అభివృద్ధికి పది సూత్రాలు | KTR Says Special Activity for Municipalities Development | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పది సూత్రాలు

Published Fri, Dec 2 2022 3:09 AM | Last Updated on Fri, Dec 2 2022 2:40 PM

KTR Says Special Activity for Municipalities Development - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో పది పాయింట్ల ఎజెండాతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు.

గురువారం మునుగోడులో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సమీక్ష సందర్భంగా ఆయన ఈ పది సూత్రాల ప్రణాళికను వివరించారు. వచ్చే మార్చి నాటికల్లా ఈ ప్రణాళిక మేరకు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్యక్రమాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు రాష్ట్రానికి చెందిన 26 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు అందుకున్నాయని గుర్తుచేశారు.

దీనిని బట్టి దేశంలోనే మన మున్సిపాలిటీల పని విధానం ఉత్తమంగా నిలిచిందన్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని, వాటికోసం పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు.  

మంత్రి వివరించిన ప్రణాళిక ఇదీ.. 
► చిన్న, పెద్ద మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌ ద్వారా భవన నిర్మాణాలకు 21 రోజుల్లోపే అన్ని అనుమతులు ఇవ్వాలి. 75 చదరపు అడుగులలోపు అయితే ఏ అనుమతులూ అవసరం లేదు. ఎక్కడైనా తేడాలుంటే నా దృష్టికి తేవాలి. టీఎస్‌ బీపాస్‌ ద్వారానే అనుమతులు ఇవ్వాలి. 
► ప్రతి మున్సిపాలిటీలో ఒక్కటైనా వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఉండాలి. ప్రజలకు ఉపయోగపడేలా వచ్చే మార్చి 31లోగా పూర్తి చేయాలి. 
► అంతిమ సంస్కారాన్ని సంస్కారవంతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయాలి. వైకుంఠ రథాన్ని మున్సిపాలిటీల ఆధ్వర్యంలోనే అందుబాటులో ఉంచాలి. 
► హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో 1,700కు పైగా అర్బన్‌ నర్సరీలు ఉన్నాయి. వాటికోసం 12 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగిస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో అవసరమైన చోట ఇంకా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలి. 
► ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక దోబీ ఘాట్లు నిర్మించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలి. వాటిలో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. 
► అన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్‌ యార్డుల్లోని చెత్త తొలగింపునకు బయోమైనింగ్‌ ప్రక్రియను ప్రారంభించాలి. ఎక్కడైనా ప్రారంభించకపోతే వెంటనే చేయాలి. మానవ వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 
► ప్రతి మున్సిపాలిటీ తనదైన మాస్టర్‌ ప్లాన్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ దశలోనే ప్రజాప్రతినిధులు క్షుణ్నంగా పరిశీలించాలి. ఎక్కడ రోడ్డు వస్తుంది, ఎక్కడ చెరువులు ఉన్నాయనేది పరిశీలించి, ఆమోదించి పంపాలి. ఒకసారి ఫైన్‌ డ్రాప్ట్‌ ఆమోదించాక మార్పులు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. 
► అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఇంటికి యూనిక్‌ నంబర్‌ ఉంటుంది. అలాగే ఇక్కడ మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి యూనిక్‌ స్ట్రక్చర్‌ డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్‌ కొడితే ఇంటి యజమాని వివరాలు వచ్చేలా ఆన్‌లైన్‌ చేయాలి. హైదరాబాద్‌లో 25 లక్షల ప్రాపర్టీలు ఉంటే 18 లక్షల ప్రాపర్టీల నుంచే పన్ను వస్తోంది. ఇకపై పట్టణాలు, మున్సిపాలిటీల్లో లెక్కలోకి రాని ప్రాపర్టీలు ఉండకూడదు. అందుకోసమే ఈ విధానం తెస్తున్నాం. 
► మున్సిపాలిటీల్లోని సెలూన్ల వివరాలు సేకరించాలి. వాటి యజమానుల ఫోన్‌ నంబర్లు తీసుకోవాలి. ముందుగా సమాచారం సిద్ధం చేస్తే.. తర్వాత వారికి అవసరమైన మోడల్‌ సెలూన్లను డెవలప్‌ చేయవచ్చు. ఏసీ వంటి సదుపాయాలతో సెలూన్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం వంటి అంశాలను పరిశీలిస్తాం. 
► మిషన్‌ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి నీటిని అందించాలి. ఎక్కడైనా మంచినీరు అందని ప్రాంతాలుంటే గుర్తించి వెంటనే మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. 50వేల కన్నా జనాభా తక్కువ ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్‌ను నియమిస్తాం. 

మంత్రుల సమీక్షలు 
► ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పల్లె–పట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ, విద్యుత్, మిషన్‌ భగీరథ, రోడ్లు, డబుల్‌ బెడ్రూం ఇళ్లుŠ, గిరిజన సంక్షేమం, మహిళాశిశు సంక్షేమం, నీటిపారుదల అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత మంత్రులు సమీక్షించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై చర్చించారు.  
► జిల్లాలో ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, పూర్తికాని పనులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఎప్పటిలోగా పూర్తి చేసుకోవాలో నిర్ణయించడానికి ఈ సమావేశం నిర్వహించామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. 
► ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా పనులు చేపట్టి పంచాయతీలకు ఆదాయం పెరిగేలా, ట్రాక్టర్‌ బకాయిలు తీర్చుకునేలా చూడాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. డంపింగ్‌ యార్డుల్లో ఎరువుల తయారీతో ఆదాయం రాబట్టాలన్నారు. 
► రాష్ట్రస్థాయిలో అంతటా 4లేన్ల రోడ్లు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గత 8 ఏళ్లలో ఇందుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పంచాయతీలుగా మారిన తాండాల్లో రోడ్లకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించామని, ఐటీడీఏల పరిధిలో రూ.476 కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని మంత్రి సత్యవతి చెప్పారు.

‘మునుగోడు’కు 380 కోట్లు 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాబోయే ఆరేడు నెలల్లో రూ.1,544 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో రూ. 380 కోట్లతో మునుగోడును అభివృద్ధి చేస్తామని చెప్పారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుండెల్లో పెట్టి చూసుకుంటామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు నెలరోజుల్లోనే సమీక్ష చేపట్టామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విస్తృతంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపడతామని, మున్సిపాలిటీలకు అదనపు గ్రాంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

చేనేత జౌళిశాఖ తరఫున నేతన్నల కోసం రూ.4 కోట్లతో హ్యాండ్లూమ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రూ.30 కోట్లతో చండూరు మున్సిపాలిటీ, రూ.50 కోట్లతో చౌటుప్పల్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. చండూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తామన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రూ.కోటి వ్యయంతో నారాయణపూర్‌లో సంత్‌ సేవాలాల్‌ గిరిజన బంజారా భవన్‌ నిర్మిస్తామని, గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే 12 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ఆలోగా పనులు పూర్తిచేయాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement