సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా మైనారిటీల నియామకానికి వీలు కల్పిస్తూ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రామాణికతను తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉండి అందుకు తూట్లు పొడిచే పనుల్లో భాగస్వామి కాలేనని ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మైనారిటీల ప్రస్తావనే లేదు...
‘మున్సిపాలిటీల పాలనా వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోసం కేంద్రం 74వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. మున్సిపాలిటీల ఏర్పాటు, పాలకవర్గ సభ్యుల ఎంపిక, సీట్ల రిజర్వేషన్ల అంశాలపై రాజ్యాంగంలోని పేరా–9–ఏలో ఉన్న ఆర్టికల్ 243–పీ, 243–జీలలో స్పష్టమైన వివరణలున్నాయి. ఎక్కడా అందులో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేదు. ఎన్నికల ద్వారానే మున్సిపాలిటీల్లో సీట్ల నియామకం జరపాలని ఆర్టికల్ 243–ఆర్ పేర్కొంటోంది.
పురపాలనలో అనుభవం, పరిజ్ఞానంగల వ్యక్తులను కో–ఆప్షన్ సభ్యులుగా నియమించడానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు కమిటీ చైర్‌పర్సన్లను మున్సిపాలిటీల్లో (ఎక్స్‌అఫిషియో) సభ్యులుగా నియమించడానికే మినహాయింపు ఉంది. రాజ్యాంగంలోని పేరా–9–ఏలో మైనారిటీల ప్రస్తావన లేదు. ప్రతిపాదిత మున్సిపల్ బిల్లులోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9–ఏను ఉల్లంఘించేలా ఉన్నాయి’అని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.
ఖజానాపై భారమనే ఆ బిల్లు తిరస్కృతి
వైద్యవిద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్, వైద్య కళాశాల ల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల పదవీవిరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం తెలిసిందే. 2019 జూలై 20 నుంచి ఈ మేరకు రిటైర్మెంట్ వయసు పొడిగింపును వర్తింపజేస్తూ 2022 సెప్టెంబర్ 12న బిల్లును ప్రభుత్వం తేవడంపట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
61 ఏళ్లు నిండి పదవీ విరమణ చేసిన నాటి నుంచి తిరిగి పునర్నియమితులయ్యే వరకు ఉన్న కాలంలో ఒక్కరోజూ పనిచేయకపోయినా వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఈ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొనడంపై సైతం గవర్నర్ స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే రిటైరైన ఎందరికి దీనిద్వారా ప్రయోజనం కలుగుతుంది? ఎంత మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది? వంటి అంశాలపై తమిళిసై ప్రభుత్వ వివరణ కోరినట్లు సమాచారం.
ప్రభుత్వ వర్సిటీలకు దిక్కులేదు.. ప్రైవేటువి కావాలా?
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం సరికాదని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ కోరినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment