
కంపు..కంపు..
♦ ఆరో రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె
♦ వీధుల్లో పేరుకుపోతున్న చెత్త
♦ రోగాలబారిన పడుతున్న ప్రజలు
నెల్లూరు, సిటీ : పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె కారణంగా నగరం, పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఏ వీధిలో చూసినా చెత్తే కనిపిస్తోంది. పారిశుధ్యం లోపించడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఆరు రోజులుగా కార్మికులు ఉధృతంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. వారి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయడంలేదు. కార్మికులూ వెనక్కు తగ్గడం లేదు.
ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మె విరమించేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఇదే విధంగా సమ్మె కొనసాగితే కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిల్లో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే రహదారుల్లోని ముఖ్య కూడళ్లలో, వీధుల్లో చెత్తనిల్వలు పెరిగిపోయాయి. కొంతమంది ప్రజలు చెత్తను సంచుల్లో వేసుకొని ఇళ్లలో ఉంచుకోగా, మరికొంతమంది రోడ్లుపై వేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు రెగ్యులర్ కార్మికుల చేత అరాకొరా పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. అయినా పూర్తిస్థాయిలో చెత్తను తొలగించలేకపోతున్నారు.
రోగాలు బారిన ప్రజలు...
రోడ్లపై చెత్త పేరుకుపోతుండటంతో ప్రజలు రోగాల బారినపడే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే నగర కార్పొరేషన్ పరిధిలో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈక్రమంలో చెత్తాచెదారాలు వీధుల్లో, రోడ్లపై పేరుకుపోవడంతో దోమలు వ్యాపించి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో రోడ్లు చిత్తడిగా మారాయి. ఒక వైపు చెత్తపేరుకుపోగా, మరోవైపు వర్షాలు పడి దుర్వాసన వెదజల్లుతుంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడతో మురికి నీరు రోడ్లు పైకి చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రజలు నడిచేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొంత మంది ప్రజలు రోగాల బారినపడి ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల చేత సమ్మె విరమింపజేయకపోతే ప్రజలు అనేక ఇ్బందులు పడాల్సి వస్తుంది.