Taxes payments
-
పన్నులన్నీ చెల్లిస్తా
లండన్: భర్త దేశ ఆర్థిక మంత్రిగా ఉండి భార్యే పన్నులు చెల్లించట్లేదనే ఆరోపణలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్రిటన్‌లోనూ ఇకపై పన్నులు చెల్లిస్తానని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి స్పష్టంచేశారు. వాస్తవానికి ఆమెకు బ్రిటన్ పౌరసత్వంలేదు. బ్రిటన్ పౌరసత్వం లేనందున విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులను బ్రిటన్‌లో చెల్లించాల్సిన పనిలేదు. ప్రసిద్ధ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో అక్షతకు 0.9 శాతం వాటా ఉంది. వేర్వేరు సంస్థల్లో పెట్టుబడులతో రూ.కోట్ల మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, స్వయంగా ఆర్థిక మంత్రి భార్యే పన్నులు చెల్లించట్లేదని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంపై అక్షత స్పందించారు. ‘బ్రిటన్‌లో వ్యాపారంపై వచ్చే ఆదాయానికి పన్నులను బ్రిటన్‌లో కడుతున్నాను. ఇక అంతర్జాతీయ ఆదాయంపై అంతర్జాతీయ పన్నునూ చెల్లిస్తున్నాను. భారత్‌సహా ప్రపంచవ్యాప్త ఆదాయంపై పన్నులను ఇకపై బ్రిటన్‌లో చెల్లించడం ప్రారంభిస్తా’ అని ట్వీట్ చేశారు. -
Telangana: కష్టకాలంలోనూ పన్ను కట్టారు
సాక్షి, హైదరాబాద్: కష్టాలు వచ్చినా కోలుకునే శక్తి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉందని గత ఆర్థిక సంవత్సరపు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను రాబడులు మందగించినా మూడో నెలలోనే పుంజుకుని అంతకు ముందు ఏడాదితో పోటీ పడేలా ఆదాయం వచ్చిందని లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2020 ఏప్రిల్, మే నెలల్లో లాక్ డౌన్ కారణంగా తగ్గిన పన్నుల ఆదాయం జూన్ నుంచే ఊపందుకుని మార్చి నాటికి ఏకంగా రూ.11 వేల కోట్లకు చేరడం రాష్ట్ర సొంత ఆదాయ పరపతికి నిదర్శనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా లాక్ డౌన్ కొనసాగినంత కాలమే పన్ను రాబడులు కొంత తగ్గుతాయని, అంటే 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మాత్రమే ఇబ్బంది ఉంటుందని, ఆ తర్వాత పన్ను ఆదాయానికి ఢోకా ఉండదని ఆ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంత ఆందోళన అక్కర్లేదు.. వాస్తవానికి కరోనా దెబ్బకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే రూ.40 వేల కోట్లకు పైగా నిధులు తగ్గాయి. అప్పులు పెరిగాయి. దీంతో నిధుల సర్దుబాటు కూడా ఆర్థిక శాఖకు సవాల్ గా మారింది. కానీ పన్ను ఆదాయంలో మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని రాబడి లెక్కలు చెబుతున్నాయి. మొత్తం రూ.1.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. అందులో 78 శాతం అంటే రూ.79 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ, అమ్మకపు పన్ను 80 శాతం వరకు రాగా, ఎక్సైజ్ రాబడులు 90 శాతం వరకు వచ్చాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం మాత్రమే 52 శాతం వచ్చింది. అయితే స్టాంపు డ్యూటీ పెంపు ద్వారా రూ.10 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించినా సాధ్యపడకపోవడం, లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 నెలల పాటు నిలిచిపోవడంతో అనుకున్న ఆదాయం రాలేదు. కానీ నెలకు రూ.500 కోట్ల చొప్పున రూ.6 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇక, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.90 వేల కోట్ల పన్ను రాబడులు వస్తాయని అంచనా వేయగా, అందులో 93 శాతానికి పైగా సమకూరింది. కానీ 2020–21లో అదే పన్ను ఆదాయం రూ.12 వేల కోట్లు ఎక్కువగా అంచనా వేయడం, మొదట్లో కరోనా దెబ్బ తగలడంతో ఆదాయం 78 శాతానికే పరిమితమైంది. ఇంత జరిగినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది పన్ను ఆదాయం తగ్గింది మాత్రం రూ.నాలుగున్నర వేల కోట్లు మాత్రమే. -
ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌తో ఇబ్బందులు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్ పరిధిలో గల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్ ధాటికి గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫ్యాన్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఫ్యాన్ కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్‌నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్‌నగర్ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు. దీనికితోడు రామగుండం కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్ అధికారులు బ్లాస్టింగ్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
పన్నులు కట్టండహో..
నిర్మల్ : ప్రజలు పన్నులు చెల్లిస్తేనే స్థానిక సంస్థలు పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టిపెట్టగలుగుతాయి. ఆదాయ వనరులే సమయానికి అందకపోతే అభివృద్ధి అన్న మాటే ఉండదు. ఈక్రమంలో బల్దియా ఇప్పుడు పన్నులపై దృష్టి పెట్టింది. ఏళ్ల కొద్దీ పెండింగ్‌లో ఉన్న మొండి బకాయిలనూ వసూలు చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే పెద్ద బకాయిలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఇంటింటికీ సిబ్బంది వెళ్లడమే కాకుండా.. ఆటోల్లో మైకుల ద్వారా చాటింపులూ వేయిస్తున్నారు. ఈక్రమంలో గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గానే పన్నులు వసూలవుతున్నాయి. ఏళ్ల కొద్దీ పెండింగ్‌లోనే.. పట్టణంగా ఎదిగి దశాబ్ధాలు గడుస్తున్నా.. నిర్మల్ అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదేంటని.. అధికారులు, పాలకులను ప్రశ్నిస్తే సరిపడా నిధులు రావడం లేదని సమాధానమిస్తున్నారు. స్థానికంగా వచ్చే పన్నులతోనే సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులను చేపట్టవచ్చు. వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. కానీ.. ఆస్తిపన్ను మొదలు నీటిపన్ను వరకు పన్నులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒకటి రెండు కాదు.. ఏళ్ల కొద్దీ కోట్ల రూపాయాల్లో మున్సిపల్‌కు రావాల్సిన మొండి బకాయిలు ఉన్నాయి. అనుమతులు లేకుండానే.. పట్టణంలో మున్సిపల్ అనుమతి లేకుండానే చాలా వరకు పనులు, వ్యాపారాలు కొనసాగుతున్నాయి. లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ తీసుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌దీ అదే పరిస్థితి. ఇక దుకాణాలు పెట్టిన వాళ్లు ఏళ్లకేళ్లు ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే కొనసాగిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అడ్వర్టయిజ్మెంట్ పన్ను ఉంటుందనే విషయమే చాలామంది వ్యాపారులకు తెలియదు. ఆస్తిపన్నులైతే ఏళ్లుగా పెండింగ్‌లో పేరుకుపోయాయి. కనీసం నల్లబిల్లులు చెల్లించని వాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బల్దియా తీరూ కారణమే.. ఏళ్లకేళ్లుగా పన్నులు బకాయిలో ఉండటంలో ప్రజల పాత్ర ఎంత ఉందో.. అంతకంటే ఎక్కువ బల్దియా బాధ్యతారాహిత్యమూ ఉంది. ఇన్నేళ్లుగా ఎందుకు పన్నులు కట్టడం లేదని.. అడిగిన వాళ్లు లేరు. ఏడాదికోసారి తూతూమంత్రంగా వసూళ్లు చేపట్టడం మినహా పెద్దగా వసూలు చేయలేదు. దీంతో మొండి బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపల్‌కు ఆదాయాన్నిచ్చే వాణిజ్య సముదాయాల్లో దుకాణాలు నడుపుతున్న వాళ్లు బాగానే ఉన్నారు. కానీ.. అద్దెలను మాత్రం మున్సిపల్‌కు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ఏళ్లుగా బల్దియా సైతం చూసీచూడనట్లుగా వదిలేయడమూ ఇందుకు కారణమే. గతంలో డివిజన్ కేంద్రం... ఇప్పుడు జిల్లాకేంద్రంగా మారిన నిర్మల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాలు అధికంగానే ఉన్నాయి. వీటి నుంచైతే కోట్లలో బకాయిలు రావాల్సి ఉంది. మరోవైపు మున్సిపాలిటీ సైతం రూ.లక్షల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. గాడిన పడుతుందా.. మరో ఆర్థిక సంవత్సరమూ ముగిసే దశకు వచ్చింది. ఇప్పటికైనా బల్దియాల్లో పన్నుల వసూళ్లు వేగవంత చేయాలని పైనుంచి మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మల్ మున్సిపాలిటీలోనూ కమిషనర్ మంద రవిబాబు పన్ను వసూళ్లపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఇప్పటికే ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్, ప్రచారపన్ను, ఎల్ఆర్ఎస్, నీటిబిల్లు.. ఇలా అన్నింటినీ వసూలు చేయిస్తున్నారు. ప్రస్తుతం పన్నుల రాబడి మెరుగైందని చెప్పవచ్చు. కానీ.. ఇది పూర్తిస్థాయిలో చేపడితేనే మున్సిపల్ అభివృద్ధికి దోహదపడుతుంది. పన్నులు చెల్లిస్తేనే పురోగతి.. పట్టణంలో పన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే సిబ్బంది ఇంటిం టికీ వెళ్లి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. నల్లబిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించనున్నాం. ట్రేడ్‌లైసెన్స్‌లు, ఇతర అనుమతులూ తీసుకోవాలని సూచిస్తున్నాం. –మంద రవిబాబు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
15 రోజులు.. రూ.16 కోట్లు
- పన్నుల వసూళ్ల లక్ష్యం సాధించాలంటూ కార్యదర్శుల మెడపై కత్తి - 921 పంచాయతీల్లో రూ.23 కోట్లకు పైగా డిమాండ్ - ఇప్పటి వరకూ వసూలైంది రూ.7 కోట్లే.. - ఆర్థిక సంవత్సరం ముగింపులోగా పూర్తి చేయాలని ఆదేశాలు విజయనగరం మున్సిపాలిటీ: పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు.. అభివృద్ధి పనులకు పైసా అయినా విదిల్చేందుకు రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్న టీడీపీ సర్కారు.. పల్లె ప్రజల నుంచి పన్నులను మాత్రం ముక్కుపిండి మరీ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో శతశాతం పన్నులు వసూలు చేయాలంటూ ప్రభుత్వం కార్యదర్శుల మెడపై కత్తి పెట్టింది. ప్రభుత్వం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇప్పటి వరకూ పన్నుల వసూళ్లపై దృష్టి సారించని అధికారులు.. ఇప్పటికిప్పుడు లక్ష్యాలను అధిగమించేందుకు హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు నిర్దేశించిన గడువులోగా శతశాతం లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పన్నుల ఆదాయమే దిక్కా..! రాష్ట్ర ప్రభుత్వం అనుకరిస్తున్న వైఖరి చూస్తుంటే గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే గత్యంతరంగా కనిపిస్తోంది. వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో పైసా కూడా విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం పద్దు కింద రెండు విడతల్లో విడుదల చేసిన రూ.49.36 కోట్ల నిధులను ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లకే అత్యధికంగా కేటాయించారు. మిగిలిన కొద్దిపాటి మొత్తాన్ని గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు, తాగు నీటి పథకాల నిర్వహణకు వినియోగించే విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటూ స్వయానా రాష్ట ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి మాట దెవుడెరుగు.. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. 921 గ్రామ పంచాయతీల నుంచి వచ్చింది రూ.7 కోట్లే జిల్లాలోని 34 మండలాల్లో 921 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంతోపాటు గత ఆర్థిక సంవత్సరాల్లో వివిధ పన్నుల రూపంలో గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన బకాయి మొత్తం రూ.23 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే పన్నుల వసూళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యంగా ప్రారంభించటంతో ఇప్పటి వరకు రూ.7కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇందులో విజయనగరం డివిజన్ పరిధిలో అధికంగా రూ.6 కోట్లు వసూలు కాగా.. పార్వతీపురం డివిజన్లో రూ.కోటి మాత్రమే వచ్చింది. ఈ లెక్కన మిగిలిన 15 రోజుల్లో మరో రూ.16 కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో సమకూర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మండలాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి.. కార్యదర్శులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం. శతశాతం పన్నులు వసూలు చేయాల్సిందే.. గ్రామ పంచాయతీల్లో వివిధ పద్దుల కింద వసూలు చేయాల్సిన పన్ను బకాయిలను ఈ నెల 31లోగా వసూలు చేయాలని ఆదేశించాం. ఈ విషయంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోని పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలుంటాయి. పన్నుల వసూళ్ల మొత్తం తగ్గిపోతే ఆర్థిక సంఘం నిధులు కింద కేంద్రం విడుదల చేసే మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. - ఎస్.సత్యనారాయణరాజు, జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం.