నేడు మున్సిపల్ చైర్మన్లకు పరోక్ష ఎన్నికలు | Today, the municipal chairman indirect elections | Sakshi
Sakshi News home page

నేడు మున్సిపల్ చైర్మన్లకు పరోక్ష ఎన్నికలు

Published Thu, Jul 3 2014 3:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేడు మున్సిపల్ చైర్మన్లకు పరోక్ష ఎన్నికలు - Sakshi

నేడు మున్సిపల్ చైర్మన్లకు పరోక్ష ఎన్నికలు

నిరీక్షణకు తెర

 సాక్షి, హన్మకొండ: మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ల ఎన్నికపై నెలన్నర రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలలో చైర్మన్‌ల ఎన్నిక గురువారం జరగనుంది. 2014 మార్చి 30న ఎన్నికలు జరగగా... మే12న ఫలి తాలు వెలువడ్డాయి. ఫలితాల నాటికి నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించగా.. జనగామలో దాదాపు మెజార్టీకి చేరువగా వచ్చింది.
 
పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం.. ఆ పార్టీ తరఫున జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారాయి. చైర్‌పర్సన్ పీఠం దక్కించుకునేందుకు నెలన్నర రోజుల నుంచి ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలు నడిపాయి. తమ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు జారిపోకుండా చూసుకోవడంతో పాటు ఇతర పార్టీల, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు తారా స్థాయిలో ప్రయత్నాలు సాగించాయి.
 
హోరాహోరీ..
మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా చైర్‌పర్సన్ పీఠం దక్కాలంటే 15 వార్డుల్లో విజయం సాధించాలి. కానీ, కాంగ్రెస్ 7, టీఆర్‌ఎస్ 7, సీపీఎం 5, సీపీఐ 3, టీడీపీ 3, స్వతంత్రులు మూడు స్థానాల్లో విజయం సాధించడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. టీఆర్‌ఎస్-సీపీఐ కూటమికి పది స్థానాలు దక్కాయి. దీనికి తోడు ఎక్స్‌అఫీషియో మెంబర్లుగా మహబూబాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేల సీతారాంనాయక్, శంకర్‌నాయక్‌లు తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో టీఆర్‌ఎస్ కూటమి బలం 12కు చేరుకుంది.
 
 మరోవైపు అధికార పార్టీకి వ్యతిరేకంగా సీపీఎం, టీడీపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దానితో ఇక్కడ కాంగ్రెస్ కూటమి బలం 15కు చేరుకుంది. ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లు ఉండగా వీరిలో ఇద్దరు టీఆర్‌ఎస్ కూటమికి.. మరొకరు కాంగ్రెస్ కూటమికి తమ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూటమి బలం 16కు చేరగా.. టీఆర్‌ఎస్ కూటమి బలం 14కు చేరింది. దాంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు చివరి నిమిషం వరకు ఇరు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
 
 పరకాలలో టీఆర్‌ఎస్‌కు మొగ్గు  
 పరకాల నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇక్కడ చైర్‌పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అరుుంది. వీటిలో కాంగ్రెస్ 6, టీఆర్‌ఎస్ 8, బీజేపీ 2, బీఎస్‌పీ 1, ఇండిపెండెంట్లు మూడు స్థానాలు గెలుచుకున్నారు. దాంతో ఇక్కడ ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడింది. అయితే ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అయితే టీఆర్‌ఎస్ నుంచి ఎస్సీ సామాజిక వర్గం వారు ఎవరూ విజయం సాధించలేదు.
 
 దాంతో ఎస్సీ సామాజిక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మార్త రాజభద్రయ్య టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ బలం 9కి చేరుకుంది. కాగా తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తే మద్దతు ఇస్తామంటూ బీజేపీ నేతలు టీఆర్‌ఎస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారు. వీరి మద్దతు లభిస్తే టీఆర్‌ఎస్ పార్టీ నేతృత్వంలో ఇక్కడ పాలకమండలి ఏర్పాటు అవుతుంది.  అయితే ఇంత వరకూ ఈ చర్చలు కొలిక్కి రాలేదు. ఓ దశలో బీజేపీ, బీఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన చల్లా ధర్మారెడ్డిలు ఓ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ద్వారా టీఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని యోచించినా.... చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.
 
 మీకు అక్కడ.. మాకు ఇక్కడ
 భూపాలపల్లి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వైంది. టీఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 7, బీజేపీ 2, టీడీపీ 2, సీపీఐ 1, స్వతంత్రులు 1 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ కూడా హంగ్ ఏర్పడింది. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నికల విషయంలో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ నేతలు అంగీకరించారు. దానితో మున్సిపాలిటికీ సంబంధించి ఈ రెండు పార్టీలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఫలితంగా ఇక్కడ టీఆర్‌ఎస్ కూటమి బలం 11కు చేరుకుంది. అత్యవసర పరిస్థితులో స్పీకర్ మధుసూధనాచారి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ పార్టీ తీసుకోగా వైస్ చైర్మన్ పదవి బీజేపీకి  ఇవ్వనున్నారు.
 
 పొన్నాలకు దెబ్బ
 జనగామ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. కాగా చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 14, టీఆర్‌ఎస్ 6, బీజేపీ 4, స్వతంత్రులు 3, సీపీఎం ఒకటి చొప్పున  కౌన్సిలర్లు గెలిపొందారు. ఫలితాలు వెలువడే నాటికి కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టడంలో టీఆర్ ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దానితో ప్రస్తుతం ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్న కౌన్సిలర్ల సంఖ్య 14కు చేరుకుంది. దానితో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కూటమిలకు చెరో 14 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నట్టయ్యింది. అయితే ఎక్స్‌అఫీషియో మెంబర్ల హోదాలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోనున్నారు. దానితో టీఆర్‌ఎస్ కూటమి బలం 16కు చేరుకుంది.
 
 దొంతి వన్‌మాన్ షో..
 నర్సంపేట నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై దొంతి మాధవరెడ్డి అనుచరులు 12 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో టీడీపీ 1, టీఆర్‌ఎస్ 6, ఇండిపెండెంట్ ఒక స్థానం కౌన్సిలర్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో మెజార్టీ రావడంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి దొంతిమాధవరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉన్నారు. దానితో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలకమండలి ఏర్పడటం లాంఛనప్రాయమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement