మంత్రి హామీ ఏమైంది...?
Published Tue, Feb 11 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
నెల్లిమర్ల, న్యూస్‌లైన్:‘‘మీకు చెల్లించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లిస్తాం.. మున్సిపల్ డెరైక్టర్‌తో మాట్లాడి, అభివృద్ధి పనులు చేపట్టేందు కు మంజూరైన నిధుల నుంచి వేతనాలు అందేలా చూస్తాం.. వెంటనే మీరు సమ్మె విరమించి విధుల్లో చేరండి.. రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగేందుకు మాకు సహకరించండి.. ఇవీ.. గత ఏడాది నవంబరులో సమ్మెబాట పట్టిన నెల్లిమర్ల నగర పంచాయతీ కార్మికులకు పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన హామీ. ఇదే విషయాన్ని నగర పంచాయతీ ప్రత్యేకాధికారి గోవిందస్వామి, కమీషనర్ అచ్చింనాయుడు, స్థానిక అధికార పార్టీ నేతలు కూడా స్వయంగా విలేకరుల సమక్షంలో కార్మికులకు వెల్లడించారు. దీంతో అప్పటికే సుమారు 15 రోజుల పాటు సమ్మెలో ఉన్న కార్మి కులు విధుల్లో చేరి...రచ్చబండ సభలు సజావుగా సాగేందుకు సహకరించారు.
అయితే మంత్రి హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. సమ్మె విరమి ంచి నాలుగు నెలలైనా ఇప్పటివరకు కేవలం ఐదు నెలల వేతనాలు మాత్రమే చెల్లించారు. ఇంకా ఎనిమిది నెలల బకాయిలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, నీటి సరఫరా తదితర విభాగాల్లో మొత్తం 35 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులున్నారు. నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలుగా ఉన్నప్పటి నుంచి వారు ఇక్కడ పనిచేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పుడు అధికారులు వీరికి సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. అయితే గత ఏడాది మార్చిలో నెల్లిమర్ల, జరజాపు పేట మేజరు పంచాయతీలను ప్రభుత్వం నగర పంచాయతీగా మార్పు చేసిన విషయం తెలిసిందే.
దీంతో తమ కష్టాలు తీరుతాయని, తమకు ప్రతి నెలా జీతాలు సక్రమంగా చెల్లిస్తారని కార్మికులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. నగర పంచాయతీగా మార్పు చేసినా పరిస్థితి లో మార్పురాలేదు. దీంతో గత ఏడాది కాలంగా వీరికి జీతాలు అందలేదు. ప్రతి నెలా రెండున్నర లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షలు వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి మున్సిపాలిటీగా మార్పు చేసిన తరువాత ఇక్కడి రెగ్యులర్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిం చాలి. కానీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో రెగ్యులర్ కార్మికులకు సైతం సక్రమంగా జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబరులో తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరుతూ కార్మికులంతా సమ్మెబాట పట్టారు.
సుమారు 15 రోజుల సమ్మె అ నంతరం రచ్చబండ కార్యక్రమం రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు అప్పటికే అభివృద్ధి పనుల కోసం విడుదలైన రెండు కోట్ల రూపాయల నుంచి వారికి జీతాలు చెల్లించాలని ఆదేశా లు జారీ చేశారు. దీంతో కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరారు. అయితే అనంతరం వారికి ఐదు నెలల బకాయి మాత్రమే అధికారులు చెల్లించారు. మేజరు పంచాయతీగా ఉన్నప్పటి ఎనిమిది నెలల బకాయిలు చెల్లించేందుకు వెనుకంజవేస్తున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. నగర పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మళ్లీ సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వయానా మంత్రి ఇచ్చిన హామీ నే నెరవేర్చకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఎనిమిది నెలల బకాయిలు చెల్లించకపోతే సమ్మెబాట పట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Advertisement