- మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తేనే మాఫీ అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే ప్రస్తుత సంవత్సర పన్నుతో పాటు పాత బకాయిలను కూడా కలిపి ఒకేసారి మొత్తం పన్ను చెల్లిస్తేనే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇది అమలవుతుందని తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వచ్చే మార్చి 31వ తేదీని తుది గడువుగా పేర్కొంది.
పురపాలక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను ప్రోత్సహించేందుకు అపరాధ రుసుమును మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను సీఎం శుక్రవారం ఆమోదించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 68 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుమును మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే అపరాధ రుసుముతో పాత బకాయిలను చెల్లించిన వారికీ ఈ మాఫీ వర్తించనుంది. అయితే ఈ మాఫీ అయ్యే అపరాధ రుసుమును నగదు రూపంలో తిరిగి చెల్లించకుండా.. వచ్చే ఏడాది పన్నుల్లో సర్దుబాటు చేస్తారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గృహ, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఆస్తి పన్నుల బకాయిలు 51.42 కోట్ల వరకు ఉన్నాయి. సాధారణంగా బకాయిలపై 2 శాతం అపరాధ రుసుము విధిస్తారు. ఈ లెక్కన రూ. 9 కోట్లకు పైగా అపరాధ రుసుము మాఫీ కానుంది.