
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పాతగుంటూరు: ఆర్యవైశ్యులను విమర్శిస్తే ఆర్యవైశ్య మహిళలే వారికి కర్మకాండలు నిర్వహిస్తారంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో అర్య వైశ్య కల్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కామ వరపుకోటలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన టివీఏ.చిన రాజన్న ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రారంభించారు.
ఈ సభలో టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను స్మగ్లర్లుగా పేర్కొంటూ వివాదాస్పద పుస్తకం రాయడం సరికాదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కట్టడి చెయ్యకపోతే సమాజానికి ప్రమాదమన్నారు. అర్యవైశ్యులను విమర్శించిన వారికి అర్యవైశ్య మహిళలే కర్మకాండలు చేస్తారన్నారు. ఏలూరు ఎంపి.మాగంటి బాబు మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని సాగనివ్వరా దన్నారు. అర్యవైశ్యులను ఎవరైనా విమర్శిస్తే వారి కాళ్లు విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు.