ఎవరిదైనా బర్త్‌డే జరిగితే అభిమానంతో వెళ్తాం. పుష్పగుచ్ఛమిచ్చి స్వీట్లు తినిపిస్తాం. ఇంకా దగ్గరి వాళ్లయితే కేక్ తీసుకెళ్లి కట్ చేయిస్తాం. వీలైతే ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. కానీ ఓ టీడీపీ నేత తన బర్త్‌డేకు రమ్మని ఏకంగా కూపన్లు పంచిపెట్టాడు. వాళ్లు మాత్రమే వచ్చి శుభాకాంక్షలు తెలపాలి. అప్పుడే అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆ కూపన్లను చూసి రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తారు. లేకపోతే వచ్చిన దారిలో వెళ్లిపోవాల్సిందే. ఇదండీ కథ. తండ్రి ప్రజల్లో విశ్వాసం కోల్పోతే.. కుమారుడు లేని ప్రజాదరణను చూపించుకునేందుకు తన బర్త్‌డేను వేదికగా చేసుకోవడం నవ్వులపాలైంది. నాయకుడి బర్త్‌డే అంటే స్వచ్ఛందంగా వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు కానీ.. ఇదెక్కడి విడ్డూరమని కొందరంటే, ఆ ఫ్యామిలీ అంతే పబ్లిసిటీ పిచ్చి అంటూ మరికొందరు నోరు చేసుకున్నారు.
సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ నేత టీజీ వెంకటేశ్ కుమారుడు, టీడీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ టీజీ భరత్ బర్త్‌డే శనివారం జరిగింది. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం! ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించుకునేందుకు తన బర్త్‌డేను ఎంచుకున్నారు. నాలుగేళ్లుగా జనం మధ్య లేరు, చంద్రబాబు వచ్చినా జనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తన బర్త్‌డేకు జనం రారని భరత్ ముందే ఊహించినట్లున్నాడు. అందులో భాగంగా ఓ ప్లాన్ వేశాడు. డబ్బులిచ్చి ఎన్నికల ప్రచారానికి జనాలను పిలిపించుకున్నట్లు ‘గిఫ్ట్’లు ఎరగా వేశాడు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీడీపీ నాయకులను పదిరోజుల కిందట పిలిపించి సమావేశం నిర్వహించాడు. తన బర్త్‌డే వేడుకకు రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తామని, దాని కోసం ఓ జాబితా తయారు చేయాలని, ఆ ప్రకారం కూపన్లు అందజేసి గిఫ్ట్‌లు పంపిణీ చేద్దామని నిర్ణయించారు. ఆ మేరకు జాబితాలు తయారయ్యాయి. వ్యక్తుల పేరు, ఓటర్ ఐడీ నెంబర్, పోలింగ్ బూత్ నెంబర్, ఫోన్ నెంబర్‌తో కూపన్ ప్రింట్ చేయించారు. ఈ కూపన్లను నియోజకవర్గంలోని డివిజన్లలో తమ పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేశారు. వీరు ఎస్టీబీసీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకకు వచ్చి భరత్‌కు శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి చివరలో గిఫ్ట్‌లు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పొదుపు మహిళలకు ముక్కుపుడకలు.. కొందరికి గిఫ్ట్‌లు, ఇలా మొత్తం పుట్టిన రోజు ముసుగులో లేని అభిమానానికి ఈ బర్త్‌డే బాయ్ చేసిన ఖర్చు అక్షరాల రూ.5కోట్ల పైనే.
జనం బలం ఉందని చూపించుకునే తాపత్రయం
టీజీ వెంకటేశ్ కుటుంబంపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీలో ఉన్న టీజీ వెంకటేశ్ 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. కుమారుడు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరడం మినహా టీజీ వెంకటేశ్‌కు రాజకీయ స్థిరత్వం లేదనేది తన రాజకీయ ప్రస్తానాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. అలాగే తండ్రీకొడుకుల్లో ఒకరు బీజేపీ, మరొకరు టీడీపీలో ఉండటం అవకాశవాద రాజకీయాన్ని సుస్పష్టం చేస్తోంది. పాత రోజులు కాకుండా ప్రజలు రాజకీయంగా చైతన్యం అయ్యారు.
దీంతో టీజీ కుటుంబం అవకాశవాద రాజకీయాలను పసిగట్టి వారికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ అత్యంత బలహీనపడింది. ఒకే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలుగా ఉన్న వీరు రాజకీయంగా ఏ రోజు పరస్పరం విమర్శించుకున్నదీ లేదు. తమ రాజకీయాల కోసం ఏ క్షణం, ఏ పారీ్టలోనైనా చేరే నేతగా టీజీ వెంకటేశ్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆయన కుమారుడు భరత్ నాలుగేళ్లలో విపక్షపార్టీ నేతగా పోరాటం చేసిందీ లేదు. కేవలం ఎన్నికలకు ముందు బలప్రదర్శన చేసుకోవాలని భావించి, బలం లేక ఆర్థికబలంతో కోట్లు ఖర్చు చేసి గిఫ్ట్‌లు పంపిణీ చేసి వాటి కోసం వచ్చిన వారిని తమ అభిమానులుగా చిత్రీకరించుకుని రాజకీయ అడుగులు వేసే ప్రయత్నం చేశాడు.
ఎన్నికల ‘వేడుక’
టీడీపీ నాయకుడు భరత్ పిచ్చి పరాకాష్టకు ఈ వేడుక తాజా నిదర్శనం. పుట్టిన రోజుకు రావాలని పిలవడం బాగుంటుంది కానీ, ఏకంగా ఓటరు ఐడీ జిరాక్స్ కాపీ జత చేసి తీసుకురావాలని కూపన్ల మీద కొట్టించడం ఇదంతా ఎన్నికల వేడుక అని చెప్పకనే చెప్పినట్లయింది. ఇంతేకాదు.. కూపన్ల మీ ద ఇచ్చిన వివరాలన్నీ ఓటరు ఐడీ కార్డు తరహాలో ఉండటం గమనార్హం. ఓటరు ఐడీ నెంబర్, బుక్ ఫోలియో, వార్డు నెంబర్, బూత్ నెంబర్‌ను పంపిణీ చేసిన కూపన్లపైనే ముద్రించారు. డేటా చౌర్యం గురించి మాట్లాడే టీడీపీ నేతలు కూపన్ల మాటున ఏకంగా ఓటరు ఐడీలనే బజారుకు తీసుకురావడం ఏమనుకోవాలనే చర్చకు తావిస్తోంది.
చంద్రబాబు వద్ద విశ్వసనీయత కోల్పోయారా?!
లక్కీటు బ్రదర్స్‌గా చెప్పుకునే రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్‌లను పార్టీ నుంచి తప్పించాలని భరత్ ప్రయతి్నంచాడు. నియోజకవర్గంలో జరిగిన బస్సుయాత్రలో కూడా లక్కీటు బ్రదర్స్ పాల్గొనలేదు. దీంతో వీరు చంద్రబాబుకు భరత్‌పై ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అధిష్టానం భరత్, లక్కీటు బ్రదర్స్‌ను ఇద్దరినీ పిలిపించి వేర్వేరుగా మాట్లాడారు. రాజకీయంగా బలపడాలంటే చేరికలపై దృష్టి పెట్టేవారిని చూశానని, పారీ్టలో ఉన్నవారిని బయటకు పంపే నేతను చూడలేదని భరత్‌ను చంద్రబాబు హెచ్చరించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 50 ఓట్లు ఉన్న వ్యక్తి కూడా మనకు ముఖ్యమేనని, సర్దుకుని పోవాలని సూచించారు.
పైగా భరత్, టీజీ వెంకటేశ్ వేర్వేరు పార్టీలో ఉండటంతో టీడీపీ నియోజకవర్గంలో నష్టపోయిందని, ఇద్దరూ ఒకే పారీ్టలో ఉంటేనే టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తామని.. లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బలం నిరూపించునే ప్రయత్నంలో తన బర్త్‌డే వేడుకను అవకాశంగా తీసుకున్నాడు భరత్. అయితే ఈ వేడుకపై ఇటు ప్రజల్లో, రాజకీయ పారీ్టల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బర్త్‌డే వేడుకల్లో భరత్ కొత్త సంప్రదాయానికి తెర తీశాడని, ప్రతీ అంశాన్ని రాజకీయంగా చూడటం సరికాదని చర్చకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment