Warangal Corporation
-
మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సోమవారం పరిశీలన కూడా పూర్తయింది. అయితే సిద్దిపేట మున్సిపాలిటీ మినహా ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ డివిజన్లు, వార్డుల్లో టికెట్లు ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్న టీఆర్ఎస్.. అభ్యర్థుల ప్రకటనలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ నెల 22న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా.. డివిజన్లు, వార్డులవారీగా ఏకాభిప్రాయ సాధన తర్వాతే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఉన్నా, పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లు వేసిన ఇతరులు ఉపసంహరించుకున్న తర్వాతే బీ ఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు అంతర్గత ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా సూచించింది. వలసలు నివారించేందుకే.. నామినేషన్ల దాఖలు గడువుకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే అవకాశం దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లో చేరి ప్రత్యర్థులుగా నిలిచే అవకాశముందని టీఆర్ఎస్ భావించింది. కొందరు రెబల్స్‌గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు మాత్రమే బలమైన అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వలసలకు, రెబల్స్‌కు తావులేకుండా అన్ని అస్త్రాలు ప్రయోగించడం ద్వారా ఏకాభిప్రాయ సాధన కోసం కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా బరిలో ఉంటే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించింది. సిద్దిపేటలో కొందరు అభ్యర్థులు ఖరారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిçస్తున్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో 43 వార్డులు ఉండగా, నామినేషన్ల దాఖలు గడువులోగా 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మిగతా వార్డుల్లోనూ ఏకాభిప్రాయం సాధించి విడతల వారీగా జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఖరారైన అభ్యర్థులకు గురువారం బీ ఫామ్‌లు జారీ చేస్తామని ప్రకటించారు. ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి పువ్వాడ అజయ్. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్‌రావు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే వరంగల్ కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరులో మాత్రం సంబంధిత జిల్లా మంత్రుల పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల జాబితాను వడపోస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి సగటున ముగ్గురు చొప్పున టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించేందుకు సమయం పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
Warangal Municipal Corporation Election 2021: సార్.. టికెట్ ప్లీజ్..!
వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి టీఆర్ఎస్ నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హన్మకొండలో గురువారం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఆశావహులు ఆయనను చుట్టుముట్టిన దృశ్యమే ఇది. - స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ -
అక్రమ ఇళ్లపై అదనపు పన్ను
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా, అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ భవనాలు, గృహాలపై పురపాలక సంఘాలు కొరడా ఝళిపిస్తున్నాయి. అక్రమాలు, ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను జరిమానా కింద ప్రతి ఏటా అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో అక్రమ భవనాలు, గృహాల యజమానులు చెల్లించాల్సిన వార్షిక ఆస్తి పన్నులు 125 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 142 పురపాలక సంఘాలు ఉండగా, జీహెచ్ఎంసీ నేరుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉంది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్(సీడీఎంఏ) పరిధిలో మిగిలిన 141 పురపాలికలు ఉన్నాయి. ఈ 141 పురపాలికల్లో ఇప్పటివరకు గుర్తించిన అక్రమ భవనాలు, గృహాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.93.15 కోట్ల జరిమానాలు విధించగా, ఇందులో రూ.31.08 కోట్లను సంబంధి త భవన యజమానులు చెల్లించారు. జీహెచ్ఎంసీ లో సైతంఇదే తరహాలో అక్రమ భవనాలు, గృహాలపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వీటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంది. వరంగల్, నిజామాబాద్‌ల్లో అత్యధిక జరిమానాలు అనుమతి లేకుండా లేదా బిల్డింగ్ ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను ప్రతి ఏటా జరిమానా కింద అదనంగా వసూలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ 2016 డిసెంబర్ 20న జీవో 299 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని పురపాలికల్లోని అక్రమ, అనధికార కట్టడాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. 141 పురపాలికల్లో వార్షిక ఆస్తి పన్నుల మొత్తం రూ.538.47 కోట్లతో పోల్చితే జరిమానాలు 17 శాతానికి మించి పోయాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అక్కడ వార్షిక ఆస్తి పన్నుల మొత్తం డిమాండ్ రూ.49.94 కోట్లు కాగా, జరిమానాలు రూ.33.01 కోట్లు ఉండడం విశేషం. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.29.61 కోట్ల వార్షిక ఆస్తి పన్ను ఉండగా, రూ.18.19 కోట్ల జరిమానాలు విధించారు. 60 శాతం వసూళ్లు జీహెచ్ఎంసీ మినహా ఇతర 141 పురపాలికల్లో 20,22,171 భవనాలు/గృహాలు ఆస్తి పన్నుల పరిధిలో ఉండగా, 2020–21లో రూ.538.47 కోట్ల ఆస్తి పన్ను, రూ.230.22 కోట్ల పాత బకాయిలు, రూ.93.15 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.861.84 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.359.81 కోట్ల ఆస్తి పన్ను, రూ.127.77 కోట్ల పాత బకాయిలు, రూ.31.08 కోట్ల జరిమానాలు కలిపి మొత్తం రూ.518.66 కోట్లు వసూలయ్యాయి. మొత్తం డిమాండ్‌తో పోల్చితే ఇప్పటివరకు 60.18 శాతం వసూళ్లు జరిగాయి. వచ్చే మార్చి 31లోగా 100 శాతం వసూళ్లను సాధించేందుకు పురపాలక శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. జరిమానాలు ఇలా.. జీవో ప్రకారం..అనుమతించిన ప్లాన్ మేరకు నిర్మించిన భవన అంతస్తుల్లో 10 శాతానికి లోబడి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 25 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన అంతస్తుల్లో 10 శాతానికి మించి సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానా కింద 50 శాతం ఆస్తి పన్నును అధికంగా వసూలు చేస్తున్నారు. ప్లాన్‌లో అనుమతించిన అంతస్తులపై అనధికారికంగా అంతస్తులు నిర్మిస్తే.. అలా అనధికారికంగా నిర్మించిన అంతస్తులపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై జరిమానాగా 100 శాతం ఆస్తి పన్నును అదనంగా వసూలు చేస్తున్నారు. -
రూ.2 లక్షలకు ఒకటి !
బల్దియాలో ఉద్యోగాల అమ్మకం నెల రోజుల వ్యవధిలో మూడింటికి బేరం ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు చిన్న కారణాలతో పాతవారి తొలగింపు చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారులు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అంగడి సరుకుల్లా అమ్ముకుంటున్నారు. మానవతా దృక్పథం మరిచి చిన్నచితకా కారణాలకే కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారు. ఆ స్థానాల్లో కాసులు సమర్పించిన వారిని, తమ బంధుగణాన్ని భర్తీ చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కార్పొరేషన్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపించారు. సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉపాధి ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 2900 మందికి పైగా కార్మికులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీటికి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. దీన్ని గ్రేటర్లో పనిచేస్తున్న కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సరైన కారణాలు లేకుండా, స్వల్ప అనారోగ్య సమస్యలను సాకుగా చూపిస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. గతంలో అడపాదడపా ఇలాంటి వ్యవహారాలు జరిగినా ఇటీవల అవి మరింత పెరిగాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో ముగ్గురుని తొలగించడం గ్రేటర్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వివాదాలు, అవినీతి వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారిన ఇంజనీరింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న అధికారి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పేర్‌పార్ట్స్ మాయంలో ఈయనది కీలక పాత్ర. నెల రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవరుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఆరోగ్యం బాగాలేదని, కొంత కాలం తేలిæకపాటి పనులు అప్పగించాలని ఉన్నతాధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. దీన్ని సాకుగా చూపించి సదరు డ్రైవరును మొత్తానికే విధుల నుంచి తొలగించారు. ఇతని స్థానంలో కొత్త వ్యక్తిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఇందుకు రెండు లక్షల రూపాయలు చేతులు మారాయి. పారిశుద్ధ్య విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో రంగశాయిపేట ప్రాంతంలో పని చేస్తున్నమరో జవానును ఇటీవల విలీన గ్రామాలకు కేటాయించారు. చేరిన కొద్ది కాలానికే సరైన కారణం లేకుండా విధుల నుంచి తొలగించారు. ఈ ఏరియాను పర్యవేక్షిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టరు చెప్పిన వ్యక్తిగత పనులు, ఇంటి పనులు చేయలేదనే కారణంతో విధుల నుంచి తొలగించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ స్థానాన్ని సదరు శానిటరీ ఇన్స్పెక్టరుకు సంబంధించిన బంధువుకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రెండు లక్షల రూపాయలు చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. పారిశుద్ధ్య విభాగంలో హన్మకొండ ప్రాంతంలో పనిచేస్తున్న డ్రైవరు ఇటీవల కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుటుంబానికి ఈ ఉద్యోగమే ఆధారమని, తనకు బదులుగా తన కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకున్నారు. ఈ విషయంలో కాళ్లకు చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే... వీలుకాదంటూ నూటొక్క నిబంధనలు పేర్కొంటూ సదరు ఉద్యోగి అభ్యర్థనను తిరస్కరించారు. ఇది జరగుతుండగానే మరో కొత్త వ్యక్తి ఇతని స్థానంలో పనికి కుదిరాడు. బల్దియాలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పడంతో ఈ మార్పు జరిగినట్లు ఇక్కడ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ రెండు లక్షల రూపాయలు ముడుపులు ముట్టాయి. -
చెత్తకు టెక్నాలజీ
సేకరణ వాహనాలకు వీటీఎస్ పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక యాప్ కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం తొలిదశలో ఎంపికైన వరంగల్ జూన్ కల్లా అందుబాటులోకి.. హన్మకొండ : వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త రవాణా వ్యవస్థలో ప్రక్షాళన జరగనుంది. రోజువారీగా ఎక్కడి నుంచి ఎంత చెత్తను తీస్తున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా చెత్త కుండీలు, చెత్తను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాబోయే రెండు నెలల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పరిశుభ్ర తకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చెత్త నిర్వహణలో సరికొత్త పద్ధతులు ప్రవేశపెడుతోంది. ప్రతీరోజు పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడం ద్వారా వీధులను శుభ్రంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అందిస్తోంది. దీని ప్రకారం చెత్త కుండీలు, చెత్తను డంప్ యార్డులకు తీసుకెళ్లే వాహనాలకు గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. ఒక్కో వాహనం, చెత్తకుండీలకు ప్రత్యేక కోడ్లను కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రతీరోజు చెత్తను కుండీల వారీగా సేకరిస్తున్నారా లేదా ? సేకరించిన చెత్తను డంప్ యార్డులకు తీసుకెళ్తున్నారా లేదా మధ్యలో పారబోస్తున్నారా అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రోజుల తరబడి చెత్తను సేకరించని ప్రాంతాలను గుర్తించి, అందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. తొలిదశలో వరంగల్ మున్సిపాలిటీల్లో చెత్త సేకరణలో జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 నగరాల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 70 వాహనాలకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమరుస్తారు. చెత్త వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక కెమెరాలు అందిస్తారు. జీపీఎస్, కెమెరాల ఉపయోగంపై వీరికి శిక్షణ ఇస్తారు. 2016 మే చివరి కల్లా నగరంలో ఉన్న వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. డస్ట్బిన్ల వారీగా చెత్త సేకరణకు ముందు, చెత్త సేకరణకు తర్వాత అనే విధంగా ప్రతీరోజు రెండు ఫొటోలను తీసి ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం సమచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. సెంట్రల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రత్యేక సంస్థ చూసుకుంటుంది. కుంటిసాకులు కుదరవు చెత్త సేకరణ విధానంలో వీపీఎస్ (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్)కు అనుగుణంగా స్మార్ట్ఫోన్లపై పనిచేసే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెస్తారు. ఏదైనా ప్రాంతంలో చెత్త సేకరణలో లోపాలు ఉంటే ఫొటో తీసి యాప్ (అప్లికేషన్) ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. నిర్ణీత సమయంలోగా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఈ ఫిర్యాదుపై స్పందించి .. తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అందించాలి. ఈ అప్లికేషన్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ చూస్తుంది. కాబట్టి స్థానిక అధికారుల పాత్ర స్వల్పం. ఫలితంగా సమస్య పరిష్కారంలో కుంటి సాకులు చెప్పడం వీలుకాదు. ఈ విధానం వల్ల చెత్త సేకరణలో పారదర్శకత ఏర్పడుతుంది. సమస్యను పరిష్కరించడంలో పారిశుద్ధ్య సిబ్బంది అశ్రద్ధ చేయడం తగ్గిపోతుంది. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 45 వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఉన్నప్పటికీ, పారదర్శకతపై సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం 45 వాహనాల నిర్వహణకు సంబంధించి ప్రతీనెల ఖర్చు అవుతున్న దాదాపు రూ.50వేలు మిగులుతారుు. డస్ట్బిన్ల వారీగా చెత్త సేకరణకు ముందు, చెత్త సేకరణకు తర్వాత అనే విధంగా ప్రతీరోజు రెండు ఫొటోలను తీసి ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం సమాచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. సెంట్రల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రత్యేక సంస్థ చూసుకుంటుంది. -
ఖమ్మం ఎన్నిక: టీఆర్ఎస్ మూడు జాబితాలు
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ టీఆర్ఎస్ బుధవారం మూడు జాబితాలు విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు 50 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రకటించింది. అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్‌కు టీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసింది. 28 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, టీడీపీ కూడా ఈ రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి. కాగా, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఫిబ్రవరి 22న మొదలైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు. మార్చి 6వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. మార్చి 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: అరాచకపాలన సాగిస్తున్న టీఆర్ఎస్కు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అసత్య ప్రచారాలతో ముందుకొస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాన్ని గమనించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి భవిష్యత్‌లో కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చేలా చూడాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం పెద్దమొత్తంలో నిధులిచ్చిందని, రోడ్ల కోసం రూ.43 వేల కోట్లు, 81వేల డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేసిందని, వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని గుర్తుచేశారు. కాగా, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఖమ్మం పరిశీలకుడిగా ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అచ్చంపేట నగర పంచాయతీ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు.