తాడేపల్లిగూడెం: గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలివెళ్లగా 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పసికందు మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి గూడెం వీకర్స్ కాలనీలోని ముళ్లపొదల్లో సోమవారం రాత్రి ఓ శిశువు పడి ఉండగా స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. వారు వచ్చి, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శిశువు మంగళవారం ఉదయం చనిపోయింది. నెలలు నిండకుండానే జన్మించటం, బరువు తక్కువగా ఉండటంతోనే పసికందు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.