సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టౌన్ల ఏర్పాటు, వాటి అభివృద్ధికి పురపాలక శాఖ కార్యాచరణకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, నగర పంచాయతీలలో భూములను సేకరించి లే–అవుట్లు వేయడం.. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరకు సామాన్యులకు ప్లాట్లను అందించేందుకు ఉద్దేశించిన ‘స్మార్ట్ టౌన్’ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్‌ను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 125 పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీలను జనాభా ప్రాతిపదికన ఐదు కేటగిరీలుగా విభజించి స్మార్ట్ టౌన్‌లను తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. మొదటి దశలో 12 పట్టణాల్లో 18 లే–అవుట్లను అభివృద్ధి చేస్తారు. అనంతరం అన్నిచోట్లా స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులను చేపడతారు.
ప్రత్యేక సెల్స్ ఏర్పాటు
మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే స్మార్ట్ టౌన్ ప్రాజెక్టులను విజయవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలోనూ, పురపాలక సంఘాల స్థాయిలోనూ ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా భూ రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేకంగా రెవెన్యూ, న్యాయ అధికారులతో లీగల్ సెల్స్‌ను నెలకొల్పుతారు. ఇప్పటికే వివిధ టిడ్కో, గృహ నిర్మాణ శాఖ తదితర విభాగాల వద్ద అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తారు. ఇంకా అవసరమైన భూముల కోసం భూ యజమానులు, క్రెడాయ్ వంటి సంస్థలు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. భూ సేకరణ ప్రక్రియ నుంచి పూర్తిస్థాయిలో లే–అవుట్ల అభివృద్ధి, భూ యజమానులకు ప్లాట్ల పంపిణీ, లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ప్లాట్ల విక్రయం వరకూ అన్ని అంశాలను ఈ సెల్స్ పర్యవేక్షిస్తాయి. నిర్ణీత కాలవ్యవధిలో స్మార్ట్ టౌన్ల ప్రాజెక్టులను పూర్తి చేసి నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పురపాలక శాఖ చర్యలు వేగవంతం చేసింది.
ప్రాజెక్టుల స్వరూపం ఇలా..
ఒక్కో స్మార్ట్ టౌన్ ప్రాజెక్ట్ లే–అవుట్ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న విశాఖ, విజయవాడ నగర పాలక సంస్థల పరిధిలో 200 ఎకరాల చొప్పున ప్రాజెక్టులు చేపడతారు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న 14 నగరపాలక సంస్థల్లో 100 ఎకరాల చొప్పున సేకరించి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. 6 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 7 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలలో 75 ఎకరాల చొప్పున సేకరించి లే–అవుట్లు వేస్తారు. 17 గ్రేడ్–1 మున్సిపాలిటీలు, 30 గ్రేడ్–2 మున్సిపాలిటీలు, 18 గ్రేడ్–3 మున్సిపాలిటీలలో 50 ఎకరాల చొప్పున భూములు సేకరించి లే–అవుట్లు వేస్తారు. అదేవిధంగా 31 నగర పంచాయతీలలో 25 ఎకరాల చొప్పున సేకరించి లే–అవుట్లు అభివృద్ధి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment