1,129 కోట్లు ఇవ్వండి
* కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
* భారీ వర్షాలతో తీవ్ర స్థాయిలో నష్టం కలిగింది
* హైదరాబాద్ సహా పలు మున్సిపాలిటీలు బాగా దెబ్బతిన్నాయి
* పునరుద్ధరణ కోసం ఆర్థిక సహాయం చేయండి
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరిన కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు మున్సిపాలిటీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,129 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. గురువారం అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తులు చేశారు. తొలుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో సమావేశమైన కేటీఆర్... తెలంగాణలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిస్థితిని వివరించారు. నష్టాలపై ఒక నివేదికను ఆయనకు అందించారు. దీనిపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. విభాగాల వారీగా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా అందే పూర్తి నష్టం నివేదిక ఆధారంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం సాయం చేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారని తెలిపారు. వరదల సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును అభినందించినట్లు చెప్పారు. ఆక్రమణల తొలగింపును ప్రశంసించారని.. తెలిపారు.
మెట్రోను త్వరగా పూర్తి చేస్తాం..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఉన్న అవాంతరాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్‌తో ఇప్పటికే రెండు సార్లు చర్చించానని చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ‘‘గతంలో కేసీఆర్ విజ్ఞప్తి మేరకు మెట్రో నిర్మాణానికి సంబంధించి ‘ట్రాఫిక్ బ్లాక్ చార్జెస్’ను మాఫీ చేశారు. కానీ రైల్వే బోర్డు తిరిగి ఆ చార్జీలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.దీన్ని సమీక్షించి చార్జీలను రద్దు చేయాలని రైల్వే మంత్రిని కోరాం. హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వే టెర్మినల్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం..’’ అని కేటీఆర్ తెలిపారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హామీ
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో కూడా భేటీ అయిన కేటీఆర్... బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి.. స్టీల్‌ప్లాంట్ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నారని.. త్వరలోనే ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. ఆ టాస్క్‌ఫోర్స్‌లో రాష్ట్ర అధికారులను కూడా భాగస్వామ్యులను చేయాలని కోరగా.. కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. ఇక శుక్రవారం ప్రధాని మోదీ పాల్గొంటున్న ‘ఇండో-సాన్ 2016’ (స్వచ్ఛ భారత్ సదస్సు)లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ డెరైక్టర్ నీరజ్ మండ్లోయ్ ఆహ్వానం పంపారు. దీంతో ఆ సదస్సుల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. కేటీఆర్ వెంట కేంద్ర మంత్రులను కలసిన వారిలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్ర తేజావత్ ఉన్నారు. కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను అభినందిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.
హేతుబద్దత లేదు కాబట్టే..
సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయకపోవడానికి కారణం హేతుబద్దత లేకపోవడమేనని కేటీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ కారణాల వల్ల సిరిసిల్ల ఏర్పాటు చేయలేకపోతుండడంతో రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ‘‘సీఎం కుమారుడిగా నేను సిరిసిల్లను జిల్లాగా చేసి ఉండవచ్చు. కానీ తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతోంది. సిరిసిల్లలో 9 మండలాలు మాత్రమే కలవడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాగా ఏర్పాటు చేయడానికి పెట్టుకున్న 7 లక్షల పైచిలుకు జనాభాకు ఇది సరిపోదు..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎవరున్నా వదలం..
ఆక్రమణల తొలగింపులో సొంత పార్టీ నేతల కట్టడాలున్నా ఆపేది లేదని కేటీఆర్ పేర్కొన్నారు. నాలాల మీద వెలసిన వాణిజ్య సముదాయాలు, పెద్ద వ్యక్తుల భవనాలనే మొదట లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాలాలపై పేద ప్రజల నివాసాలు ఉంటే.. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. తప్పుల దిద్దుబాటులో భాగంగా గతంలో జీహెచ్‌ఎంసీ అనుమతులు ఇచ్చిన భవనాలను కూడా తొలగిస్తున్నట్టు చెప్పారు. అవగాహన లేకుండా ఇచ్చిన అనుమతులను.. తప్పని తెలుసుకున్నాక తొలగించడం సబబేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.