్వతీపురం మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్ కౌన్సిల్ సభ్యులకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. పలుమార్లు సమావేశాలను బహిష్కరిద్దామని నిర్ణయించినా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి వారిని బతిమిలాడుకుంటున్నారు. అయినా ఇక్కడ అంతర్గత లుకలుకలున్నాయి. ఈ ప్రభావం కురుపాంలోనూ కనిపిస్తోంది. పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న టీడీపీ నాయకులు వలస నాయకుడైన శత్రుచర్ల విజయరామరాజు నాయకత్వాన్ని ఇష్టపడటం లేదు. ఆయనకు దూరంగానే ఉంటున్నారు. పార్టీ మారిన వారికి నాయకత్వం అప్పగించడాన్ని బహిరంగంగానే విమర్శించడమే గాదు... అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒకరి అవినీతిపై మరొకరు ఏకంగా కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో బట్టబయలు చేసుకున్నారు.
వివాదాల నగరం
విజయనగరంలో మీసాల గీతతో మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల రామకృష్ణ వైరంగా ఉన్నారు. గత అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన రామకృష్ణ ఈ సారైనా తనకు దక్కాలని భావిస్తున్నారు. మరో పక్క జిల్లా యువత అధ్యక్షుడి పదవిని నేటికీ భర్తీ చేయకుండా వదిలేశారు. మంత్రి మృణాళిని కుమారుడు నాగార్జునకు ఇస్తామని చెప్పినా నేటికీ ప్రకటించలేకపోయా రు. ఎస్ కోటలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభ హైమావతికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి మధ్య ఇటీవల రాష్ట్రమంత్రి నారా లోకేష్ వచ్చి స్వయంగా చిచ్చు పెట్టారని స్థానిక నాయకులు ఆరో పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ లలితకుమారికే టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో జడ్పీ ఛైర్‌పర్సన్ స్వాతి రాణి, ఆమె తల్లి హైమావతిలు కినుక వహించారు.
పెదవుల్లో నవ్వులు.. పొట్టలో కత్తులు...
సాలూరులో అసెంబ్లీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణి మధ్య విభేదాలు న్నాయి. వారు కలసి తిరుగుతున్నా... పెదవులపై నవ్వులు పులుముకుంటున్నా.. కడుపులో కత్తులు గుచ్చుకుంటున్నారు. దీనికి తోడు సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త గొర్లె మధుకు భంజ్‌దేవ్‌కు మధ్య పొరపొచ్చాలున్నాయి. ఏఎంసీ ఛైర్మన్ పదవిని తనకు కాకుండా చేశారని గొర్లె మధు అలుక వహిం చారు. గజపతినగరంలో ఎమ్మెల్యే కేఏ నాయుడుకు స్వయానా సోదరుడే శత్రువుగా మారారు. ఒకరిపై మరొకరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసుకున్న దాఖ లాలూ ఉన్నాయి. మంత్రిపదవి రాకుండా చేశాడని కేఏ నాయుడు మండిపడుతుండగా తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రాకుండా చేశాడని తమ్ముడిపై కొండల రావు ఆగ్రహంతో ఉన్నారు. వీరు తమ సొంత వ్యాపారాల్లోనూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం గమనార్హం. అలాగే వైస్ ఎం పీపీ బొడ్డు రాము బొబ్బిలి రాజులతో తిరుగుతున్నాడని కేఏ నాయుడు ఆయనను దూరం పెట్టారు. మక్కువ శ్రీధర్ కూడా కేఏ నాయుడుతో కొన్ని విషయాల్లో విభేదిస్తున్నారు.
నివురుగప్పినపల్లి
చీపురుపల్లిలో ఎమ్మెల్యే మృణాళినితో త్రిమూర్తులు రాజు అసెంబ్లీ టిక్కెట్ రాకపోయిన దగ్గర నుంచీ వైరంగానే ఉన్నారు. ఈయనతో పాటు జడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు, రౌతు కాము నాయుడు కూడా మృణాళినికి వ్యతిరేకంగా ఉన్నారు. మండల స్థాయి విషయాల్లోనూ ఎమ్మెల్యే వేలు పెట్టి వారికి ప్రాధాన్యమివ్వనీయకుండా చేస్తున్నారని వారంతా విడివిడిగా ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నారు. నెల్లిమర్లలో గ్రూపులు తారాస్థాయికి చేరుకున్నాయి. నగర పంచాయతీలో జన్మభూమి కమిటీ సభ్యుడు చిక్కాల సాంబశివరావు ఎమ్మెల్యే, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో చిక్కాలను సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకులు రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
ఏఎంసీ ఛైర్మన్ పదవిని ఇవ్వకపోవడంతో దంతులూరి సూర్యనారాయణ రాజు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజుల మధ్య తీవ్ర స్థాయి విభేదాలున్నాయి. దంతులూరి సూర్యనారాయణ రాజు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండటం, ఆయనకు పట్టున్నగ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను సైతం జరగనీయడం లేదు. డెంకాడలో ఎంపీపీ కంది చంద్రశేఖరరావుకు, జెడ్పీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనారాయణకు పడటంలేదు. నెల్లిమర్ల మండలంలో ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు మండల నాయకులు సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావుల మధ్య పొరపొచ్చాలకు కారణమవుతున్నారు. గేదెల రాజారావుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ఈ వివాదాలు పరిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment