హైదరాసాగర్ | heavy rains in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాసాగర్

Published Thu, Sep 22 2016 3:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

హైదరాసాగర్ - Sakshi

హైదరాసాగర్

రికార్డు స్థాయి వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం

 సాక్షి, హైదరాబాద్: చెరువులను చెరబడితే ఏమౌతుంది..? నాలాలనూ మింగేసి భవంతులు కట్టేస్తే ఏం జరుగుతుంది..? అందుకు సమాధానమే.. మహానగరంలో తాజా జల విలయం!! కబ్జాకు గురైన చెరువులన్నీ ఉప్పొంగుతున్నాయి. కట్టలు తెంచుకొని నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నాలాలన్నీ ఉగ్రరూపం దాల్చి ఉరకలెత్తుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. 155 కాలనీలను ముంచెత్తాయి! 115 అపార్ట్‌మెంట్లను జలమయం చేశాయి. వేలాది మంది కంటి మీద కునుకు కరువై భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన  భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. శివారు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. హకీంపేట్‌లో 16.7 సెం.మీ, షాపూర్‌నగర్‌లో 16.4 సెం.మీ, కూకట్‌పల్లిలో 12.2 సెం.మీ, బొల్లారంలో 9 సెం.మీ.ల భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. భారీ వర్షాలకు నగరంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు!

నగర జీవికి నరకం
కుండపోత వర్షంతో నగర జీవి నరకాన్ని చవిచూశాడు. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, షాపూర్‌నగర్, చింతల్, బోయిన్‌పల్లి, నిజాంపేట్ ప్రాంతాల్లోని ప్రతి వీధి చెరువును తలపించింది. వర్షాలకు పద్మావతినగర్‌కు చెందిన సవిత అనే మహిళ, నిజాంపేట్‌లో అపార్ట్‌మెంట్‌లోకి చేరిన నీటిని తోడేస్తుండగా కనకదుర్గా ప్రసాద్ మృతి చెందారు. కొంపల్లిలో ఇంటి గోడ కూలి ఆర్మూర్‌కు చెందిన  నాగలింగం మృతి చెందాడు.

ఇక హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. దీని గరిష్ట నీటి మట్టం 513.41 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిగా నిండింది కూకట్‌పల్లి, బుల్కాపూర్, పికెట్ నాలాల నుంచి 5 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువనున్న 4 తూముల నుంచి 4 వేల క్యూసెక్యుల నీటిని బయటకు వదులుతున్నారు. సాగర్‌కు ఆనుకొని ఉన్న లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయం 1790 అడుగుల గరిష్ట మట్టానికిగాను ప్రస్తుతం 1767.75 అడుగుల మేర నీరు చేరింది. హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1763.500 అడుగులకు గాను 1732.84 మేర వరద నీరు చేరింది.

ఉప్పొంగిన చెరువులు..కాలనీలు జలమయం
హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 2,500 చెరువులు ఉండగా.. వాటిలో 1000 చెరువుల వరకు కబ్జాకు గురైనట్లు  అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలు నీటమునుగుతున్నాయి. బుధవారం కూడా చాలాచోట్ల ఇదే జరిగింది. నిజాంపేట్‌లో తుర్కచెరువు నిండు కుండలా మారి పొంగి పొర్లడంతో బండారి లే అవుట్ కాలనీ పూర్తిగా నీటమునిగింది. అపార్ట్‌మెంట్‌లలో సెల్లార్‌లలోకి నీరు చేరి 200 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పూర్తిగా అంధకారం అలుముకుంది. అపార్ట్‌మెంట్ వాసులు బయటకు రాలేకపోయారు. వారికి తాళ్ల సహాయంతో మంచినీళ్లు, పాల ప్యాకెట్‌లు  అందజేశారు. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల సూరారం కాలనీలు నీటమునిగాయి.

మియాపూర్, కూకట్‌పల్లి, లింగంపల్లి, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు అపార్ట్‌మెంట్‌లలోకి చేరడంతో స్థానికులు అల్లాడారు. నాచారం ఎర్రగుంట్ల చెరువు నిండి నాలా పొంగింది. బోయిన్‌పల్లిలో రామన్నకుంట చెరువు తెగి జనావాసాల్లోకి  భారీగా వరద నీరు చేరింది. బేగంపేట్ నాలా ఉప్పొంగడంతో అల్లంతోట బస్తీ జలమయమైంది. కూకట్‌పల్లి ప్రగతినగర్, ముసాపేట్, ఎర్రగడ్డ, ఖైత్లాపూర్ ప్రాంతాల్లోనూ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలోకి నీరు చేరి వందలాది వాహనాలు  నీటమునిగాయి. కుత్బుల్లాపూర్, కొంపల్లి, మేడ్చెల్, చింతల్, సుభాష్‌నగర్, జీడిమెట్ల పారిశ్రామికవాడ, సుభాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు బుధవారం సెలవు ఇచ్చారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేశామని, నీటిని పూర్తిగా తోడిన తర్వాత  సరఫరాను పునరుద్ధరిస్తామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.

యువకుడిని కాపాడిన హమాలీ
వాగులో చిక్కుకున్న యువకుడిని రక్షించి అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు ఓ హమాలీ! భారీ వర్షాలకు పటాన్ చెరు ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని పెద్దవాగు పొంగింది. హత్నూర్ మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీను అనే యువకుడు బుధవారం ఫలక్‌నుమాకు బస్సులో బయలుదేరాడు. పెద్దవాగు పొంగడంతో బస్సు దిగి వాగు దాటేందుకు యత్నించి వరదలో చిక్కుకుపోయాడు. అధికారులు అక్కడికి చేరుకొని యువకుడిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా.. పక్కనే ఉన్న రైస్‌మిల్లులో పనిచేసే హమాలీ నిరంజన్  (ఒడిశా) ప్లాస్టిక్ డబ్బా ద్వారా ఈదుకుంటూ వెళ్లి శ్రీనును రక్షించాడు. నిరంజన్ కు స్థానికులు రూ.4 వేల నగదు అందించి అభినందించారు.

16 ఏళ్ల తర్వాత..
2000లో ఆగస్టు 24న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 24.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. 16 ఏళ్ల తర్వాత బుధవారం మళ్లీ ఆ స్థాయిలో వర్షం కురిసింది. హకీంపేట్‌లో 16.7 సెం.మీ. రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. షాపూర్‌నగర్‌లో 16.4 సెం.మీ, కూకట్‌పల్లిలో 12.2 సెం.మీ, బొల్లారంలో 9 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 9.4 సెం.మీ, మాదాపూర్‌లో 7.4, బాలానగర్‌లో 7.2 సెం.మీ, బేగంపేట్‌లో 6.8 సెం.మీ, శేరిలింగంపల్లిలో 5 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. నగరంలో సగటున 7 నుంచి 8 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో గురు, శుక్రవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement