సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ పాలక మండళ్లలో మొదలైన అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 34 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్ / చైర్‌పర్సన్ / వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తూ నోటీసులు జారీ చేయగా, 30 చోట్ల ప్రత్యే క సమావేశాలు నిర్వహించారు. అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోయిన వారిలో 15 మందిని పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగతా 15 చోట్ల నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది.
9 మున్సిపాలిటీల్లో కొత్త చైర్‌పర్సన్లు
అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవుల నుంచి దిగిపోయిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల స్థానంలో కొత్త వారిని ఎన్నుకొనే ప్రక్రియ కూడా 9 మున్సిపాలిటీల్లో పూర్తయింది. మహబూబ్‌నగర్, నేరేడిచర్ల, కోదాడ, భూపాలపల్లి, నస్పూర్, మంచిర్యాల, నల్గొండ, వేములవాడ, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో కొత్త వారు కొలువు దీరారు.
జగిత్యాల, భువనగిరి, ఖానాపూర్, హుజూర్‌నగర్, సుల్తానాబాద్, నారాయణఖేడ్ మునిసిపాలిటీల్లో ఈనెల 28న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కొత్త చైర్మన్/వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాగారం, మణికొండ, తూంకుంట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, సమావేశం తేదీలను నిర్ణయించలేదు. కాగా బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్‌లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
మరికొన్ని పట్టణాల్లో అవిశ్వాస నోటీసులు
రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి ఇప్పటి వరకు 34 చోట్ల అవిశ్వాస నోటీసులు జారీ అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పురపాలక వర్గాలు చెపుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ సాగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలలోని పట్టణాల పరిధిలో మెజారిటీ మునిసిపాలిటీలను లోక్‌సభ ఎన్నికల లోపు హస్తగతం చేసుకొనే ఆలోచనలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment