
మూడూళ్ల కళ్లు..!
అవయవ దానానికి ముందుకు వచ్చే వారు కొద్దిమందే ఉంటారు. అయితే ఇక్కడ ఏకంగా మూడు ఊళ్ల ప్రజలు నేత్రదానానికి కదలివచ్చారు!
నేత్రదానం
కొలను దివాకర్‌రెడ్డి, చేవె ళ్ల
కొసిక శ్రీనివాస్, మొయినాబాద్
అవయవ దానానికి ముందుకు వచ్చే వారు కొద్దిమందే ఉంటారు. అయితే ఇక్కడ ఏకంగా మూడు ఊళ్ల ప్రజలు నేత్రదానానికి కదలివచ్చారు! ఇందుకు మొదట వేదికైంది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లి, చిలుకూరు గ్రామాల ప్రజలు సైతం నేత్రదానానికి అంగీకారపత్రాలను అందజేశారు.
అంత్యక్రియల్లో వచ్చిన ఆలోచన
దేవుని ఎర్రవల్లి జనాభా సుమారుగా 2300 ఉంటుంది. 190 వరకు ఇళ్లు ఉంటాయి. 2010 ఆగస్టులో చాకలి ఎల్లయ్య అనే వ్యక్తి చనిపోయాడు. అదే గ్రామంలో పుట్టుకతోనే అంధుడైన కావలి చంద్రయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఎల్లయ్య చనిపోయిన రోజున అంత్యక్రియల సమయంలో గ్రామస్తులతో పాటు చంద్రయ్య కూడా ఉన్నాడు. చనిపోయిన వారి కళ్లను దానం చేస్తే చంద్రయ్య లాంటి ఎంతోమంది చూపులేనివారికి ఉపయోగ పడతాయి కదా అని వచ్చిన ఒక ఆలోచనే ఊరుమ్మడి నేత్రదానానికి శ్రీకారం చుట్టింది. గ్రామస్తులంతా కూడబలుక్కుని నేత్రదానానికి ముందుకొచ్చారు. దాంతో అప్పటి సర్పంచ్, ప్రస్తుత రాష్ట్ర పంచాయతీరాజ్ అభియాన్ కన్వీనర్ చింపుల సత్యనారాయణరెడ్డి నేత్రదానానికి కావాల్సిన విధి విధానాలను తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిని సందర్శించి తాము నేత్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. నేత్ర దాన పత్రాలను తీసుకున్నారు. అలా 2010 ఆగస్టు 25న సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో వేయిమందికి పైగా దేవుని ఎర్రవల్లి గ్రామస్తులు ఒకేరోజు నేత్రదాన పత్రాలను అందజేశారు. అనంతరం గ్రామ జనాభాలోని 90 శాతం మంది నేత్రదాన పత్రాలను సమర్పించారు.
మరణం తర్వాత
నేత్ర దాన పత్రాలను సమర్పించిన అనంతరం, ఆ తర్వాతి కాలంలో మరణించిన పాతికమంది నేత్రాలను సరోజినీదేవి కంటి ఆసుపత్రివారు వచ్చి సేకరించారు. అలా నేత్రదాన పత్రాలను ఇవ్వడమే కాకుండా మరణం తరువాత కళ్లను దానం చేయడంలోనూ దేవుని ఎర్రవల్లి ప్రజలు ఆదర్శంగా నిలిచారు.
అదే బాటలో రెడ్డిపల్లి, చిలుకూరు
దేవుని ఎర్రవల్లి గ్రామం ఇచ్చిన స్ఫూర్తితో 2011లో మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన రెడ్డిపల్లి గ్రామ యువకులు నేత్రదానానికి శ్రీకారం చుట్టారు. ఆ ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద జయంతి, యువజన దినోత్సవం సందర్భంగా నేత్రదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి మాధవ నేత్రనిధి(ఐ బ్యాంక్)కి అందజేశారు. అదే బాటలో చిలుకూరు యువకులు సైతం అడుగులు వేశారు.
తాము మాత్రమే కాకుండా గ్రామస్తులందరినీ భాగస్వాములను చేసేందుకు ఇంటింటికీ వెళ్లి, శిబిరాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. ఈ ఏడాది జనవరి 26న నేత్రదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని సుమారు రెండు వేల మంది అంగీకార పత్రాలపై సంతకాలు చేసి మాధవ నేత్ర నిధి (ఐ బ్యాంక్) కి అందజేశారు.
ప్రతి ఒక్కరిలో సేవాతత్వం ఉండాలి
ప్రతి మనిషిలో మానవత్వం, సేవాగుణం ఉండాలి. ఆ ఆలోచనతోనే నేత్రదాన కార్యక్రమానికి నడుం బిగించాం. మనం మరణించిన తరువాత కళ్లు మట్టిలోనే కలిసిపోతాయి. వాటిని దానం చేయడం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని చెప్పాము. అలా గ్రామంలో మొత్తం 204 మంది నేత్రదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
- మోర శ్రీనివాస్, రెడ్డిపల్లి
ఇప్పటికి.. రెండువేల మంది
దేవుని ఎర్రవల్లి గ్రామస్తులు నేత్రదానం చేసిన విషయాన్ని పత్రికల్లో చదివాను. మా చిలుకూరులో కూడా అలా చేస్తే మంచిదని భావించాను. దీనిపై మా కుటుంబ సభ్యులందరితోపాటు మా ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించి నేత్రదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేయించాను. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 2 వేల మంది నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. - జొన్నాడ విజయ, చిలుకూరు