సాక్షి, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారా? దీనికోసం అనుమతి తీసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. అయితే, కొందరు ఉద్యోగులను కలిస్తే అలాంటిదేమి లేకుండానే తమ చేయి తడిపితే చాలు అన్నట్లుగా అనుమతులు ఇస్తూ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇక అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ రకరకాల కొర్రీలు పెడుతూ వసూలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది వసూళ్లకు తెగబడగా.. తామేమి తక్కువ కాదంటూ కొందరు కార్పొరేటర్లు సైతం అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా మూడు అంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని బెదిరించి రూ.9వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ టీపీబీఓ, చైన్‌మెన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే, వీరిద్దరే దొరికినా దొరకని వారెందరో ఉన్నారని చెబుతున్నారు.
నిబంధనలే సాకుగా..
వరంగల్ మహా నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో కొత్త భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇదే అధికారులు, సిబ్బందితో పాటు కార్పొరేటర్లకు కలిసొస్తోంది. నిబంధనల పేరుతో బెదిరిస్తూ యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ భవన నిర్మాణమైనా, కొత్తగా అనుమతులు కావాలన్నా రూ.వేలల్లో ముట్టచెప్పనిదే పని జరగడం లేదు. లేదంటే ఇళ్లు కూల్చడమో, అనుమతులకు కొర్రీలు పెట్టడం గ్రేటర్‌లో సర్వసాధారణంగా మారింది.
అపార్టుమెంట్ నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేస్తే స్థాయి ఆధారంగా రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు గుంజుతున్నారు. పెంట్ హౌస్ ఉంటే అదనంగా మరో రూ.లక్షగా ధర నిర్ణయించారని చెప్పుకుంటున్నారు. సిఫారసులతో వస్తే కొంచెం రిబేట్ కూడా ఇస్తారని సమాచారం. ఉద్యోగులు పెట్టే కొర్రీలను తట్టుకోలేక.. కార్యాలయం చుట్టూ తిరగలేక ఎంతో కొంత ముట్టచెప్పేస్తున్న నిర్మాణదారులు అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఈ తతంగం ముగిశాక కొన్నిచోట్ల కార్పొరేటర్లు కూడా తమ పరిధిలో నిర్మాణం చేపడుతున్నందున ఎంతోకొంత ముట్టచెప్పాలని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారమూ ఉంది.
అంతా ఒక్కటై
అక్రమ నిర్మాణాదారులకు కొందరు కార్పొరేటర్లు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. స్థానిక బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, చైన్‌మెన్, కార్పొరేటర్లు ఒక్కటై అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టే వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డివిజన్లలో జరిగే నిర్మాణాల విషయం పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లకుండా కింది స్థాయిలోనే సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. చిన్న షెడ్డు నిర్మించినా, ఇల్లు కట్టినా.. అపార్టుమెంట్ అయినా వాటా తప్పక చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వసూళ్లలో కొన్ని చోట్ల కార్పొరేటర్లదే కీలకపాత్ర అయినా ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ఉన్నతాధికారులు ఇలాంటి నిర్మాణదారులు, వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగులపై కొరఢా ఝులిపించకపోతే సర్కారు ఖజానాకు భారీగా గండి పడే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment