నచ్చిన కళాశాలలో సీటు దొరికిందని.. కొత్త స్నేహాలు చిగురిస్తాయని.. ఓ కొత్త లోకంలో విహరించ వచ్చని.. ఇలా కొత్త కొత్త ఆశలతో కళాశాలకు అడుగుపెడతాడు విద్యార్థి.. పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చినా.. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌లో చేరినా.. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో సీటు పొందినా.. అతనిలో ఎక్కడో తెలియని బెరుకు.. బెంగ.. భయం ఉంటాయి. అలాంటి వారిని సహృదయంతో సీనియర్లు ఆదరించి.. వారిలో ఆ భయాన్ని పొగొట్టాలి. ఎందుకంటే సీనియర్లు.. గతంలో జూనియర్లు కాబట్టి.. కానీ సీనియర్లలో కొందరు ఆకతాయిలు జూనియర్ పట్ల వికృత చేష్టలకు పాల్పడి వారి భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. ర్యాగింగ్ చట్టంతో ఇది కొంత తగ్గినా.. ఇప్పుడా రాక్షస క్రీడ రూపం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు దిశగా, వేర్వేరు కళాశాలల మధ్య చిచ్చురేపుతూ.. తన విస్తృతిని పెంచే దిశగా పయనిస్తోంది. మరి ఇది నియంత్రణ సాధ్యమా? - విజయనగరం అర్బన్
ఇటీవల విశాఖ నగరానికి దూరంగా ఉన్న ఓ కార్పొరేట్ విద్యా సంస్థలో 15 రోజుల కిందట ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్థరాత్రి సమయంలో కొట్లాటకు వెళ్లారు. ఈ గొడవ మొదటిగా ఓ సీనియర్ విద్యార్థి జూనియర్‌ని ర్యా గింగ్ చేయడంతో మొదలైంది. ఈ ఘటనలో ప దుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. వారం రోజుల కిందట నగరంలో ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఈవ్ టీజింగ్‌లతో గొడవలకు దిగారు. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో కొద్దిసేపు తీవ్ర అలజడి నెలకొంది. పరిచయాలతో మొదలైన ర్యాగింగ్ ఇప్పుడు సీనియర్లు, జూనియర్లు, వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఆధిపోత్య పోరుగా మారింది.
పరిచయాలతో మొదలై..
కళాశాలకు వచ్చే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొత్తగా వచ్చే వారికి సీనియర్ల సమన్వయంతో ఉండాలని ఉపాధ్యాయులు చెప్పే సూచనలతో పరిచయాలు పెంచుకోవడానికి పలకరింపులు మొదలుపెడతారు. ఇంజినీరింగ్ విద్యా సంస్థలు పెరిగిన తర్వాత ఈ సంస్కృతి మరింత విస్తరించింది. సీనియర్లకి జూనియర్లు ఇచ్చే గౌరవం కాస్తా వారికి అవకాశంగా మారింది. దీంతో కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించడం, జూనియర్లతో అన్ని పనులు చేయించుకోవడం, చెప్పిన మాట వినకుంటే బెదిరించడం, చెబితే వింటున్నారనే ఉద్దేశంతో మరింత దారుణంగా పనులు చేయిస్తూ.. మానసికంగా, శారీరకంగా హింసించేవారు.
ఈ నేపథ్యంలో ఎదురయ్యే వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకొని ర్యాగింగ్ నిరోధక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ర్యాగింగ్ భూతం తన ఉనికి కోల్పోతూ వచ్చింది. చట్టానికి భయపడి సీనియర్లు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లు చేయడం చాలా వరకు తగ్గించారు. అయితే మరల కొద్ది రోజుల కిందట నగరంలో చోటుచేసుకున్న సంఘటనలతో ర్యాగింగ్ రూపం మార్చుకొని కలత చెందిస్తోంది.
సీనియర్స్ వర్సెస్ జూనియర్స్..
ప్రస్తుతం సీనియర్స్ పరిచయాల పేరుతో ర్యాగింగ్ చేస్తే కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు భరించే స్థితిలో లేరు. సీనియర్లు అయితే ఏంటి? వేధిస్తే సహించలా? అని ఎదురు తిరుగుతున్నారు. దీనిని భరించ లేని సీనియర్లు వారి మీద దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో జూనియర్స్ కూడా సీనియర్స్ మీద తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. అదే సమయంలో నగరంలో ప్రైవేట్ కళాశాలన్నీ ఒకే చోట ఉండటంతో వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం, ఈవ్ టీజింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో కళాశాల విద్యార్థులు గొడవలకు దిగుతూ రోడ్ల మీదనే కొట్లాడుకుంటున్నారు. కళాశాలల్లో నాలుగు గోడల మధ్య జరిగే ర్యాగింగ్‌లు, టీజింగ్‌లు ఇప్పుడు ఆధిపత్య పోరుగా మారి రోడ్ల మీదకు వచ్చింది. మా కాలేజీ అమ్మాయిని కామెంట్ చేసావని ఒకరు, మా కాలేజీ స్టూడెంట్‌ని కొడతావా అంటూ మరొకరు.. ఇలా గొడవలకు దిగుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.
ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమే.
జూనియర్లను, ఇతర విద్యార్థులను మాటల ద్వారా గాని, చేతల ద్వారాగాని వే ధిస్తే..
క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, విద్యార్థులను శారీరకంగా హింసించినా.. అటుగా ప్రోత్సహించినా..
విద్యార్థి చదువులపై ప్రభావం చూపిస్తూ.. అకాడమిక్ యాక్టివిటీస్‌కు అంతరాయానికి..
జూనియర్స్‌కి సీనియర్ విద్యార్థులు వారి అకాడమిక్ టాస్క్‌ని పూర్తి చేయాలని బలవంతం చేసినా..
విద్యార్థులైపై బలవంతంగా ఆర్థిక భారం పడేట్లు చేసినా..
శారీరక హింస, మానసిక హింసకు విద్యార్థిని గురిచేసినా..
మాటల ద్వారా గాని, ఈ-మెయిల్స్ రూపంలో గాని, సందేశాల రూపంలో గాని, ఫోన్ ద్వారా గాని హింసించడానికి ప్రయత్నించినా..
ఆలోచనలు ప్రభావితం చేస్తూ వారి మానసిక సామర్థ్యాన్ని తగ్గించే విధంగా ప్రవ ర్తించినా.. ర్యాగింగ్ కింద పరిగణిస్తారు.