సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్‌ఎస్ జెండా, గద్దె కూలగొట్టినట్లు, టీఆర్‌ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద దుబ్బాకకు ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారని తెలిపారు. దుబ్బాక ప్రజలు ఈ విషయాలన్నీ గమనించాలని విజ్ఞప్తి చేశారు. రూ.3కోట్ల నిధులు స్వాహా అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలిపారు. చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే'
దుబ్బాకలో టౌన్‌హాల్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. రహదారుల టెండర్ ఫైనల్ కాకముందే డబ్బులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు. బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఇదే విధంగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో చపాతీ మేకర్ గుర్తు ఉన్న అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో అదే విధమైన గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని, హుజూర్‌నగర్‌లో బీజేపీకి జరిగిన పరాభవమే దుబ్బాకలో జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులకు నిజమైన చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, రాజ్యాంగ బద్దంగా, హక్కుగా రావాల్సిన పన్ను బకాయిలను రప్పించాలన్నారు. అంతే తప్ప అబద్ధపు, అసత్యపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. దుబ్బాక ప్రజలను ముమ్మాటికీ మీ మాటను నమ్మరని, బీజేపీకి హుజూర్‌నగర్, నిజామాబాద్‌లో ఎదురైన ఫలితమే దుబ్బాకలో పునరావృతం కానుందని హరీశ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment