సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల, రామాపురం, నేతాజీనగర్, నర్సయ్యగూడెం, రామగిరి గ్రామాలతో కొత్తగా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏర్పాటైంది.. ఇకపై ఆ గ్రామాలను వార్డులుగా పరిగణిస్తారు.. 14,826 మంది జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో 3,076 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.. మున్సిపాలిటీలో భాగమైనందున ఈ గ్రామాల్లో ఉపాధి పథకం నిలిచిపోనుంది.. 3,076 మందికి ‘ఉపాధి’దూరం కానుంది!
..ఇలా ఒక్క నేరేడుచర్లలోనే కాదు. కొత్తగా ఏర్పడిన 71 మున్సిపాలిటీల్లో భాగంగా ఉన్న 384 గ్రామాల పరిస్థితి కూడా ఇంతే! మున్సిపాలిటీలుగా మారిన గ్రామాల్లో ఆగస్టు 2 నుంచి ఉపాధి హామీ పథకం కింద కొత్త పనుల ప్రతిపాదనలు, మంజూరు ఆగిపోయాయి. దీంతో ఆ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. 173 గ్రామాలను కలిపి ప్రభుత్వం 71 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న 41 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరో 136 గ్రామాలను కలిపింది. ఇలా మొత్తంగా 384 గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక్కో మున్సిపాలిటీలో 3 వేల నుంచి 4 వేల మంది చొప్పున ఉపాధి హామీ కూలీలున్నారు. ఈ లెక్కన 2.50 లక్షల మందికి జీవనోపాధి సమస్యగా మారింది. కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన దాదాపు అన్ని ఆవాసాలు పట్టణ లక్షణాలు లేనివే ఉన్నాయి. ఈ గ్రామాల్లోని ఎక్కువ మందికి వ్యవసాయం, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకమే దిక్కు. ఇప్పుడు ఆ పథకం వర్తించకపోవడంతో వీరందరికీ జీవనోపాధి దూరం కానుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని వేసవిలో పనుల కోసం తిప్పలు తప్పేలా లేవు.
రాష్ట్రంలో 1.11 కోట్ల మంది కూలీలు
రాష్ట్రంలో 50,82,970 కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయి. 1.11 కోట్ల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.11,075 కోట్లను వెచ్చించింది. కూలీలకు వేతనంగా రూ.6,812 కోట్లను చెల్లించింది. కూలీలకు చెల్లించే గరిష్ట వేతనాన్ని ప్రతి ఏటా పెంచుతారు. ప్రస్తుతం ఇది రూ.205 ఉంది. అయితే చేసిన పని ఆధారంగా వేతన చెల్లింపులు ఉంటాయి. తెలంగాణలో దినసరి సగటు వేతనం రూ.140 చొçప్పున అందుతోంది.
మంజూరైన పనుల వరకే..
గ్రామాల్లో ఉపాధి పథకం కింద వివిధ రకాల పనులు చేస్తున్నారు. పడావు భూముల అభివృద్ధి, నీటి వనరుల నిర్మాణం, వ్యవసాయ భూములకు రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమగ్ర అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలల్లో వంటగదులు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, మండల సమైక్య కార్యాలయాలు, గొర్రెలు/మేకలు/పశువుల షెడ్లు, శ్మశాన వాటికలు, కూరగాయల సాగుకు అవసరమైన పందిరి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే చేసేవి కావడంతో అక్కడి వారికి ఉపాధి దొరుకుతోంది. మున్సిపాలిటీలుగా మారిన/విలీనమైన గ్రామాల్లో ఈ పనులకు కొత్తగా మంజూరు ఉండదు. ఇప్పటికే మంజూరైన పనులు పూర్తి కాగానే పథకం పూర్తిగా నిలిచిపోనుంది.
పట్టణాల్లోనూ ‘ఉపాధి’ఉండాలి
గ్రామాల్లో మాదిరే పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం ఉండాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. వాస్తవానికి జనాభాలో సగం మంది వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి పొందే ప్రాంతాలను మాత్రమే మున్సిపాలిటీలుగా మార్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదు. దీంతో పట్టణ ప్రాంతాల్లోనూ ‘ఉపాధి హామీ పథకం అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఎలాంటి ఆదేశాలూ రాలేదు
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు ఆగుతాయన్న అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఆదేశాలు వచ్చేంతవరకూ గతంలో పనులు ఎలాగో జరిగియో అలానే ఉంటాయి. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను, అదే మండలంలో ఇతర గ్రామాల్లో ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చాయి.
-ఎస్.కిరణ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ, సూర్యాపేట
ఇప్పుడే పనులు నిలిపేయం
మున్సిపాలిటిలో విలీనం అయిన గ్రామాల్లో ఇప్పుడే పనులు నిలిపి వేయము. ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో మంజూరైన పనులు పూర్తయ్యే వరకు కూలీలకు పనులు కల్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు గుర్తించిన పనులు పూర్తి కావాలంటే కనీసం 3–6 నెలలు పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు కల్పించడం జరుగుతుంది.
- అర్సనపల్లి వెంకటేశ్వర్‌రావు, డీఆర్డీఓ, కరీంనగర్
మా బతుకులు రోడ్డున పడతాయి
మాకు ఎలాంటి భూమి లేదు. ఉపాధి హామీ పథకం పనులే జీవనాధారం. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేశారు. మా ఊరు నర్సయ్యగూడెంను మున్సిపాలిటీలో కలిపారు. ఇలా కలిపితే ఉపాధి పని ఉండదంటున్నారు. అలా చేస్తే మా బతుకులు రోడ్డున పడతాయి.
- కూరపాటి వెంకటమ్మ, నర్సయ్యగూడెం, ఉపాధి కూలీ, నేరేడుచర్ల, సూర్యాపేట
Comments
Please login to add a commentAdd a comment