రూ.2 లక్షలకు ఒకటి !
- బల్దియాలో ఉద్యోగాల అమ్మకం
- నెల రోజుల వ్యవధిలో మూడింటికి బేరం
- ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు
- చిన్న కారణాలతో పాతవారి తొలగింపు
- చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారులు
- నెల రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డ్రైవరుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఆరోగ్యం బాగాలేదని, కొంత కాలం తేలిæకపాటి పనులు అప్పగించాలని ఉన్నతాధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. దీన్ని సాకుగా చూపించి సదరు డ్రైవరును మొత్తానికే విధుల నుంచి తొలగించారు. ఇతని స్థానంలో కొత్త వ్యక్తిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఇందుకు రెండు లక్షల రూపాయలు చేతులు మారాయి.
- పారిశుద్ధ్య విభాగంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రంగశాయిపేట ప్రాంతంలో పని చేస్తున్నమరో జవానును ఇటీవల విలీన గ్రామాలకు కేటాయించారు. చేరిన కొద్ది కాలానికే సరైన కారణం లేకుండా విధుల నుంచి తొలగించారు. ఈ ఏరియాను పర్యవేక్షిస్తున్న శానిటరీ ఇన్స్‌పెక్టరు చెప్పిన వ్యక్తిగత పనులు, ఇంటి పనులు చేయలేదనే కారణంతో విధుల నుంచి తొలగించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ స్థానాన్ని సదరు శానిటరీ ఇన్స్‌పెక్టరుకు సంబంధించిన బంధువుకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రెండు లక్షల రూపాయలు చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది.
- పారిశుద్ధ్య విభాగంలో హన్మకొండ ప్రాంతంలో పనిచేస్తున్న డ్రైవరు ఇటీవల కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుటుంబానికి ఈ ఉద్యోగమే ఆధారమని, తనకు బదులుగా తన కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకున్నారు. ఈ విషయంలో కాళ్లకు చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే... వీలుకాదంటూ నూటొక్క నిబంధనలు పేర్కొంటూ సదరు ఉద్యోగి అభ్యర్థనను తిరస్కరించారు. ఇది జరగుతుండగానే మరో కొత్త వ్యక్తి ఇతని స్థానంలో పనికి కుదిరాడు. బల్దియాలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పడంతో ఈ మార్పు జరిగినట్లు ఇక్కడ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ రెండు లక్షల రూపాయలు ముడుపులు ముట్టాయి.