
ఎంపీ మాగంటి వ్యాఖ్యలతో రగిలిన చిచ్చు
కొయ్యలగూడెం : అధికార టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన చైతన్యయాత్రలు జనానికి ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయన్న మాట అటుంచితే.. ఆ పార్టీలోని వర్గ విభేదాలను మాత్రం బహిర్గతం చేస్తున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న విభేదాలకు కన్నాపురంలో శని వారం నిర్వహించిన జనచైతన్య యాత్ర వేదికగా నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కన్నాపురంలో జనచైతన్యయాత్ర నిర్వహిస్తున్న సందర్బంగా మెయిన్‌సెంటర్‌లోకి చేరుకున్న ర్యాలీని ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు బహిరంగ ప్రసంగం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి సూటిగా విమర్శకు దిగడంతో పార్టీ శ్రేణులు విస్తుపోయాయి. ఏం జరుగుతుందో తెలియక పార్టీ నాయకులు , కార్యకర్తలు తలో దిక్కుకు సర్దుకున్నారు. ఎంపీ మాటలపై విస్మయం చెందిన ఎమ్మెల్యే మొడియం జనచైతన్య కార్యక్రమం నుంచి అర్థంతరంగా తప్పుకోగా ఎంపీ సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి
కన్నాపురం జనచైతన్య యాత్రలో ఏలూరు ఎంపీ మాగంటిబాబు పార్టీ నాయకులను అవినీతి అక్రమార్కులుగా అభివర్ణించడంపై ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తన అనుయాయులు వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పలు ఉన్నత పదవులు నిర్వహించిన మాగంటి బహిరంగ సభలో సొంత పార్టీ వ్యక్తులపై ఇలా విరుచుకుపడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి దెందులూరు పర్యటన సమయంలో పార్టీ ఆదేశానుసారం తాను జీలుగుమిల్లి జనచైతన్యయాత్రలో పాల్గొన్నానని, ఆ విషయం మరిచి ఎంపీ తప్పుగా పేర్కొనడం తనను బాధించినట్లు ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జెడ్పీవైస్ చైర్మన్ చింతల వెంకటరమణల వద్ద వాపోయినట్లు తెలిసింది. అదే విధంగా ఒకప్పటి కాంగ్రెస్ వాది అయిన మాగంటి తీరు టీడీపీ విషయంలో అనుమానాస్పదంగా ఉందని కూడా ఆయన అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్ర మనోవేదనకు గురైన మొడియం జరిగిన విషయం అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సమాయాత్తమవుతున్నట్లు సమాచారం.
కన్నాపురం జనచైతన్య యాత్రలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
‘ఈ నెల 3వ తేదీన దెందులూరు పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాగా మీరు(ఎమ్మెల్యే) హాజరు కాలేదు. ఇది భావ్యం కాదు. అలాగే పోలవరం నియోకవర్గంలో అవినీతి పెచ్చుమీరుతోంది. ప్రతి విషయంలో టీడీపీ నాయకులు దందాల వైఖరి అవలంభిస్తున్నారు. ఇసుక మాఫీయా నుంచి భూ తగాదాల వరకు కూడా సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో లక్షకు రూ.20 వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ఎన్ని గొడవలు జరుగుతున్నా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఏలూరు ఎంపీగా గర్విస్తున్నాను. ఎంపీగా మీరు అభివృద్ధికి ఏం చేస్తున్నారని దెందులూరు పర్యటనలో సీఎం నన్ను ప్రశ్నించారు. ఇప్పటికే పోలవరంలో జరుగుతున్న అవినీతి అక్రమాల చిట్టా అంతా తన వద్ద ఉందని, త్వరలోనే అందరి సంగతి తేల్చుతానని ఆయన హెచ్చరించారు.’