
భట్టువారిపాలెంలో టీడీపీ నాయకులను హెచ్చరిస్తున్న ఎస్సై ఆదిలక్ష్మి
సాక్షి, నెల్లూరు(కలిగిరి) : మండలంలోని భట్టువారిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన బలం లేకపోయినప్పటికీ ఎలాగైనా ఎన్నికను నిలిపివేయాలని అత్యుత్సహం చూపారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం 47 ఓట్లు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు ఎం.ప్రభాకరరావు, కానిస్టేబుల్ గోపీ సమక్షంలో ఓటర్లను పేరుపేరునా పిలిచారు. ఓ వర్గానికి అనుకూలంగా ఉన్న వారు 30 మంది ఎన్నికలు నిర్వహించే గదిలోకి వెళ్లారు. టీడీపీ నాయకుల వద్ద ఉన్న 17 మందిని పాఠశాల ఆవరణలోనే ఒక్క పక్కన ఉంచి లోపలికి పంపలేదు. సరిపడా కోరం ఉండడంతో హెచ్‌ఎం ఎన్నికను ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నాయకులు అక్కడి చేరుకొని ఎన్నికను అడ్డుకొని రసాభాస చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎస్సై పి.ఆదిలక్ష్మి అక్కడి చేరుకున్నారు.
ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకులను మందలించారు. పాఠశాల ఆవరణలో నుంచి ఇరువర్గాలను బయటకు పంపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండడంతో ఎస్సై ఆదిలక్ష్మి విధి నిర్వహణలో వేరే గ్రామానికి వెళ్లగా టీడీపీ నాయకులు మరలా ఎన్నికలను నిలిపివేయడానికి కుటిల యత్నాలు మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై మరలా పాఠశాల వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పాఠశాల ఎన్నికల్లో జ్యోకంగా చేసుకోవడం సరికాదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మందలించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించి ఎన్నికలను ప్రశాంతంగా ముగించారు. చైర్మన్‌గా ఆదినారాయణమ్మ గెలుపొందగా, వైస్ చైర్మన్‌గా పెసల శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment