- పన్నుల వసూళ్ల లక్ష్యం సాధించాలంటూ కార్యదర్శుల మెడపై కత్తి
- 921 పంచాయతీల్లో రూ.23 కోట్లకు పైగా డిమాండ్
- ఇప్పటి వరకూ వసూలైంది రూ.7 కోట్లే..
- ఆర్థిక సంవత్సరం ముగింపులోగా పూర్తి చేయాలని ఆదేశాలు
విజయనగరం మున్సిపాలిటీ: పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు.. అభివృద్ధి పనులకు పైసా అయినా విదిల్చేందుకు రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్న టీడీపీ సర్కారు.. పల్లె ప్రజల నుంచి పన్నులను మాత్రం ముక్కుపిండి మరీ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో శతశాతం పన్నులు వసూలు చేయాలంటూ ప్రభుత్వం కార్యదర్శుల మెడపై కత్తి పెట్టింది. ప్రభుత్వం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇప్పటి వరకూ పన్నుల వసూళ్లపై దృష్టి సారించని అధికారులు.. ఇప్పటికిప్పుడు లక్ష్యాలను అధిగమించేందుకు హడావుడి చేస్తున్నారు. ఈ మేరకు నిర్దేశించిన గడువులోగా శతశాతం లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
పన్నుల ఆదాయమే దిక్కా..!
రాష్ట్ర ప్రభుత్వం అనుకరిస్తున్న వైఖరి చూస్తుంటే గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే గత్యంతరంగా కనిపిస్తోంది. వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో పైసా కూడా విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం పద్దు కింద రెండు విడతల్లో విడుదల చేసిన రూ.49.36 కోట్ల నిధులను ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లకే అత్యధికంగా కేటాయించారు. మిగిలిన కొద్దిపాటి మొత్తాన్ని గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు, తాగు నీటి పథకాల నిర్వహణకు వినియోగించే విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటూ స్వయానా రాష్ట ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి మాట దెవుడెరుగు.. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
921 గ్రామ పంచాయతీల నుంచి వచ్చింది రూ.7 కోట్లే
జిల్లాలోని 34 మండలాల్లో 921 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంతోపాటు గత ఆర్థిక సంవత్సరాల్లో వివిధ పన్నుల రూపంలో గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన బకాయి మొత్తం రూ.23 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే పన్నుల వసూళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యంగా ప్రారంభించటంతో ఇప్పటి వరకు రూ.7కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇందులో విజయనగరం డివిజన్ పరిధిలో అధికంగా రూ.6 కోట్లు వసూలు కాగా.. పార్వతీపురం డివిజన్‌లో రూ.కోటి మాత్రమే వచ్చింది. ఈ లెక్కన మిగిలిన 15 రోజుల్లో మరో రూ.16 కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో సమకూర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మండలాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి.. కార్యదర్శులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.
శతశాతం పన్నులు వసూలు చేయాల్సిందే..
గ్రామ పంచాయతీల్లో వివిధ పద్దుల కింద వసూలు చేయాల్సిన పన్ను బకాయిలను ఈ నెల 31లోగా వసూలు చేయాలని ఆదేశించాం. ఈ విషయంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోని పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలుంటాయి. పన్నుల వసూళ్ల మొత్తం తగ్గిపోతే ఆర్థిక సంఘం నిధులు కింద కేంద్రం విడుదల చేసే మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
- ఎస్.సత్యనారాయణరాజు, జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం.
15 రోజులు.. రూ.16 కోట్లు
Published Thu, Mar 17 2016 10:35 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement