ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో తెలుగు తమ్ముళ్ల పంచాయతీ తారస్థాయికి చేరింది. టీడీపీలో రెండు వ ర్గాల ఆధిపత్య పోరు వీధిన పడింది. నగరపంచాయతీ చైర్మన్ కంభాలపల్లి భరత్‌కుమార్, వైస్ చైర్మన్ సుల్తాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో.. ఏకంగా చైర్మన్ కార్యాలయానికే తాళం వేసే వరకు వెళ్లింది.
ప్రజా ప్రయోజనాలు కాకుండా.. కేవలం వ్యక్తిగత ప్రయోనాలు, ప్రతిష్టల కోసమే ఇదంతా జరుగుతోందని ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్‌ల సాక్షిగా.. తమ్ముళ్ల పంచాయతీ వెనక అసలు కథాకమామిషు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
ఇదీ జరిగింది..
ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయంలోని చైర్మన్ భరత్‌కుమార్ చాంబర్‌లో ఆయనతో బుధవారం వైఎస్ చైర్మన్ సుల్తాన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ శంకర్‌నాయక్‌కు సంబంధించి రూ.15 వేల బిల్లు డ్రా అయిన విషయం చర్చకు వచ్చింది. ఎక్కడా పోయని మట్టికి బిల్లు ఎలా మంజూరు చేస్తారంటూ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు చైర్మన్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా కౌన్సిలర్లు వివరణ కోరారు.
ఈ క్రమంలో చైర్మన్ భరత్‌కుమార్ ఓ వైపు, వైస్ చైర్మన్ సుల్తాన్, కొంతమంది కౌన్సిలర్లు మరో వైపు వాదోపవాదాలు, మాటల పంరంపర కొనసాగింది. నగర పంచాయతీలో జరిగే ప్రతీ విషయం కౌన్సిలర్లకు చెప్పాల్సిన పని లేదంటూ చైర్మన్ భరత్‌కుమార్ విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
వెళుతూ..వెళుతూ అక్కడే ఉన్న కుర్చీలను తన్నుకుంటూ వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన వైస్ చైర్మన్ సుల్తాన్.. కౌన్సిలర్ల సమక్షంలోనే చైర్మన్ భరత్‌కుమార్ కార్యాలయానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుకు ఈ ఘటన ఆజ్యం పోసినట్లయింది. రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత రాజేసినట్లయిందని సొంత పార్టీవాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: భరత్‌కుమార్, నగర పంచాయతీ చైర్మన్
చేయని పనులకు బిల్లులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వైస్ చైర్మన్ సుల్తాన్ బ్లాక్‌మెయిల్‌కు భయపడి అవినీతికి పాల్పడను. నేను దళితుడి అయినందుకే అవమానించే విధంగా నా కార్యాలయానికి తాళం వేశారు.
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడలేదు: సుల్తాన్, నగర పంచాయతీ వైస్ చైర్మన్
కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం లే కుండా, నగరపంచాయతీ తీర్మానం లేకుండా డ్రా అయిన బిల్లుల విషయంలో మాత్రమే చైర్మన్ భరత్‌కుమార్‌ను ప్రశ్నించాను. ఇదంతా తోటి కౌన్సిలర్ల సమక్షంలోనే జరిగింది. చైర్మన్ గదికి తాళం వేసేందుకు దారితీసిన పరిస్థితిపై విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.
తారస్థాయికి ‘తమ్ముళ్ల’ పంచాయతీ!
Published Thu, Nov 20 2014 11:42 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement