ఖమ్మం సిటీ : జిల్లా కేంద్రం ఖమ్మంనగరంతో పాటు ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, మధిర మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారాయి. వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. చెత్తకుండీలు నిండిపోయి వీధులను ఆక్రమిస్తున్నాయి. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు వీధుల వెంట రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 1036 మంది పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. గతంలో సమ్మె జరిగినప్పుడు సత్తుపల్లిలో 70 మంది కార్మికులను విధుల్లో నుంచి తొలగించారు. రెండు నెలల తర్వాత వారిని విధుల్లోకి తీసుకున్నారు. ఆ భయంతో ఆ నగర పంచాయతీ కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నారు. సత్తుపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా కార్మికులు సమ్మెల్లో పాల్గొంటున్నారు.
కార్మికుల సమ్మెతో...
మున్సిపల్ కార్మికులు తమ 16 న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ నాలుగు రోజులుగా విధులు బహిష్కరించారు. దీని ప్రభావం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై తీవ్రంగా పడింది. కార్మికులు విధులు బహిష్కరించడంతో నగరంతోపాటు ఇతర మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. మున్సిపల్ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో పారిశుధ్యం పడకేసింది. ఖమ్మం కార్పొరేషన్లో పారిశుధ్య విభాగంలో 580 మంది కార్మికులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.
5 ట్రాక్టర్లు, మూడు డంపర్ల ద్వారా నగరంలో ప్రతి రోజు 106 టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. నాలుగు రోజులుగా కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో నగరంలోనే సుమారు 400కుపైగా టన్నుల చెత్త పేరుకుపోయింది. కార్పొరేషన్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 70 మంది ఉన్నా వీరితో అత్యవసర పనులు మాత్రమే చేయిస్తున్నారు. ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందే ఉండటంతో పారిశుధ్య విభాగం పనులు దాదాపు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో కార్పొరేషన్‌లో చెత్త తరలించే వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయూరుు. 25 ట్రాక్టర్లు, 3 డంపర్‌బీన్‌లు, ఆటోల్లో కేవలం ఒకటి, రెండు మాత్రమే తిరుగుతున్నాయి.
పేరుకుపోతున్న చెత్త..
సమ్మె ప్రభావంతో ఖమ్మంతోపాటు కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ మధిరలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. జిల్లా మొత్తం చెత్తమయంగా మారుతోంది. కొత్తగూడెంలో సఫాయిబస్తీ, పాత కొత్తగూడెం, న్యూగొల్లగూడెం, ప్రగతినగర్, దుర్జన్‌బస్తీ, మేదరబస్తీల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఇల్లెందులోని స్టేషన్‌బస్తీ, నెంబర్-2 బస్తీ, జగదాంబ సెంటర్, ఇందిరానగర్, కాకతీయ నగర్, నంబర్ 14, నంబర్ 15, నంబర్ 16 ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. పాల్వంచలోని శాస్త్రీరోడ్, మార్కెట్ ఏరియా, బొల్లోరిగూడెం, చాకలిబజార్, నటరాజ్‌సెంటర్, బీసెంట్‌రోడ్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. మణుగూరులోని మెయిన్ రోడ్, శేషగిరినగర్, రాజుపేటతోపాటు పలు మురికివాడల్లో చెత్త పేరుకుపోయింది. మధిరలో రామాలయం వీధి, వర్తకసంఘం వీధి, కూరగాయల మార్కెట్‌రోడ్, బంజారకాలనీ ప్రాంతాల్లో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంది. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో చెత్త మురిగి దుర్గంధం వెదజల్లుతోంది.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె..
ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె చేస్తం. ప్రభుత్వానికి ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదు. సమ్మెకు దిగినా మా సమస్యలపై స్పందించడం లేదు. తెలంగాణ ఏర్పడక ముందే 27 శాతం మధ్యంతర భృతి సాధించుకున్నం. రాష్ట్రమొస్తే మా జీతం పెరుగుతుందని ఆశపడ్డం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి.
జిల్లా సుగుణమ్మ, మున్సిపల్ కార్మికురాలు
చెత్త..చెత్త..
Published Fri, Jul 10 2015 4:23 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement