పన్నులు కట్టండహో.. | pay municipal taxes | Sakshi
Sakshi News home page

పన్నులు కట్టండహో..

Published Mon, Feb 5 2018 4:48 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

pay municipal taxes - Sakshi

నిర్మల్‌ : ప్రజలు పన్నులు చెల్లిస్తేనే స్థానిక సంస్థలు పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టిపెట్టగలుగుతాయి. ఆదాయ వనరులే సమయానికి అందకపోతే అభివృద్ధి అన్న మాటే ఉండదు. ఈక్రమంలో బల్దియా ఇప్పుడు పన్నులపై దృష్టి పెట్టింది. ఏళ్ల కొద్దీ పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిలనూ వసూలు చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే పెద్ద బకాయిలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఇంటింటికీ సిబ్బంది వెళ్లడమే కాకుండా.. ఆటోల్లో మైకుల ద్వారా చాటింపులూ వేయిస్తున్నారు. ఈక్రమంలో గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గానే పన్నులు వసూలవుతున్నాయి.

ఏళ్ల కొద్దీ పెండింగ్‌లోనే..
పట్టణంగా ఎదిగి దశాబ్ధాలు గడుస్తున్నా.. నిర్మల్‌ అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదేంటని.. అధికారులు, పాలకులను ప్రశ్నిస్తే సరిపడా నిధులు రావడం లేదని సమాధానమిస్తున్నారు. స్థానికంగా వచ్చే పన్నులతోనే సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులను చేపట్టవచ్చు. వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. కానీ.. ఆస్తిపన్ను మొదలు నీటిపన్ను వరకు పన్నులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒకటి రెండు కాదు.. ఏళ్ల కొద్దీ కోట్ల రూపాయాల్లో మున్సిపల్‌కు రావాల్సిన మొండి బకాయిలు ఉన్నాయి. 

అనుమతులు లేకుండానే..
పట్టణంలో మున్సిపల్‌ అనుమతి లేకుండానే చాలా వరకు పనులు, వ్యాపారాలు కొనసాగుతున్నాయి. లేఅవుట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌దీ అదే పరిస్థితి. ఇక దుకాణాలు పెట్టిన వాళ్లు ఏళ్లకేళ్లు ట్రేడ్‌ లైసెన్స్‌లు లేకుండానే కొనసాగిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అడ్వర్టయిజ్‌మెంట్‌ పన్ను ఉంటుందనే విషయమే చాలామంది వ్యాపారులకు తెలియదు. ఆస్తిపన్నులైతే ఏళ్లుగా పెండింగ్‌లో పేరుకుపోయాయి. కనీసం నల్లబిల్లులు చెల్లించని వాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

బల్దియా తీరూ కారణమే..
ఏళ్లకేళ్లుగా పన్నులు బకాయిలో ఉండటంలో ప్రజల పాత్ర ఎంత ఉందో.. అంతకంటే ఎక్కువ బల్దియా  బాధ్యతారాహిత్యమూ ఉంది. ఇన్నేళ్లుగా ఎందుకు పన్నులు కట్టడం లేదని.. అడిగిన వాళ్లు లేరు. ఏడాదికోసారి తూతూమంత్రంగా వసూళ్లు చేపట్టడం మినహా పెద్దగా వసూలు చేయలేదు. దీంతో మొండి బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపల్‌కు ఆదాయాన్నిచ్చే వాణిజ్య సముదాయాల్లో దుకాణాలు నడుపుతున్న వాళ్లు బాగానే ఉన్నారు. కానీ.. అద్దెలను మాత్రం మున్సిపల్‌కు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ఏళ్లుగా బల్దియా సైతం చూసీచూడనట్లుగా వదిలేయడమూ ఇందుకు కారణమే. గతంలో డివిజన్‌ కేంద్రం... ఇప్పుడు జిల్లాకేంద్రంగా మారిన నిర్మల్‌ మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాలు అధికంగానే ఉన్నాయి.  వీటి నుంచైతే కోట్లలో బకాయిలు రావాల్సి ఉంది. మరోవైపు మున్సిపాలిటీ సైతం రూ.లక్షల్లో విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది.

గాడిన పడుతుందా..
మరో ఆర్థిక సంవత్సరమూ ముగిసే దశకు వచ్చింది. ఇప్పటికైనా బల్దియాల్లో పన్నుల వసూళ్లు వేగవంత చేయాలని పైనుంచి మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మల్‌ మున్సిపాలిటీలోనూ కమిషనర్‌ మంద రవిబాబు పన్ను వసూళ్లపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఇప్పటికే ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్, ప్రచారపన్ను, ఎల్‌ఆర్‌ఎస్, నీటిబిల్లు.. ఇలా అన్నింటినీ వసూలు చేయిస్తున్నారు. ప్రస్తుతం పన్నుల రాబడి మెరుగైందని చెప్పవచ్చు. కానీ.. ఇది పూర్తిస్థాయిలో చేపడితేనే మున్సిపల్‌ అభివృద్ధికి దోహదపడుతుంది.

పన్నులు చెల్లిస్తేనే పురోగతి.. 
పట్టణంలో పన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే సిబ్బంది ఇంటిం టికీ వెళ్లి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. నల్లబిల్లులు చెల్లించకపోతే కనెక్షన్‌ తొలగించనున్నాం. ట్రేడ్‌లైసెన్స్‌లు, ఇతర అనుమతులూ తీసుకోవాలని సూచిస్తున్నాం.   
 –మంద రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్, నిర్మల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement