పట్టణం.. కావాలి ఆదర్శం | Harish Rao Speech In Siddipet Over Pattana Pragathi | Sakshi
Sakshi News home page

పట్టణం.. కావాలి ఆదర్శం

Published Sun, Feb 23 2020 9:58 AM | Last Updated on Sun, Feb 23 2020 9:58 AM

Harish Rao Speech In Siddipet Over Pattana Pragathi - Sakshi

సాక్షి, సంగారెడ్డి: మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల కొరతలేదని, ప్రతి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆర్థిక శాక మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహించనున్న దృష్ట్యా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో శనివారం ‘పట్టణ ప్రగతి సమ్మేళనం’ సన్నాహక సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన  మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం మున్సిపాలిటీలకు ప్రతినెలా ఒకటో తేదీన నిధులు జమ చేస్తామన్నారు.

సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి రూ.6.44 కోట్లు వస్తాయని వివరించారు.మున్సిపాలిటీలకు పన్నుల రూపంలో వచ్చే నిధులు కాకుండా ఇవి అదనమని తెలిపారు. ప్రతి వార్డులో నాలుగు కమిటీలు వేయాలని, ప్రతి కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలన్నారు. మున్సిపాలిటీల వారీగా చేయాల్సిన పనులు, బడ్జెట్‌ ప్లానింగ్‌ను, ప్రత్యేక కార్యాచరణను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆయన సూచించారు.

మున్సిపాలిటీలకు విడుదల చేసే నిధుల్లో 10 శాతం పచ్చదనం పెంపుకు ఖర్చు చేయాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్లు, కౌన్సిలర్లు బాగా పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని, లేనిచో అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చర్యలు తప్పవని, పదవులు కూడా ఊడతాయనే విషయాన్ని గ్రహించాలన్నారు. చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం కలెక్టర్లకే ఉంటుందని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకు పనిజరగాలన్నారు. 

కఠినంగా నూతన మున్సిపల్‌ చట్టం
మున్సిపాలిటీలు, పట్టణాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపల్‌ చట్టం చాలా కఠినంగా రూపొందించబడినదని చెప్పారు. అక్రమ కట్టడాలను కూలి్చవేసే, స్వా«దీనం చేసుకునే, సీజ్‌చేసే, జరిమానా విధించే అధికారాన్ని మున్సిపల్‌ చట్టం కట్టబెట్టిందని వివరించారు. మూడు సంవత్సరాల జైలుశిక్ష కూడా ఉంటుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించారు. ఏ మున్సిపాలిటీలోనూ చెత్త ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ.పాటిల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కలెక్టర్లు ఎం.హనుమంతరావు, ధర్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  – సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement