సాక్షి, హైదరాబాద్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో పనిచేస్తున్న మహిళలైన రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు చెల్లించే బాధ్యత నుంచి ఆ సంస్థ పూర్తిగా వైదొలిగింది. కొన్ని నెలలుగా వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.4 వేల మొత్తాన్ని ఏ అకౌంట్ నుంచి ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జనరల్ ఫండ్ నుంచే ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ ఉత్తర్వులు వెలువడి మూడు నెలలు గడిచినా.. రిసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు ఏ ఒక్క మునిసిపాలిటీ/ కార్పొరేషన్‌లో ఇవ్వలేదు. వారికి 25.38 కోట్ల గౌరవ వేతనాలు ప్రభుత్వం బకాయిపడింది. ఈ నేపథ్యంలో రిసోర్స్ పర్సన్లు నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. మురికివాడల్లో పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం, రికవరీ చేయించడం మినహా ప్రభుత్వం అప్పగించే ఏ పని చేయలేమని అల్టిమేటం ఇచ్చారు.
వీఎల్‌ఆర్, స్త్రీనిధి ఫండ్స్ నుంచే వేతనాలు
స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్, పట్టణ వికలాంగుల సమాఖ్యల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 5,765 మంది రిసోర్స్ పర్సన్లు ఉన్నారు. వీరందరికీ నెల వేతనంగా రూ.2.3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మెప్మాలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్‌కు వేతనాల కోసం ప్రత్యేక అకౌంట్ ఏమీ లేదు. దీంతో మంత్రి కేటీఆర్‌ను కలసి విజ్ఞప్తి చేసినప్పుడల్లా వడ్డీ లేని రుణాలు (వీఎల్‌ఆర్), స్త్రీ నిధి ఫండ్స్ కింద బడ్జెట్ విడుదల చేసి గౌరవ వేతనాలు అందజేసేవారు.
గత నవంబర్ నుంచి ఎవరికీ గౌరవ వేతనం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆర్‌పీల నుంచి ఒత్తిడి పెరగడంతో గత ఆగస్టు 3న 2018లో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్–164 ప్రకారం ఆర్‌పీలకు అర్బన్ లోకల్ బాడీల నుంచే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి మెమో జారీ చేశారు. దీంతో మెప్మా నుంచి వేతనాలు వచ్చే అవకాశాలకు ఫుల్‌స్టాప్ పడింది. మరోవైపు స్థానిక సంస్థలు కూడా రూపాయి కేటాయించలేదు.
మెట్‌పల్లిలో 34 మందికి 9 నెలల వేతనం
మెప్మా, స్థానిక పట్టణ సంస్థలేవీ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంతో 5,765 మంది రిసోర్స్ పర్సన్స్ తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీవర్ సర్వే, హరితహారం, నల్లా సర్వే, పారిశుధ్య సర్వే వంటి పలు సేవలతో పాటు అంగన్‌వాడీ, ఆశ, ఏఎన్‌ఎం వర్కర్లతో కలసి చేసే పనులేవీ తాము చేయలేమని ఆర్‌పీలు తేల్చిచెప్పారు.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, కమిషనర్లకు, మెప్మా పీడీలకు లేఖలు ఇవ్వగా, మెట్‌పల్లి మున్సిపాలిటీ విషయంలో మాత్రమే జగిత్యాల కలెక్టర్ స్పందించారు. మెట్‌పల్లిలో పనిచేస్తున్న 34 మంది ఆర్పీలకు గత ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు 9 నెలల వేతనం 12.24 లక్షలు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపారు.
మంత్రి కేటీఆర్ దయ చూపాలి
పట్టణ మురికివాడల్లో పొదుపు సంఘాల ద్వారా ఇతర ప్రభుత్వ సేవల ద్వారా కష్టపడుతున్న రీసోర్స్ పర్సన్లకు నెల నెలకు రూ.4 వేల గౌరవ వేతనం ఇప్పించేందుకు మంత్రి కేటీఆర్ దయ చూపాలి. ప్రభుత్వమే ఆర్పీలకు బడ్జెట్ విడుదల చేయాలి. పండుగ సమయంలో కూడా వేతనాలు లేని పరిస్థితి ఉంది.
– సునీత, ఆర్‌పీల సంఘం అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment