పురపాలికల్లో ప్రత్యేక పాలన! | Special Rule In The Muncipalities | Sakshi
Sakshi News home page

పురపాలికల్లో ప్రత్యేక పాలన!

Published Tue, Jun 18 2019 12:01 PM | Last Updated on Tue, Jun 18 2019 12:03 PM

Special Rule In The Muncipalities - Sakshi

ఉమ్మడి జిల్లాలో గడువు ముగుస్తున్న పాలక మండళ్లు
మునిసిపల్‌ కార్పొరేషన్లు : కరీంనగర్, రామగుండం
మునిసిపాలిటీలు : హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి
కొత్త మునిసిపాలిటీలు: మంథని, సుల్తానాబాద్, కొత్తపల్లి, చొప్పదండి, ధర్మపురి, రాయికల్‌   

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కొత్త పురపాలక చట్టం రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో మునిసిపల్‌ ఎన్నికలు గడువులోగా జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండళ్ల గడువు జూలై 2తో ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ముగిసిపోయినప్పటికీ, కేవలం మునిసి‘పోల్స్‌’ మాత్రమే మిగిలాయి. ఇప్పుడున్న మునిసిపల్‌ చట్టం స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో పురపాలక శాఖ(ఎంఏయూడీ) ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలతో పాటు ప్రభుత్వం పొందుపరచనున్న అంశాల నేపథ్యంలో కొత్త మునిసిపల్‌ చట్టం రూపకల్పన పూర్తయి, ఉభయసభల ఆమోదం పొంది అమలులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూలై 2తో ముగుస్తున్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పాటైన పురపాలికలకు మరో ఆరునెలల వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని మునిసిపల్‌ వర్గాలు చెబుతున్నాయి.
 
ఉమ్మడి జిల్లాలో 2 కార్పొరేషన్లు, 8 మునిసిపాలిటీలు
జూలై 2న కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రెండు మునిసిపల్‌ కార్పొరేషన్లతోపాటు 8 మునిసిపాలిటీల పాలక మండళ్లకు గడువు ముగుస్తుంది. మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీలు కాబోతున్నారు. కరీంనగర్, రామగుండం మునిసిపల్‌ కార్పొరేషన్లతోపాటు హుజూ రాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి పాలక మండళ్ల పదవీ కాలం వచ్చే నెల 2తో పూర్తి కాబోతున్నది. ప్రభుత్వ ఆలోచన ఇప్పటికే తెలియడంతో పాలక మండళ్ల సభ్యులు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. తమ తమ ప్రాంతాల్లో మిగిలిపోయిన పనులను జనరల్‌ ఫండ్, స్పెషల్‌ ఫండ్‌ కింద పూర్తి చేసుకునే పనిలో మునిగిపోయారు.

కొత్తగా ఆరు మునిసిపాలిటీలు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 2 కార్పొరేషన్లు, 8 మునిసిపాలిటీలతోపాటు కొత్తగా ఆరు పురపాలికలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో కొత్తపల్లి, చొప్పదండి, పెద్దపల్లిలో మంథని, సుల్తానాబాద్, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, రాయికల్‌ మునిసిపాలిటీలుగా అవతరించాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పాతవాటితోపాటు కొత్త మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

పురపాలికలకు ప్రత్యేక అధికారులే
జూలై 2తో పాలక మండళ్ల పాలన ముగుస్తుండడంతో 3వ తేదీ నుంచి అన్ని పురపాలికలు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కిందికి వెళ్లబోతున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిని బట్టి వాటికి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పుడున్న కమిషనర్లనే ప్రత్యేకాధికారులుగా కొనసాగిస్తారా? లేక సీనియర్‌ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు ఇటీవలే కొత్త కమిషనర్‌ ను నియమించారు. ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా వచ్చి ఉంటే రెండు బాధ్యతలు ఆయనే చూసుకునే వీలు ఉండేది. కానీ ప్రభుత్వం ఐఏఎస్‌ను నియమించలేదు. రామగుండం కార్పొరేషన్‌తోపాటు మిగతా మునిసిపాలిటీల్లో కొనసాగుతున్న కమిషనర్లను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement