ఇప్పుడే ఇలా.. మేలో ఎలా?
♦ ఎండాకాలం ఆరంభంలోనే తడారిపోతున్న బోర్లు
♦ పలు మున్సిపాలిటీలు, గ్రామాలను తాకిన సెగ
♦ ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మేలో మరింత జఠిలం
♦ ముందు జాగ్రత్తపై పెద్దగా దృష్టి సారించని ప్రభుత్వం
ఒక పూట తిండిలేకపోయినా ఉండొచ్చు కానీ తాగు నీరు లేకుండా ఉండలేం. ఇంట్లో నీరు లేనిదే ఏ పనీ ముందుకు సాగదనడం అతిశయోక్తి కాదు. డిసెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా, ఆ నీటిని ఒడిసి పట్టుకుని నిల్వ చేయడంలో పాలకులు పెద్దగా శ్రద్ధ చూపని కారణంగా వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి కలవరపెడుతోంది.
సాక్షి, కడప : గత ఏడాది చివర్లో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో కుంటలు, చెరువులు నిండి కళకళలాడాయి. సూర్య భగవానుడి దెబ్బకు ఫిబ్రవరి ఆఖరుకే ఆ నీరంతా ఆవిరైపోయింది. మార్చి మొదటి వారంలోనే చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి మొదలైంది. కడప నగరంతోపాటు పలు మున్సిపాలిటీల్లో సమస్య తీవ్రతరమవుతోంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది. పలుచోట్ల ప్రజలు చెలిమలకుపరుగులు పెడుతుండగా.. మరికొన్ని ఊళ్లలో పంట పొలాల్లోని బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కడప నగరం, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు పట్టణాల్లో సమస్య మొదలైంది. దీంతో ఆయా పట్టణాల్లోని పలు వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు ఒక మారి తాగు నీరు వదులుతున్నారు. ఇసుక రీచ్‌ల దెబ్బకు పలు చోట్ల బోర్లలో నీరు అడుగంటింది. కడప నగరంలోని మృత్యుంజయ కుంట, రవీంద్రనగర్‌తోపాటు పలు కాలనీల్లో సమస్య ప్రారంభమైంది. అట్లూరు మండల పరిధిలోని వరికుంటమిట్టలో ప్రజలు పొలాల్లోని బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.
గ్రామాల్లో తాగునీటి సమస్య ఆరంభం
బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు, కాశినాయనతోపాటు రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు, కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలంతోపాటు పలుచోట్ల ఇప్పుడిప్పుడే సమస్య ప్రారంభమవుతోంది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్, మే, జూన్ వరకు అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కానున్న నేపథ్యంలో.. ఏ ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది.. పరిష్కార మార్గాలు, నిధుల అవసరం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై పాలకులు, అధికార యంత్రాంగం పెద్ద గా దృష్టి సారించలేదు.
గత ఏడాది జూలై నాటికి 750 గ్రామాల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కూడా అదే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో నిబంధనలు మారడంతో గ్రామీణ ప్రాంతాల్లో నీటిపథకాల నిర్వహణ కష్టతరంగా మారింది. గతంలో వీటి ఖర్చులను జిల్లా పరిషత్తు భరించేది. ఇప్పడు ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. అసలే ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు ఈ భారం భరించలేమంటున్నాయి. వేసవి ఎద్దడిని ఎదుర్కోనే విషయమై ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులను సంప్రదించగా ఆయన స్పందించలేదు.