సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో వర్గ రాజకీయాలకు అధికార తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరుగా మారింది. ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు తయారవడంతో ద్వితీయ నాయకుల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పటి నుంచే టిక్కెట్ల పోరుతో పరువు బజారున పడింది. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరి మంత్రిగా కొనసాగుతున్న ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి పీఆర్, ఎంపీ సీఎం రమేష్‌తోపాటు ఇతర నేతల మధ్య ఇప్పటివరకు సమన్వయం లేదు.
మంత్రి ఆది, ఎంపీ రమేష్ వర్గాలుగా విడిపోయి ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పార్టీ బలోపేతం కోసం ఆయా వర్గాలతో చర్చించిన దాఖలా లేదు. ఇదే సమయంలో విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, పార్టీ శిక్షణ శిబిరాల సంచాలకుడు రాంగోపాల్‌రెడ్డి సైతం సొంత ప్రయోజనాలకు తప్ప, పార్టీకి సంబంధించిన వ్యవహారాలను పట్టించుకోకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. దీంతో నేతలకు, కిందిస్థాయి కార్యకర్తలకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది.
జిల్లాలో ఎవరికి వారే..
జిల్లాలో టీడీపీ గెలుపొందిన ఏకైక స్థానం రాజంపేట. అక్కడా రెండు గ్రూపులు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారు. మేడా తన సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారన్న కారణంతో పార్టీసీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన ఓ సామాజికవర్గం వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ మొదలెట్టినట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇక జమ్మలమడుగులోనూ వర్గ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీ పీఆర్, మంత్రి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఆది నుంచి ఉంది. ఒకే వేదిక పై ఇద్దరు ఉన్నా.. ఎడ మొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారు. గ్రామాల్లో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోయి పనిచేసుకుంటుండడం గమనార్హం. ప్రొద్దుటూరులోనూ వర్గ విభేదాలే తారా స్థాయికి చేరాయి. ఇక్కడ వరదరాజులరెడ్డి, పార్టీ ఇన్‌చార్జి లింగారెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈస్థానం నుంచి పోటీచేయాలనే యోచనలో మంత్రి ఆది ఉన్నట్లు తెలుస్తోంది.
కమలాపురంలో టిక్కెట్ గోల
కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిలకు ఒకరంటే ఒకరికి పడటం లేదు. పుత్తా నియోజకవర్గంలో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నాడు. మంత్రి లోకేష్, బాలకృష్ణలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు లభిస్తుందన్న ఆశతో పుత్తా ఉన్నారు. కానీ వీరశివారెడ్డి మాత్రం ఈసారి టిక్కెట్ తనకేనని బహిరంగంగానే చెబుతున్నారు. కార్యకర్తల సమావేశాలు పెడుతున్నారు. జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వు స్థానమైన రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయుడు, పార్టీ ఇన్‌చార్జి విశ్వనాథనాయుడు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తన మాటే నెగ్గాలన్న పట్టుదల ఇద్దరిలో ఉంది. ఇప్పటివరకు పార్టీ కోసం రూ.50కోట్ల వరకు ఖర్చుచేశాను కాబట్టి తాను సూచించిన వ్యక్తికే టిక్కెట్టు ఇవ్వాలని విశ్వనాథనాయుడు పట్టుపడుతున్నారు.
ఇవ్వకపోతే పార్టీ వీడే ఆలోచనలోనూ ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. పులివెందులలో పట్టుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న అధికారపార్టీకి అక్కడి గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారా యి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి, సతీష్‌రెడ్డి, పార్టీ శిక్షణ శిబిరాల సంచాలకుడు రాంగోపాల్‌రెడ్డిలు మూడు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. రాంగోపాల్‌రెడ్డికి సతీష్‌రెడ్డిల మధ్య మొదటి నుంచి సరిపోదు. ఇటీవల వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది. అయినా టిక్కెట్టు విషయానికి వచ్చేసరికి మళ్లీ కత్తులు దూసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
జిల్లాలో బలం అంతంతే..
జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజ యం ఎదురైంది. అప్పటి నుంచి జిల్లాలో పాగా వేయాలని ఆ పార్టీ అధినేత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా జిల్లాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నారు. ఇప్పటివరకు సీఎం హోదాలో ఆయన 14సార్లు జిల్లాలో పర్యటించడం వెనుక ఉన్న రహస్యమిదే. చివరకు వైఎస్సార్‌సీపీ జెండాపై గెలిచిన జయరాములు, ఆదినారాయణరెడ్డిలకు తాయిలాలు ఎరవేసి తనవైపు లాక్కున్నా, జిల్లాలో పట్టు సాధించలేకపోయారు.
బద్వేలులో మూడు ముక్కలాట
బద్వేలు, రాయచోటి, కడప నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే జయరాములు ఎవరి వర్గం వారు అన్నట్లుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో విజయమ్మ మద్దతులో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విజయజ్యోతి మాత్రం ఇద్దరితో అంటిముట్టనట్టుగానే ఉంది. అయితే వీరి ముగ్గురు మధ్య బద్వేలు–పోరుమామిళ్ల రహదారి పనుల్లో కమీషన్ల కోసం కుమ్ములాట జరుగుతోంది. రాయచోటి విషయానికి వచ్చేసరికి పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి రమేష్‌రెడ్డిలకు సరిపడడం లేదు. కడప నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే ఈ స్థానం తమకే ఇవ్వాలని మైనార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సమస్యతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment