అయినా సరే... టెండర్లకే మొగ్గు
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉద్యోగ భద్రత కోసం పక్షం రోజులుగా దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికుల కడుపు కొట్టడానికి రంగం సిద్ధమైం ది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లో పారిశుధ్య పనులు చేస్తున్న వారిని ఇంటికి సాగనంపనుంది. సోమవారం చిత్తూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నూతన కార్మికుల కోసం టెండర్లను దాఖలు చేయనుండడమే తరువాయి.
జిల్లాలోని 42 మండలాల్లో 1192 మంది కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య పనులు చేస్తున్నా రు. ఇప్పటి వరకు వీళ్లంతా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పనులను రెన్యూవల్ చేసుకుని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు. అయితే కలెక్టర్ సిద్దార్థజైన్ కల్పించుకుంటూ ఈ పద్ధతి సరికాదని, కార్మికులంతా కాంట్రాక్టర్ కింద పనిచేయాలని కొత్తగా టెండర్లు పిలవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలకు వెళ్లకుండా సమ్మె బాట పట్టారు. అయితే ఇంతలోపు అధికారులు కొత్త టెండర్ల కోసం ఏర్పాట్లు చకచకా చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు వేయడానికి చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తవుతుండటంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుండటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ చేతికి తమను అప్పగిస్తే అతనికి నచ్చకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తాడని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్లను సైతం తొలగించడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కోర్టు ఆదేశాల మేరకే
టెండర్ల ప్రక్రియను నిరసిస్తూ కార్మిక సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చేయడంతో టెండర్ల ప్రక్రియ జరిగినా తుదిగా తమ అనుమతి లేనిదే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదని న్యాయస్థానం షరతు పెట్టింది. సంక్రాతి సెలవుల తరువాత న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు టెండర్లను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతాం.
-ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి