మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 71 పురపాలిక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. 173 గ్రామ పంచాయతీలు/ఆవాస ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ఈ 71 చిన్న పట్టణ ప్రాంతాలు ఏర్పాటవుతున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామాలు/గ్రామాల్లోని భాగాలను విలీనం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా సవరణలు చేపడుతున్నారు.
144కు పెరగనున్న పురపాలికలు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగియనుండడంతో ఆలోపే పురపాలక చట్టాల సవరణలు పూర్తిచేసి.. కొత్త పురపాలికల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఆగమేఘాల మీద కసరత్తు పూర్తి చేసి.. తాజాగా శాసనసభలో సవరణ బిల్లులు ప్రవేశపెట్టింది. కొత్తగా ఏర్పాటుచేసే 71 మున్సిపాలిటీలు, న్యాయ వివాదాల్లో ఉన్న మరో ఏడు మున్సిపాలిటీలు, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసే 136 గ్రామ పంచాయతీల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చనుంది.
ఈ బిల్లులకు గురువారం రాష్ట్ర శాసనసభ ఆమోదం లభించే అవకాశముంది. కొత్త పురపాలికలుగా ఏర్పాటవుతున్న, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనమవుతున్న గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే... వాటికి మున్సిపాలిటీ హోదా అమల్లోకి రానుంది. ఇక జీహెచ్‌ఎంసీలో కొత్తగా బండ్లగూడ గ్రామ పంచాయతీ విలీనం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీతో సహా 73 పురపాలికలు ఉండగా... కొత్త పురపాలికల ఏర్పాటుతో వాటి సంఖ్య 144కి పెరగనుంది.
న్యాయ సమస్యలు లేకుండా..
ఇప్పటికే ఏర్పాటును ప్రకటించిన ఏడు పురపాలికలకు సంబంధించి స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్లుగా అది అమల్లోకి రాలేదు. ఈ న్యాయ వివాదాన్ని అధిగమించేందుకు ఆ ఏడు మున్సిపాలిటీలైన నకిరేకల్, జిల్లెలగూడ, మీర్‌పేట్, బొడుప్పల్, పీర్జాదిగూడ, దుబ్బాక, మేడ్చల్‌లను.. తాజాగా సవరణ బిల్లులలో చేర్చినట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బిల్లులో రాతపూర్వకంగా తెలిపారు. పట్టణ లక్షణాలు, పట్టణ పరిసరా ల్లో ఉన్న గ్రామాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గుర్తించి.. పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు
ప్రస్తుత చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడానికిగాని, ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికిగానీ పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం బహిరంగ ప్రకటన జారీచేసి.. నిర్ణీత గడువులోగా స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి రాత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. చివరిగా గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇకపై పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియేదీ అవసరం లేకుండానే.. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు మున్సిపల్ హోదా/మున్సిపాలిటీలో విలీనం వంటివి చేపట్టేలా చట్టాలకు సవరణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment