Panchayat workers
-
ఉద్యోగం నుంచి తొలగించారని.. ఉరి వేసుకున్నాడు
కోనరావుపేట(వేములవాడ): ముప్పై ఏళ్లుగా చేస్తున్న పనిలోంచి అకారణంగా తొలగించడంతో మనస్తాపానికి గురైన పంచాయతీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కార్మికుడి మృతికి కారణమైన సర్పంచ్, సర్పంచ్ భర్తను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేటలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆకుల రామదాసు(68) గ్రామపంచాయతీలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న ఉపాధిహామీ పనుల పరిశీలనకు గ్రామానికి కేంద్ర బృందం రాగా..గ్రామస్తులు అడ్డుకుని సర్పంచ్, సర్పంచ్ భర్తపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన సర్పంచ్ లత భర్త ఆరె మహేందర్ పంపు ఆపరేటర్ రామదాసును దుర్భాషలాడుతూ విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు. వరుసగా మూడ్రోజులు మహేందర్ దగ్గరికి వెళ్లి బతిమిలాడినా వినిపించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రామదాసు బుధవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని జామచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గ్రామస్తుల ఆగ్రహం సర్పంచ్, సర్పంచ్ భర్తను శిక్షించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహా రం అందించాలంటూ గ్రామస్తులు ఆందోళనబాట చేపట్టారు. వేములవాడ ఆర్డీవో లీలావతి, డీఎల్పీవో మల్లికార్జున్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
పంచాయతీ కార్మికుల కష్టానికి ఫలితం
సాక్షి, బాల్కొండ: పెంచిన వేతనాల అమలుకు జీవో జారీ కావడంతో గ్రామ పంచాయతీల్లోని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్, ఎలక్ట్రీషియన్లకు ప్రతి నెలా రూ.8,500 వేతనం చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులను జారీ చేసింది. మన ఊరు మన ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచుతూ రెండు నెలల కిందనే నిర్ణయం తీసుకున్నా ఉత్తర్వులను మాత్రం నిన్న జారీ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,057 పంచాయతీల్లో పని చేస్తున్న సుమారు 4,500 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. పంచాయతీల్లో పని చేసే కార్మికులకు గతంలో అతి తక్కువగా వేతనాలను చెల్లించారు. పంచాయతీల్లో ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్మికులకు వేతనాలను నిర్ణయించారు. అలా ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అం దాయి. రూ.2వేల నుంచి రూ.4వేల లోపు వేతనం అందడంతో కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వం కార్మికులకు పలుమార్లు హామీ ఇచ్చినా వేతనాలను మాత్రం పెంచలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్మికులకు వేతనాలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. అయితే కార్మికులకు వేతనాల చెల్లింపు భారాన్ని మాత్రం పంచాయతీలపైనే ప్రభుత్వం మోపింది. పంచాయతీల్లో ఆదాయం తక్కువగా ఉంటే కార్మికుల వేతనాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధుల నుంచి వినియోగించుకునే వీలు ఉంది. కాగా కార్మికులకు పెంచిన వేతనాలను ఏ విధంగా చెల్లించాలని అనే విషయంపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే వేతనాల చెల్లింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమకు ఏ విధంగానైనా పెంచిన వేతనాలను చెల్లిస్తే అదే పదివేలు అని కార్మికులు చెబుతున్నారు. కాగా పెంచిన వేతనాన్ని వెంటనే అమలులోకి తీసుకువచ్చి చెల్లింపులు జరుపాలని పలువురు కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా జరిపిన పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచిందని కార్మిక నేతలు పేర్కొన్నారు. కార్మికుల సంబురాలు ఫోరాట ఫలితమే గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు జీవో విడుదల అయ్యిందని మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు. కార్మికులు బాణ సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. ఈ సం దర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధానకార్యద ర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు వేతనా లు పెంచాలని ఆందోళనలు చేశారని అన్నా రు. సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు కొక్కండ, అశోక్, నందు, సూరం రవి పాల్గొన్నారు. వేతనం ప్రతినెలా చెల్లించాలి రెండు నెలల కిందనే ప్రభుత్వం మాకు వేతనాలను పెంచింది. అయితే ఇప్పుడు జీవో జారీ అయ్యింది. మాకు రెండు నెలల నుంచి పెంచిన వేతనం అమలు చేయాలి. వేతనంను ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గజ్జెల మధు, పారిశుద్ధ్య కార్మికుడు, ధర్మోరా -
ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ..?
సాక్షి, గుడిహత్నూర్ (ఆదిలాబాద్) : గ్రామ పంచాయతీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగు కన్పించడం లేదు. ఒకటి కాదు రెండు కాదు దశాబ్ధాలుగా పని చేస్తూ.. నేడో..రేపో తమను గుర్తించక పోతారా..? అనే ఆశతో కడుపు నింపని జీతాలతో దయనీయ స్థితి లో ఇటు పని భారాన్ని.. అటు కుటుం బ భారాన్ని మోస్తున్నారు. ఈ పని వదిలి బయటకు వెళ్లలేక.. అదనపు ఆదాయం కో సం మరో పని చేయలేక సతమతమవుతున్నారు. పంచాయతీల్లో పని చేసే కారోబార్లు, దినసరి ఉద్యోగులు, పారిశుధ్య కార్మి కులు, పంచాయతీల్లో వివిధ పనుల కోసం నియమించిన కామాటీల పరిస్థితి దారుణంగా ఉంది. వీరంతా గ్రామాల్లో కాలువ ల నిర్వహణ, చెత్త సేకరించి తరలించడం, సమయానికి తాగునీరు అందించడం, ప న్నులు వసూలు చేయడం, వివిధ ప్రభు త్వ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయ డం దండోరా ఇచ్చి ప్రజలను పోగు చేయ డం నుంచి పశు కళేబరాలను తరలిం చడంతో పాటు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నా..ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి గుర్తింపు లభించడం లేదు. చాలీచాలని వేతనాలతో కుటుంబ భారాన్ని మోయడం తమ వల్ల కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కారో బార్లు 35 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నా వీరికి నెలకు కేవలం రూ.5 నుంచి 7వేల జీతం దాటలేదు. మరి కొందరికి రూ. 3 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఈ జీ తంతో ఈ రోజుల్లో కుటుంబ పోషణ ఎలా చేయగలం? అంటూ దిగులు పడ్తున్నారు. బంజరు దొడ్డి నిర్వహణ, పన్నుల వసూలు, వీధి దీపాల నిర్వహణ, గ్రామీణ నీటి సరఫరా, రికార్డులు భద్రపరచడం తదితర పనులు చేస్తూ పంచాయతీలకు ఆదాయం సమకూరుస్తున్నా పనికి తగ్గ వేతనం అంద డం లేదని ఆందోళన చెందుతున్నా రు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని కారోబార్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమ సమస్యల పరిష్కారానికై ఉమ్మడి జిల్లాలోని పం చాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశా రు. వీరిలో కారోబారీ, కామాటీ, పంప్ ఆపరేటర్లు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషన్, వాచ్మెన్, బిల్ కలెక్టర్లు ఉన్నా రు. అప్పట్లో వీరితో చర్చలు జరిపిన ప్రభుత్వం న్యా యం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చుకోలే దు. దీంతో వీరంతా తమ జీవితాలు, జీతాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 35 సంవత్సరాలుగా ..రూ.7వేలు దాటని జీతం నేడు సగటు మనిషి జీవన వ్యయం రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. సాధారణ ఉపాధి కూలీ సైతం ఒక పూట పని చేసి రోజుకు రూ.200పైనే సంపాదిస్తున్నారు. కానీ పంచాయతీ కార్మికులు కనీస వేతనం అందడం లేదు. పంప్ ఆపరేటర్ల వేతనం నెలకు రూ.2500 ఇస్తుండగా, ఇక ఊరి మురికిని తమ చేతుల్లో ఎత్తి దూరంగా తీసుకెళ్లి పడేస్తున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరి వేతనం మొన్నటి వరకు రూ.2500 ఉండగా ఇటీవలే రూ. వెయ్యి పెంచి రూ.3500 ఇస్తున్నారు. ఇప్పటికే రిటైర్మెంట్ దగ్గర పడుతున్న వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఊహించుకుంటే గుండె బరువెక్కుతుంది. ఇచ్చే జీతం కూడా నెల నెలా సక్రమంగా అందక నెలల తరబడి వేతనం కోసం పడిగాపులు కాస్తున్నారు. పంచాయతీకి పట్టుకొమ్మల్లా ఉంటూ నిరంతర సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బంది కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. వీరికి కనీస వేతనాలు ఇవ్వక పోగా వచ్చే నెల జీతం భోజన సరుకులు కొనుగోలు చేయడానికే సరిపోక పోవడం దురదృష్టకరం. నూతన పంచాయతీ చట్టం ఏర్పాటు అనంతరం వీరి జీవితాల్లో ఆనందం కనిపిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నా వీరికి ఇప్పటి వరకు వీరి పట్ల ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో నిరాశే మిగిలింది. పాలకులు తమ జీవితాలను ఒక్కసారి పరిశీలించి తమకు న్యాయం చేయాలని వీరు చేతులెత్తి వేడుకుంటున్నారు. కలగానే మిగిలేలా ఉంది 1978 మార్చి 1 నుంచి పంచాయతీ కారోబార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ప్రస్తుతం రూ. వెయ్యి జీతం ఇస్తున్నారు. దీన్ని బట్టి నా గత జీతం ఎంతో అర్థమయ్యే ఉంటుంది. ఏనాటిౖMðనా ప్రభుత్వం గుర్తించకుండా పో తుందా? అనే నమ్మకంతో ఉన్నా. 41 సంవత్సరాలు కావొస్తోంది. నా కల..కల్లగానే మిగిలేలా ఉంది. న్యాయం చేయాలి. –ధనూరే మారుతిరావ్, కొల్హారీ కారోబారి జీతం తక్కువ..పని ఎక్కువ రోజంతా వాడ వాడన తిరిగి చెత్త లేకుండా చూసుకోవడం, మురుగు కాలువల్లో నిలబడి పేరుకుపోయిన మురుగు తీసేయ్యడం. పంచాయతీ అధికారులు చెప్పిన పని చేయడం ఇలా రోజంతా చాకిరీ చేస్తున్నాం. జీతం మాత్రం కిరాణ, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా సరిపోదు. కనీసం రోజుకు రూ. 500 అయినా ఇవ్వాలి. –కల్లెపెల్లి లక్ష్మీబాయి, పారిశుధ్య కార్మికురాలు -
పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి
హైదరాబాద్: గ్రామాభివృద్ధికి, గ్రామపారిశుధ్యానికి నిత్యం శ్రమించే పంచాయతీ పారిశుధ్య ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, అర్హులను గ్రామకార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని మినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శనివారం జరిగిన ఆత్మగౌరవ పోరాట సభలో ఆయన మాట్లాడారు. గ్రామాలను మల్లెపూవులాగా తీర్చిదిద్దేది పంచాయతీ కార్మికులు, ఉద్యోగులేనని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ఖజానా నుంచి పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేసే శక్తివంతులని, వారి పొట్ట కొట్టినవాడు గాలిలో కలుస్తాడన్నారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్ చేయకపోతే ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మోసం చేశారు: సున్నం రాజయ్య 2015లో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సమయంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల సమక్షంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య దుయ్యబట్టారు. కార్మికుల పక్షాన కలసి వచ్చే పార్టీలతో అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి పోరాటం చేస్తామన్నారు. నెలల తరబడి జీతాల్లేక కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నారని, తెలంగాణలో పంచాయతీ కార్మికుల ఆత్మగౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. 44 రోజులుగా పంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం వెట్టి ఉండటానికి వీల్లేదని, పంచాయతీ కార్మికులు మాత్రం వెట్టిబతుకు బతకాల్సి వస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వేతనాలు ఇచ్చుకోండని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వర్షం కురుస్తున్నా పంచాయతీ కార్మికులు లెక్కచేయకుండా సభకు హాజరై వక్తల ప్రసంగాలకు జేజేలు పలికారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సాయిబాబు, పాలడుగు భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ రమేష్, టీజీపీయూఎస్ రాష్ట్ర సలహాదారు నల్లా రాధాకృష్ణ, చిక్కుడు ప్రభాకర్, స్కైలాబ్‌బాబు, సౌదాని భూమన్నయాదవ్ పాల్గొన్నారు. -
గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన
కరీంనగర్ (సుల్తానాబాద్) : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు పంచాయతీ కార్మికులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలియజేశారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు. గాంధీ మార్గాన్ని అవలంబిస్తున్న పంచాయతీ కార్మికులకు స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా శుభవార్త అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చలు జరిపి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. -
కార్మికుల వినూత్న నిరసన
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. వేతనాల పెంపు, రెగ్యూలైజేషన్‌పై సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగిన కార్మికలు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ఖానాపూర్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
ఖానాపూర్ (ఆదిలాబాద్) : తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 32 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్ ఇంటిని కార్మికులు ముట్టడించారు. డప్పుల దరువులతో ఊరేగుతూ వచ్చిన కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. -
నేటి బంద్‌ను జయపద్రం చేయండి
ఖమ్మం మయూరిసెంటర్ : రాష్ట్రంలో గత 16 రోజులుగా పంచాయతీ కార్మికులు, 11 రోజులు గా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో 10 వామపక్ష పార్టీ నాయకులు చేస్తున్న నిరహరదీక్షను భగ్నం చేసి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ 10 వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేమూరి భాస్కర్ కోరారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భ క్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రాచలంను బంద్‌లో మినహయిస్తున్నామని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ఉంది గనుక ముస్లిం సోదరు లు బంద్‌కు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ మద్దతు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన జిల్లాబంద్‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం ఓ ప్రకటనలో తెలిపారు. నేటి బంద్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు ఖమ్మం : మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి కనీస సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కార్మికులు చేస్తున్న దీక్షను భగ్నం చేయడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. వామపక్షాల బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపె ట వెంకటేశ్వర్లు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మొదటి నుంచి పోరాటాలు చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయని నమ్మకంతో ప్రజలు గద్దెనెక్కించారని, కానీ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ ప్రస్తుత ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఏళ్ల తరబడి దుర్గంధం మధ్య జీవనం సాగిస్తున్న కార్మికుల కనీస సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదని విమర్శించారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్‌చేశారు. -
చెత్త..చెత్త..
ఖమ్మం సిటీ : జిల్లా కేంద్రం ఖమ్మంనగరంతో పాటు ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, మధిర మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారాయి. వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. చెత్తకుండీలు నిండిపోయి వీధులను ఆక్రమిస్తున్నాయి. తీవ్రమైన దుర్గంధంతో ప్రజలు వీధుల వెంట రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 1036 మంది పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. గతంలో సమ్మె జరిగినప్పుడు సత్తుపల్లిలో 70 మంది కార్మికులను విధుల్లో నుంచి తొలగించారు. రెండు నెలల తర్వాత వారిని విధుల్లోకి తీసుకున్నారు. ఆ భయంతో ఆ నగర పంచాయతీ కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నారు. సత్తుపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా కార్మికులు సమ్మెల్లో పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో... మున్సిపల్ కార్మికులు తమ 16 న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ నాలుగు రోజులుగా విధులు బహిష్కరించారు. దీని ప్రభావం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై తీవ్రంగా పడింది. కార్మికులు విధులు బహిష్కరించడంతో నగరంతోపాటు ఇతర మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. మున్సిపల్ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో పారిశుధ్యం పడకేసింది. ఖమ్మం కార్పొరేషన్లో పారిశుధ్య విభాగంలో 580 మంది కార్మికులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. 5 ట్రాక్టర్లు, మూడు డంపర్ల ద్వారా నగరంలో ప్రతి రోజు 106 టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. నాలుగు రోజులుగా కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో నగరంలోనే సుమారు 400కుపైగా టన్నుల చెత్త పేరుకుపోయింది. కార్పొరేషన్లో రెగ్యులర్ ఉద్యోగులు 70 మంది ఉన్నా వీరితో అత్యవసర పనులు మాత్రమే చేయిస్తున్నారు. ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ సిబ్బందే ఉండటంతో పారిశుధ్య విభాగం పనులు దాదాపు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో కార్పొరేషన్లో చెత్త తరలించే వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయూరుు. 25 ట్రాక్టర్లు, 3 డంపర్బీన్లు, ఆటోల్లో కేవలం ఒకటి, రెండు మాత్రమే తిరుగుతున్నాయి. పేరుకుపోతున్న చెత్త.. సమ్మె ప్రభావంతో ఖమ్మంతోపాటు కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ మధిరలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. జిల్లా మొత్తం చెత్తమయంగా మారుతోంది. కొత్తగూడెంలో సఫాయిబస్తీ, పాత కొత్తగూడెం, న్యూగొల్లగూడెం, ప్రగతినగర్, దుర్జన్బస్తీ, మేదరబస్తీల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఇల్లెందులోని స్టేషన్‌బస్తీ, నెంబర్-2 బస్తీ, జగదాంబ సెంటర్, ఇందిరానగర్, కాకతీయ నగర్, నంబర్ 14, నంబర్ 15, నంబర్ 16 ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. పాల్వంచలోని శాస్త్రీరోడ్, మార్కెట్ ఏరియా, బొల్లోరిగూడెం, చాకలిబజార్, నటరాజ్‌సెంటర్, బీసెంట్‌రోడ్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. మణుగూరులోని మెయిన్ రోడ్, శేషగిరినగర్, రాజుపేటతోపాటు పలు మురికివాడల్లో చెత్త పేరుకుపోయింది. మధిరలో రామాలయం వీధి, వర్తకసంఘం వీధి, కూరగాయల మార్కెట్‌రోడ్, బంజారకాలనీ ప్రాంతాల్లో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంది. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో చెత్త మురిగి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె.. ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె చేస్తం. ప్రభుత్వానికి ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదు. సమ్మెకు దిగినా మా సమస్యలపై స్పందించడం లేదు. తెలంగాణ ఏర్పడక ముందే 27 శాతం మధ్యంతర భృతి సాధించుకున్నం. రాష్ట్రమొస్తే మా జీతం పెరుగుతుందని ఆశపడ్డం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. జిల్లా సుగుణమ్మ, మున్సిపల్ కార్మికురాలు -
ఎక్కడి చెత్త అక్కడే..
కనిపించని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిగి : పంచాయతీ కార్మికుల సమ్మెతో పరిగి పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్తా చెదారం పేరుకుపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పరిసరాలు, రోడ్లు, మురికికాలువలు, చెత్త కుండీలు పరిశుభ్రంగా ఉంచే పంచాయితీ కార్మికులు సమ్మె బాటపట్టడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పట్టణంలో ఉన్న చెత్తకుండీలు పూర్తిగా నిండిపోయాయి. టీచ ర్స్ కాలనీకి వెళ్లే దారిలో, బస్టాండ్ ముందు, కూరగాయాలు విక్రయించే రోడ్ల పై చెత్తకుప్పలు పేరుకుపోయాయి. పరిసరాలు దుర్గంధంతో నిండిపోయాయి. కార్మికులు సమస్యను పరిష్కరించటంలో పాలకులు చిత్తశుద్ధి చూపటం లేదు. ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపించటంలేదు. గ్రామాల్లో నీళ్లు వదలడం, వీధిలై ట్లు ఆన్, ఆఫ్ చేయడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో తాత్కాలి కంగా పనులను వేరేవారికి అప్పగించిన పాపాన పోవడంలేదు. సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన కుప్పలు ఇబ్రహీంపట్నం: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ‘పట్నం’ నగర పంచాయతీలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. అంబేద్కర్ చౌ రస్తా సమీపంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతం, పెట్రోల్‌బంక్ ప్రాంతం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి సమీపంలో, పోచమ్మబస్తీ, రాయ్‌పోల్ రోడ్డులోని పాత పోలీస్‌స్టేషన్ ప్రాంతం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. తీవ్ర దుర్గంధంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య ఇలాగే ఉంటే.. అంటురోగాలు, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడకేసిన పారిశుద్ధ్యం తాండూరు: కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టడంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. నాలుగు రోజులుగా కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో తాండూరు మున్సిపాలిటీలో కాలనీలు, వార్డులు కంపుకొడుతున్నాయి. చెత్తకుప్పలు ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో భరించలేని దుర్గంధంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు, పాలక మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించకపోవడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమల బాధ తీవ్రమైంది. ఇక కాలనీలు, వార్డుల్లో వ్యర్థపదార్థాలు, చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ స్తంభించింది. నాలుగు రోజులుగా సుమారు 160 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లతో అధికారులు, పాలకమండలి చెత్తను ఎందుకు తొలగించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రోజులు ఈ ‘కంపు’ భరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. -
అయినా సరే... టెండర్లకే మొగ్గు
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉద్యోగ భద్రత కోసం పక్షం రోజులుగా దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికుల కడుపు కొట్టడానికి రంగం సిద్ధమైం ది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లో పారిశుధ్య పనులు చేస్తున్న వారిని ఇంటికి సాగనంపనుంది. సోమవారం చిత్తూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నూతన కార్మికుల కోసం టెండర్లను దాఖలు చేయనుండడమే తరువాయి. జిల్లాలోని 42 మండలాల్లో 1192 మంది కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య పనులు చేస్తున్నా రు. ఇప్పటి వరకు వీళ్లంతా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పనులను రెన్యూవల్ చేసుకుని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు. అయితే కలెక్టర్ సిద్దార్థజైన్ కల్పించుకుంటూ ఈ పద్ధతి సరికాదని, కార్మికులంతా కాంట్రాక్టర్ కింద పనిచేయాలని కొత్తగా టెండర్లు పిలవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలకు వెళ్లకుండా సమ్మె బాట పట్టారు. అయితే ఇంతలోపు అధికారులు కొత్త టెండర్ల కోసం ఏర్పాట్లు చకచకా చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు వేయడానికి చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతుండటంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుండటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ చేతికి తమను అప్పగిస్తే అతనికి నచ్చకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తాడని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్లను సైతం తొలగించడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకే టెండర్ల ప్రక్రియను నిరసిస్తూ కార్మిక సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చేయడంతో టెండర్ల ప్రక్రియ జరిగినా తుదిగా తమ అనుమతి లేనిదే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదని న్యాయస్థానం షరతు పెట్టింది. సంక్రాతి సెలవుల తరువాత న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు టెండర్లను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతాం. -ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి -
మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు పంచాయతీ వర్కర్ల వినతి సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీలలో ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని వైఎస్సార్సీపీ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఈ సంఘం ఖమ్మం జిల్లా ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే తాటికి హైదరాబాద్‌లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సేవలలో గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ అధినాయకత్వం పేర్కొన్నందున ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించాలని కోరారు. తమ వినతిని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. -
మంత్రి హామీ ఏమైంది...?
నెల్లిమర్ల, న్యూస్‌లైన్:‘‘మీకు చెల్లించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లిస్తాం.. మున్సిపల్ డెరైక్టర్‌తో మాట్లాడి, అభివృద్ధి పనులు చేపట్టేందు కు మంజూరైన నిధుల నుంచి వేతనాలు అందేలా చూస్తాం.. వెంటనే మీరు సమ్మె విరమించి విధుల్లో చేరండి.. రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగేందుకు మాకు సహకరించండి.. ఇవీ.. గత ఏడాది నవంబరులో సమ్మెబాట పట్టిన నెల్లిమర్ల నగర పంచాయతీ కార్మికులకు పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన హామీ. ఇదే విషయాన్ని నగర పంచాయతీ ప్రత్యేకాధికారి గోవిందస్వామి, కమీషనర్ అచ్చింనాయుడు, స్థానిక అధికార పార్టీ నేతలు కూడా స్వయంగా విలేకరుల సమక్షంలో కార్మికులకు వెల్లడించారు. దీంతో అప్పటికే సుమారు 15 రోజుల పాటు సమ్మెలో ఉన్న కార్మి కులు విధుల్లో చేరి...రచ్చబండ సభలు సజావుగా సాగేందుకు సహకరించారు. అయితే మంత్రి హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. సమ్మె విరమి ంచి నాలుగు నెలలైనా ఇప్పటివరకు కేవలం ఐదు నెలల వేతనాలు మాత్రమే చెల్లించారు. ఇంకా ఎనిమిది నెలల బకాయిలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, నీటి సరఫరా తదితర విభాగాల్లో మొత్తం 35 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులున్నారు. నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలుగా ఉన్నప్పటి నుంచి వారు ఇక్కడ పనిచేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పుడు అధికారులు వీరికి సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. అయితే గత ఏడాది మార్చిలో నెల్లిమర్ల, జరజాపు పేట మేజరు పంచాయతీలను ప్రభుత్వం నగర పంచాయతీగా మార్పు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కష్టాలు తీరుతాయని, తమకు ప్రతి నెలా జీతాలు సక్రమంగా చెల్లిస్తారని కార్మికులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. నగర పంచాయతీగా మార్పు చేసినా పరిస్థితి లో మార్పురాలేదు. దీంతో గత ఏడాది కాలంగా వీరికి జీతాలు అందలేదు. ప్రతి నెలా రెండున్నర లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షలు వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి మున్సిపాలిటీగా మార్పు చేసిన తరువాత ఇక్కడి రెగ్యులర్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిం చాలి. కానీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో రెగ్యులర్ కార్మికులకు సైతం సక్రమంగా జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబరులో తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరుతూ కార్మికులంతా సమ్మెబాట పట్టారు. సుమారు 15 రోజుల సమ్మె అ నంతరం రచ్చబండ కార్యక్రమం రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు అప్పటికే అభివృద్ధి పనుల కోసం విడుదలైన రెండు కోట్ల రూపాయల నుంచి వారికి జీతాలు చెల్లించాలని ఆదేశా లు జారీ చేశారు. దీంతో కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరారు. అయితే అనంతరం వారికి ఐదు నెలల బకాయి మాత్రమే అధికారులు చెల్లించారు. మేజరు పంచాయతీగా ఉన్నప్పటి ఎనిమిది నెలల బకాయిలు చెల్లించేందుకు వెనుకంజవేస్తున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. నగర పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మళ్లీ సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వయానా మంత్రి ఇచ్చిన హామీ నే నెరవేర్చకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఎనిమిది నెలల బకాయిలు చెల్లించకపోతే సమ్మెబాట పట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.