నిందితుడు మానిక్ ఘోష్ కుటుంబం (పాత చిత్రం)
కాకినాడ క్రైం: తన తల్లిని తండ్రే హతమార్చాడని మూడున్నరేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యం ఆధారంగా చేపట్టిన విచారణలో కీలక వాస్తవం వెలుగు చూసింది. పసిబిడ్డ చెప్పినట్లు నిందితుడు మృతురాలి భర్తేనని తమ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను కాకినాడ టూ టౌన్ సీఐ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ రామకృష్ణారావుపేట జెండా వీధిలో ఒడిశాకు చెందిన మానిక్ ఘోష్ తన భార్య లిపికా మండల్, మూడున్నరేళ్ల కుమార్తె కృషికా ఘోష్‌తో కలిసి నివసిస్తున్నాడు. నగరంలోని మెయిన్‌రోడ్డులోని స్టార్ హోటల్‌లో మానిక్ సర్వీసు కెప్టెన్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: చివరి సారిగా నిన్ను చూడాలి.. భార్య వాట్సాప్ కాల్.. ఇంతలోనే..
ఈ నెల 21వ తేదీ తెల్లవారుఝామున తన భార్య లిపికా ఛాతి నొప్పితో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చాక దహన సంస్కారాలు పూర్తి చేశాడు. ఈ లోపు మానిక్ మూడున్నరేళ్ల కుమార్తె కృషికా తన తాతయ్యకు గడచిన రోజు రాత్రి తన తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవను వచ్చీ రాని మాటలతో చెప్పింది. తన తండ్రి తల్లిని కొట్టాడని.. సైగలతో వివరించింది.
దీంతో అనుమానించిన లిపికా కుటుంబ సభ్యులు కాకినాడ టూ టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పసిబిడ్డ పోలీసులకు జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. పెద్ద మెదళ్లకు అర్థం కాదనుకుందో ఏమో తన మెడను తానే నొక్కుకుంటూ మా... మా... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో పోలీసులకు పసిబిడ్డ ఆవేదన అర్థమైంది. అప్పటికే వీఆర్‌వో సమాచారం ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు చిన్నారి సాక్ష్యం కీలకమైంది.
అనుమానంతో వేధింపులు
హత్య కోణంలోనే దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు మానిక్ గత మే నెలలో భార్యను అదనపు కట్నం, అనుమానంతో వేధింపులకు గురి చేయడం వల్ల స్వస్థలం ఒడిశా రాష్ట్రంలో అతడిపై కేసు నమోదైందన్న విషయం తెలిసింది. అంతేకాక మనమిద్దరం తెల్లగా ఉంటే బిడ్డ ఎందుకు నల్లగా పుట్టిందని అనుమానిస్తూ లిపికాను హింసించేవాడని విచారణలో వెల్లడైంది. లిపికా మృతి చెందిన ఇంటిలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
వీటి ఆధారంగా మానిక్ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆధారాలన్నీ సేకరించి మానిక్‌ను విచారించడం మొదలు పెట్టారు. తానేమీ ఎరుగనని, అమాయకుడినని చెబుతూ వచ్చిన మానిక్ పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి స్వరం మార్చాడు. నోరు తెరిచాడు. చేసిన ఘోరాన్ని వివరించి చెప్పాడు. భార్యను హతమార్చింది తానేనని అంగీకరించాడు. దీంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చారు. హంతకుడు మానిక్‌ను ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. రిమాండ్‌కు తరలించనున్నామన్నారు. నిందితుడిని శనివారమే అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment