
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని 3,456 మున్సిపల్ వార్డుల్లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. పలుచోట్ల మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం–పరిశుభ్రత విజయవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు నిర్వహించాలని సూచించారు. హరితహారం, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఈ పదవి మీరు పెట్టిన భిక్ష: ఈటల
‘‘నాకు మంత్రి పదవి మా అమ్మ ఇవ్వలే. హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష. నా కారులో మీరు పెట్రో లు పోస్తే నేను తిరుగుతున్నాను అని ప్రతిక్షణం గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాను’’అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నడిచే ఎద్దును పొడుస్తారని, పనిచేసేవాడి దగ్గరికే ప్రజలు వస్తారని.. ఈ నేపథ్యంలో ప్రతి కౌన్సిలర్ రోజూ ఉదయం వార్డుల్లో తిరగాలని సూచించారు.
పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మనదని వ్యాఖ్యానించారు. గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్ల కింద ఉన్నవారికి ముందుగా 500 డబుల్ బెడ్‌రూం ఇళ్లు రెడీ అవుతున్నాయని చెప్పారు. అలాగే సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ప్రజలు కూడా తమ బాధ్యత మరవకుండా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ అధికారులు చెత్తా చెదారం లేని, మురికినీరు లేని, పచ్చని చెట్లతో ఉన్న పట్టణం తయారు చేయాలని సూచించారు.
సైకిల్‌పై తిరిగిన పువ్వాడ...
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ మాణిక్యనగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. మురికి కాలువలో పూడిక తొలగించి, మొక్కలు నాటారు. అనంతరం సైకిల్‌పై పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు.
పచ్చదనం పెంపునకు నిధులు: సీఎస్
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు మున్సిపల్ బడ్జెట్లలో పదిశాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌గా కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి మున్సిపల్ వార్డులో ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులతో మొత్తం నాలుగు కమిటీలు నియమించినట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్‌నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment