పురపాలికల దూకుడు..!
ఆర్థిక సంవత్సరం చివర్లో పుంజుకున్న ఆస్తి పన్ను వసూళ్లు
- గ్రేటర్‌లో రూ.1,246 కోట్లు, ఇతర పురపాలికల్లో రూ.271 కోట్ల రాబడి
- నాలుగు పురపాలికల్లో 100 శాతం వసూళ్లు
- నల్లా చార్జీలు, మడిగెల అద్దె, ట్రేడ్ లైసెన్స్ చార్జీల వసూళ్లలో డీలా
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని పురపాలికలు దూకుడు ప్రదర్శించాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో రాబడిని అమాంతం పెంచుకున్నాయి. మార్చి 31తో ముగిసిన 2016–17 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ రూ.1,246 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసి రికార్డు సృష్టించగా.. రాష్ట్రంలోని 73 ఇతర పురపాలికలు సైతం 81.23 శాతం పురోగతితో రూ.271.43 కోట్ల వసూళ్లు సాధించాయి. మార్చి 10 నాటికి ఈ 73 పురపాలికల్లో 53 శాతం ఆస్తి పన్నులు మాత్రమే వసూలు కాగా, చివరి 20 రోజుల్లో మరో 28 శాతం వసూళ్లను రాబట్టుకోవడం విశేషం. ఈ 73 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం రూ.334.14 కోట్ల ఆస్తి పన్నులకుగానూ రూ.271.43 కోట్లు వసూలయ్యాయి. పురపాలక మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు ఆర్థిక సంవత్సరం చివర్లో పన్నుల వసూళ్ల కోసం పురపాలక శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్స్ ఫలించడంతో ఒక్కసారిగా గల్లా పెట్టెలు నిండాయి.
మెట్‌పల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఎన్‌ఏసీ శంషాబాద్ మున్సిపాలిటీల్లో 100 శాతం ఆస్తి పన్ను వసూలైంది. పెద్దపల్లి నగర పంచాయతీ 99.80 శాతం, ఆర్మూర్ 99.14 శాతం, నారాయణపేట్ 98.64 శాతం, షాద్‌నగర్ 98.47 శాతం, కొత్తగూడెం 97.60 శాతం, భువనగిరి 97.17 శాతం వసూళ్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యల్ప వసూళ్లు జరిగిన 10 పురపాలికలను పరిశీలిస్తే.. 37.65 శాతంతో భూపాలపల్లి, 56.96 శాతంతో పాల్వంచ అట్టడుగు స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో 57.47 శాతంతో వనపర్తి, 59.43 శాతంతో నల్లగొండ, 60.28 శాతంతో ఇబ్రహీంపట్నం, 64.88 శాతంతో కాగజ్‌నగర్, 66.71 శాతంతో అందోల్–జోగిపేట, 68.50 శాతంతో హుస్నాబాద్, 69.27 శాతంతో కరీంనగర్, 69.34 శాతంతో మంచిర్యాల నిలిచాయి.
ఇతర పన్నులు, చార్జీల వసూళ్లు అంతంతే..
ఆస్తి పన్ను వసూళ్లలో దూకుడు ప్రదర్శించిన పురపాలికలు నల్లా చార్జీలు, డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్స్, మడిగెల అద్దెలు, ప్రకటన పన్నుల వసూళ్లకు వచ్చేసరికి డీలా పడ్డా యి. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 పురపాలికల పరిధిలో రూ.138.69 కోట్ల నల్లా చార్జీలకుగానూ రూ. 55.67 కోట్లు(40.14%) మాత్రమే వసూలయ్యాయి. అలాగే రూ.12.62 కోట్ల డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్స్ చార్జీలకుగానూ రూ.6.88 కోట్లు(54.54%) రాబట్టుకోగలిగా యి. రూ.24.17 కోట్ల మడిగెల అద్దెలకుగానూ రూ. 12.44 (51.49%) వసూలు చేయగలిగాయి. రూ.4.33 కోట్ల ప్రకటనల పన్నులకుగానూ రూ.3.39 కోట్లు(78.45%) వసూలు చేశాయి.