out sorcing
-
వర్క్‌స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
రూ.2 లక్షలకు ఒకటి !
బల్దియాలో ఉద్యోగాల అమ్మకం నెల రోజుల వ్యవధిలో మూడింటికి బేరం ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు చిన్న కారణాలతో పాతవారి తొలగింపు చక్రం తిప్పుతున్న ఇద్దరు అధికారులు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అంగడి సరుకుల్లా అమ్ముకుంటున్నారు. మానవతా దృక్పథం మరిచి చిన్నచితకా కారణాలకే కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారు. ఆ స్థానాల్లో కాసులు సమర్పించిన వారిని, తమ బంధుగణాన్ని భర్తీ చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కార్పొరేషన్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపించారు. సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉపాధి ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 2900 మందికి పైగా కార్మికులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీటికి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. దీన్ని గ్రేటర్లో పనిచేస్తున్న కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సరైన కారణాలు లేకుండా, స్వల్ప అనారోగ్య సమస్యలను సాకుగా చూపిస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. గతంలో అడపాదడపా ఇలాంటి వ్యవహారాలు జరిగినా ఇటీవల అవి మరింత పెరిగాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో ముగ్గురుని తొలగించడం గ్రేటర్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వివాదాలు, అవినీతి వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారిన ఇంజనీరింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న అధికారి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పేర్‌పార్ట్స్ మాయంలో ఈయనది కీలక పాత్ర. నెల రోజుల క్రితం ఇంజనీరింగ్ విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవరుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఆరోగ్యం బాగాలేదని, కొంత కాలం తేలిæకపాటి పనులు అప్పగించాలని ఉన్నతాధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. దీన్ని సాకుగా చూపించి సదరు డ్రైవరును మొత్తానికే విధుల నుంచి తొలగించారు. ఇతని స్థానంలో కొత్త వ్యక్తిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఇందుకు రెండు లక్షల రూపాయలు చేతులు మారాయి. పారిశుద్ధ్య విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో రంగశాయిపేట ప్రాంతంలో పని చేస్తున్నమరో జవానును ఇటీవల విలీన గ్రామాలకు కేటాయించారు. చేరిన కొద్ది కాలానికే సరైన కారణం లేకుండా విధుల నుంచి తొలగించారు. ఈ ఏరియాను పర్యవేక్షిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టరు చెప్పిన వ్యక్తిగత పనులు, ఇంటి పనులు చేయలేదనే కారణంతో విధుల నుంచి తొలగించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ స్థానాన్ని సదరు శానిటరీ ఇన్స్పెక్టరుకు సంబంధించిన బంధువుకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రెండు లక్షల రూపాయలు చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. పారిశుద్ధ్య విభాగంలో హన్మకొండ ప్రాంతంలో పనిచేస్తున్న డ్రైవరు ఇటీవల కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుటుంబానికి ఈ ఉద్యోగమే ఆధారమని, తనకు బదులుగా తన కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకున్నారు. ఈ విషయంలో కాళ్లకు చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే... వీలుకాదంటూ నూటొక్క నిబంధనలు పేర్కొంటూ సదరు ఉద్యోగి అభ్యర్థనను తిరస్కరించారు. ఇది జరగుతుండగానే మరో కొత్త వ్యక్తి ఇతని స్థానంలో పనికి కుదిరాడు. బల్దియాలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పడంతో ఈ మార్పు జరిగినట్లు ఇక్కడ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ రెండు లక్షల రూపాయలు ముడుపులు ముట్టాయి.