రాజమండ్రి కార్పొరేషన్ 2015-16 బడ్జెట్‌కు రూపకల్పన
మహా పర్వం పనులన్నీ ఆర్థిక సంఘం నిధులతోనేనట..
సాధారణంగా ఆ సొమ్ముల విడుదలపై అనేక ఆంక్షలు
పుష్కర పనులపై స్పష్టత కావాలంటున్న విపక్షం
రాజమండ్రి : ఆర్థిక సంఘం నిధులంటేనే సవాలక్ష ఆంక్షలతో విడుదలవుతాయని మున్సిపాలిటీలు వాపోతుంటాయి. అలాంటిది.. నగరంలో రాబోయే గోదావరి పుష్కరాలను పూర్తిగా 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్నారంటే జరిగే పనేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి నగరపాలక సంస్థ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రూ.240 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి తమ బడ్జెట్లోంచి కొత్తగా కేటాయింపులు అక్కర్లేద ని బడ్జెట్ రూపకల్పన సందర్భంగా నిర్ధారించుకున్నట్టున్నారు. అందుకే పుష్కరాల కేటాయింపులు లేకుండానే 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆమోదించేందుకు కౌన్సిల్ శనివారం సమావేశమవుతోంది.
అమలు సాధ్యం కాని అంచనాలు..
రెండేళ్ల విరామం అనంతరం (నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడ్డ తర్వాత) జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం ఇది. ఇందులో నగరాభివృద్ధికి అద్భుతమైన ప్రణాళికలు వేస్తారనుకుంటే అవి ఎక్కడా కనిపించ లేదు. కేవలం జమాఖర్చుల పద్దులు అమోదింప చేసుకునేందుకే బడ్టెట్ రూపొందించినట్టు కనిపిస్తోంది. తూతూ మంత్రపు బడ్జెట్‌పై విపక్ష సభ్యులు కూడా పెదవి విరుస్తున్నారు. నగర పాలక సంస్థకు వివిధ పద్దుల ద్వారా వచ్చే ఆదాయం రూ.412.75 కోట్లుగా చూపించారు. గత సంవత్సర నిల్వలు రూ.41.32 కోట్లతో కలిపి మొత్తం ఆదాయం 454.07 కోట్లని తేల్చారు. చేయబోయే వ్యయం మాత్రం రూ.437.72 కోట్లుగా తేల్చిన అధికారులు ఇంకా రూ.16.36 కోట్లు మిగులు ఉంటుందని చూపుతున్నారు. 2014-15 బడ్జెట్‌లో అప్పటి ప్రారంభ నిల్వతో కలిపి రూ.286.79 కోట్లు ఆదాయంగా చూపగా వచ్చింది మాత్రం రూ. 195 కోట్లే. అయితే అధికారులు రూ.195.23 కోట్ల మేర వ్యయం కాగలదని అంచనాలు వేస్తే, అందులో రూ.153.91 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది బడ్జెట్ కూడా ఇదే మాదిరి అంచనాలకు అందద ని భావిస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు అంచనాల్లో రూ.320 కోట్లు వివిధ పథకాల గ్రాంట్లుగా బడ్జెట్‌లో చూపుతున్నారు. ఇందులో పుష్కరాలకు 13 ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు రూ.240 కోట్లని చూపించారు. అంటే కార్పొరేషన్‌కు ఇతర గ్రాంట్ల రూపంలో వచ్చేది మాత్రం రూ.80 కోట్లు మాత్రమే.
ఆ నిధులు రాకుంటే చిక్కే..
ఆర్థిక సంఘం నిధులను కేంద్రం కొన్ని నిబంధనలకు లోబడి విడుదల చేస్తుంది. గత కాలపు పనుల వినియోగ పత్రాలు చూసి, తరువాత కాలానికి నిధుల విడుదల చేస్తారు. 13వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు మొత్తంగానే సుమారు రూ.వంద కోట్లు రాని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఎక్కడి నుంచి మళ్లిస్తుంది, ఎలా సరిపెడుతుంది అనేది ప్రశ్నార్థకం. కార్పొరేషన్ పరిధిలో 536 పుష్కరాల పనులకు రూ.240 కోట్లు కేటాయిం చగా, వీటిలోంచి రూ.50 కోట్లు వ్యయమయ్యే 331 పనులకు టెండర్లు పిలిచారు. ఇంకా రూ. 190 కోట్ల విలువైన 205 పనులకు టెండర్లు పిల వాల్సి ఉంది. పనులు ప్రారంభమయ్యాక సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయక పో తే పరిస్థితి ఏమిటని, పుష్కరాల నిధులపై ఓ స్పష్టత కావాలని ప్రతిపక్షసభ్యులు బడ్జెట్ సమావేశంలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.
పుష్కరాలకు పైసా లేదు..
Published Sat, Feb 21 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement