నెల్లూరు అర్బన్ తహసీల్దార్‌తో వాదనకు దిగుతున్న కొటంరెడ్డి.శ్రీనివాసులరెడ్డి
అధికారం కోల్పోయినా.. తెలుగు తమ్ముళ్ల ప్రవర్తన మారలేదు. ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయినా అధికారులపై పెత్తనం చెలాయించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. రెండున్నరేళ్లలోనే తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. పేదల ప్రభుత్వమంటూనే దశాబ్దాలుగా స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న పేదల ఇళ్లను అప్పటి ప్రభుత్వ పెద్దలు రెండేళ్ల క్రితం నిర్దయగా కూల్చేశారు. ఆ సమయంలో ఈ దేశం నేతలకు పేదలు గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో ప్రభుత్వ స్థలంలో ఓ టీడీపీ బడా నేత నిర్మించిన మూడంతస్తుల అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుంటే అన్యాయం, అక్రమం అంటూ రోడ్డెక్కి శోకాలు పెట్టారు. భవనం కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకుని తిరగబడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలు కట్టిన అక్రమ కట్టడాలు కూల్చేసిన తర్వాతే తమ నాయకుడి కట్టడాన్ని తొలగించాలంటూ డిమాండ్ చేయడంపై అధికారులే కాదు.. స్థానికులూ విస్మయం వ్యక్తం చేశారు. ఇదేం నీతంటూ తెలుగు తమ్ముళ్ల తీరుపై జనం మండిపడుతున్నారు.
సాక్షి, నెల్లూరు : నగరంలోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ రూ.కోట్ల విలువైన 60 అంకణాల ప్రభుత్వ సీజేఎఫ్‌ఎస్ స్థలాన్ని ఆక్రమించాడు. గుట్టు చప్పుడు కాకుండా దొంగ పత్రాలను సృష్టించి ఆ స్థలంలో మూడంతస్తుల్లో భవనాలను నిర్మిస్తున్నాడు. రెండు భవనాలను మాజీ కార్పొరేటర్ సొంత మనుషులకు విక్రయించగా, మరో భవనాన్ని బినామీ పేరు మీద నిర్మిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు అర్బన్ తహసీల్దార్ మధుసూదనశర్మ, తన సిబ్బందితో సంఘటనా స్థలికి వచ్చారు. కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్, పోలీసు అ«ధికారుల అండతో శనివారం అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అజీజ్ హుటాహుటినా అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. మీ ఇష్టమొచ్చినట్లు భవనాలకు కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమని అధికారులను బెదిరించడంతో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆర్‌ఐను పిలిచి నీ ఉద్యోగం ఉండాలంటే తొలగింపు ఆపివేయాలని హెచ్చరించారు. మరో రెండున్నర సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుందంటూ తమ మనోగతాన్ని బయటపెట్టుతూ తహసీల్దార్ మధుసూదనశర్మతో వాదనకు దాగారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తహసిల్దార్‌నుద్దేశించి నువ్వేమైనా మోనార్కువా ఆక్రమకట్టణం అని నిర్ధారించి తొలగించేందుకు ఎలా వస్తావని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
పేదల ఇళ్లు కూలిస్తే కనిపించలేదా..
టీడీపీ అధికారంలో ఉండగా పేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు. 40 ఏళ్లకు పైబడి సాలుచింతల వద్ద నివాసం ఉంటున్న 80 పేద కుటుంబాలను ప్రభుత్వ స్థలాలంటూ రెండేళ్ల కిందట పోలీసుల బలగాలతో కూల్చివేశారు. అప్పటి మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు బలవంతంగా పేదలను రోడ్డుపై వేశారు. ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారుజామునే వచ్చి యంత్రాలు పెట్టి విధ్వంసాన్ని సృష్టించారు. ఊహించని పరిణామంతో ఎటువెళ్లాలో అర్థం కాక పేదలు గుండెలు అవిసేలా ఏడ్చారు. తట్ట, బుట్ట పట్టుకుని రోడ్డున పడాల్సి వచ్చింది. అన్యాయంగా పేదలను రోడ్డున పడేస్తే ఆ రోజు టీడీపీ నుంచి ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చి వారికి సాయం చేసిన పరిస్థితి లేదు. పేదలు కావడంతో పట్టించుకున్న పాపాన పోలేదు. అదే తమ వాడైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినా, అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా అండగా నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నిలబడ్డంపై ప్రజలు అసహించుకుంటున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు పాతర
టీడీపీ పాలనలో పచ్చచొక్కా నాయకులు నిబంధనలకు పాతర వేసే విధంగా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. జనార్దన్‌రెడ్డి కాలనీలో సర్వే నంబరు 2209 నుంచి 2217లో ప్రభుత్వానికి చెందిన సీజేఎఫ్‌ఎస్ భూములు ఉన్నాయి. ఈ స్థలాలకు ఎటువంటిì æపొజిషన్ సర్టిఫికెట్లు లేకపోయినా, హౌసింగ్ లోన్లు పొందేందుకు వీలుగా అధికారులపై ఒత్తిడి తెచ్చి 9 అంకణాల స్థలానికి రెసిడెన్సీ సర్టిఫికెట్లు పొందారు. ఈ విధంగా ముగ్గురి పేర్లతో సర్టిఫికెట్లను పొందిన సదరు టీడీపీ నాయకుడు ముగ్గురి పేర్లతో మూడు భవనాలకు హౌసింగ్‌శాఖ ద్వారా రుణాలు పొంది మూడు భవనాలను నిర్మిస్తున్నాడు. అయితే నిబంధనల ప్రకారం హౌసింగ్ రుణాన్ని పొందిన లబ్ధిదారులు ఐదున్నర అంకణాల స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ సదరు టీడీపీ నేత అందుకు విరుద్ధంగా హౌసింగ్ రుణతో ఐదున్నర అంకణాలకు బదులుగా మూడంతస్తుల్లో అదనపు స్థలంలో టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాడు.
కబ్జాదారులుగా టీడీపీ నేతలు
టీడీపీ నేతలు వెంకటేశ్వరపురంలోని రెవెన్యూ స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించారు. ఓ మాజీ టీడీపీ కార్పొరేటర్ గతంలో వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీలో దాదాపు ఐదు ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు సమాచారం. ఆ స్థలాల సర్వే నంబర్లు మార్చి టీడీపీ నేతలు బినామీ పేర్ల మీద తమ అనుచరుల పేర్లుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో వైపు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పత్రాలు సృష్టించి బ్యాంక్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వరపురంలో మాజీ కార్పొరేటర్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment