అధికార మత్తులో జోగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
అధికార మత్తులో జోగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల కళ్లు బైర్లు కమ్మేలా జిల్లాలో జన చైతన్యం వెల్లివిరుస్తోంది. ఎంతగా అంటే.. ఎమ్మెల్యేలను వెంటపడి తరిమేలా, నాయకులపై ఎక్కడికక్కడ తిరగబడేలా జనాగ్రహం వెల్లువెత్తింది. 18 నెలల టీడీపీ పాలనలో ఒరిగిందేమీ లేదన్న వాస్తవంతోపాటు ఎన్నికల హామీలు నమ్మి నయవంచనకు గురయ్యామన్న ఆగ్రహం ప్రజల్లో కట్టలు తెంచుకుంటోంది. అందుకే జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలపై అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ నెల 1నుంచి 14వ తేదీ వరకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తోంది. ఏడాదిన్నర కాలంలో రైతులు, మహిళలు, యువకులు, శ్రామికులు..
ఇలా ఏ ఒక్కవర్గానికీ న్యాయం జరగకపోవడంతో జనం ఎక్కడికక్కడ నేతలను నిలదీస్తున్నారు. ముఖ్యంగా రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, పింఛన్లు, ఇళ్లస్థలాలు, స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రజలు టీడీపీ నేతలను, ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చేతికి వచ్చిందనుకున్న ఖరీఫ్ పంట అకాల వర్షాలతో దెబ్బతిన్నా పాలకులు కనీస కనికరం చూపించకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు
ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులకు జనచైతన్య యాత్రలో అడుగడుగునా ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు నియోజకవర్గాల్లో పర్యటనకు వచ్చినప్పడు, ఎప్పుడైనా మీడియాలో కవరేజీ కోసం ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప గ్రామాలు, డివిజన్లలో కానరాని ఎమ్మెల్యేలు జనచైతన్య యాత్రల కోసం మాత్రం బయటకు వచ్చారు. అదును కోసం చూస్తున్న జనం ఒక్కసారిగా వారిపై విరుచుకుపడుతున్నారు. చివరకు తన చేష్టలతో ఒకింత ఉద్రిక్త వాతావరణం సృష్టించే ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను సైతం దెందులూరు నియోజకవర్గ ప్రజలు నిలదీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కూచింపూడి, న్యాయంపల్లి గ్రామాల్లో సౌకర్యాలపై మహిళలు చింతమనేనితో వాదనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీనిచ్చి ఇప్పటివరకు కనిపించలేదంటూ ఏలూరులోని 10వ డివిజన్ మహిళలు ఎమ్మెల్యే బడేటి బుజ్జిని నిలదీయగా.. ఏం మాట్లాడాలో అర్థంకాని పరిస్థితిలో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాలకొల్లు మండలం పెదమామిడిపల్లిలో మద్యనిషేధం కోరుతూ ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్‌ను గ్రామస్తులు చుట్టుముట్టగా, ఆయన ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్ర్కమించారు.
అరుదుగా అరుదెంచితే అంతే మరి
చాలా అరుదుగా ప్రజల మధ్యకు వెళ్లే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనచైతన్య యాత్రలో చూసిన జనం ఎక్కడికక్కడ సమస్యలపై నిలదీస్తున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ తుందుర్రు గ్రామస్తులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇళ్ల స్థలాల సమస్యపై ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామస్తులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను అడ్డుకుంటే ఆయన దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. నరసాపురం మండలం వేములదీవిలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును జనం వెంటపడి తరిమినంత పనిచేశారు.
స్థానిక యువకులైతే ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారంటే ఏ రీతిన జనాగ్రహం పెల్లుబికిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా.. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వందలాది హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం.. ప్రజలకు ఏ మేలూ చేయని తెలుగుదేశం పార్టీ 13 రోజులుగా కొనసాగిస్తున్న చైతన్య యాత్రల ‘ప్రహసనం’ టీడీపీ నేతలకు ‘అసహనం’ మిగిల్చిందనే చెప్పాలి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు