సభను నిలిపేయాలని చెబుతున్న పోలీసులు
నినదించిన ఆర్యవైశ్యులు
పిలవకపోయినా ఆర్యవైశ్య మహోత్సవానికి వెళ్లి హడావుడి
ఉద్రిక్తంగా మారడంతో కార్యక్రమం నిలిపివేత
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలవకపోయినా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా రావడంతో ఉద్రిక్తంగా మారింది. ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. చివరకు కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లో గల ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్‌లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వనం మేరకు విజయవాడ సెంట్రల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా అక్కడికి వెళ్లారు. వేదికపై వెళ్లి కూర్చోవడంతో ఆర్యవైశ్య కులానికి సంబంధం లేని బొండా ఉమా కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటూ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి ప్రశ్నించారు.
పిలవకపోయినా అభినందించడానికి వచ్చారని, పిలవకపోయినా వస్తామంటూ బొండా ఉమా అనుచరుడు, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేశ్ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. దీంతో బొండా ఉమా వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ వివాదం విషయం తెలుసుకున్న మాచవరం పోలీసులు ఆ హాల్‌కు వెళ్లి.. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తామంటేనే అనుమతులు ఇచ్చామని నిర్వాహకులతో చెబుతుండగా.. డూండి రాకేశ్ వచ్చి ఇది తమ అంతర్గత సమావేశమని, పోలీసులు ఎందుకు వచ్చారంటూ వాదనకు దిగారు.
కార్యక్రమం నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నామని పోలీసులు నిర్వాహకులతో చెప్పి హాలులో ఉన్న సభ్యులందరినీ బయటకు పంపించేశారు. డూండి రాకేశ్‌ను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా.. డూండి రాకేశ్ అత్యుత్సాహమే వివాదానికి కారణమని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెప్పారు. బొండా ఉమాకు తాము ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య ప్రముఖులకు మాత్రమే ఆహ్వనాలు పంపామని చెప్పారు. బొండా ఉమా కావాలనే తమ కార్యాక్రమానికి వచ్చి వివాదం రాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment